- ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు
- భూ కుంభకోణాలకు పాల్పడిన అధికారులపై తప్పనిసరిగా చర్యలు
- త్వరలో తల్లికి వందనంతోపాటు మిగిలిన హామీలు అమలుచేస్తాం
- అనాడు నైరాశ్యంలో ఉన్న ప్రజలకు ఆశాదీపంలా యువగళం
- సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషితో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు
- ఏడు నెలల్లో 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు
- 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని దాటేస్తాం
అమరావతి (చైతన్యరథం): ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి వస్తాయని, దీనికి సంబంధించి ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు చేశామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అయితే రాజధాని గ్రామాల్లో మాత్రం రిజిస్ట్రేషన్ విలువల్లో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గ్రోత్ సెంటర్లుగా ఉండి, మార్కెట్ విలువ 10 రెట్లు అదనంగా ఉన్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు అక్కడి మార్కెట్ విలువల కన్నా ఎక్కువగా ఉన్నాయని ఆ ప్రాంతాల్లో విలువలు తగ్గుతాయని చెప్పారు. సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్ లో తననకు కలిసిన మీడియా ప్రతినిధులతో మంత్రి అనగాని మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎమ్మార్వోలను అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున భూ అక్రమణలకు పాల్పడ్డారని, అలా పేదల భూములను అక్రమ పద్ధతుల్లో స్వాధీనం చేసుకున్న వారిని వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. నేరం రుజువైన అధికారులపైన కఠిన చర్యలు కచ్చితంగా తీసుకుంటామని చెప్పారు. భూ వివాదాలకు సంబంధించి సమగ్రంగా అధ్యయనం చేసేందుకు 22 ఏ భూములు, 596 జీవోలతోపాటు మరో నాలుగు అంశాలపై కలెక్టర్లతో కమిటీలను నియమించనున్నట్లు చెప్పారు.
ప్రభంజనంలా యువగళం
తమ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ గత ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా సరిగ్గా రెండేళ్ల క్రితం జనవరి 27న ప్రారంభించిన యువగళం పాదయాత్ర ప్రభంజనంలా సాగిందని మంత్రి అనగాని తెలిపారు. అనాటి జగన్ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిపించినప్పటికీ, సాదయాత్రను అడ్డుకునేందుకు రకరకాల కుట్రలు పన్నినప్పటికీ ప్రజాబలంతో ముందుకు సాగి ఆ ప్రభుత్వ వైఫల్యాలను యువనేత లోకేష్ ఎండగట్టారని చెప్పారు. యువగళం ప్రభావంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వ నాయకులతో సమన్వయం చేసుకుంటూ నారా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ పని చేస్తున్నారని చెప్పారు. ఇందుకు దావోస్ పర్యటనే నిదర్శనమన్నారు. గత ఐదేళ్ల జగన్ విధ్వంస పాలన కారణంగా రాష్ట్రానికి రావాలంటనే పారిశ్రామికవేత్తలు భయపడిపోయారని, అలాంటిది కూటమి ప్రభుత్వ చేస్తున్న కృషి కారణంగా రాష్ట్రానికి తిరిగి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, గత ఏడు నెలల కాలంలోనే ఆరు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని అన్నారు. దావోస్ పర్యటన ద్వారా సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ప్రపంచ పారిశ్రామికవేత్తలతో భేటీి అయ్యి రాష్ట్ర్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను, అవకాశాలను వివరించి బ్రాండ్ ఏపీని పున:ప్రతిష్టించారని చెప్పారు. యువతతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని, కానీ ప్రస్తుతం వస్తున్న పెట్టుబడుల ప్రవాహం చూస్తుంటే అంతకుమించి ఉపాధి కల్పన జరిగే అవకాశముందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని, అటు సంక్షేమం విషయంలోనూ వెనక్కి తగ్గడం లేదన్నారు. త్వరలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని, కేంద్ర ప్రభుత్వం తదుపరి తమ వాటాను విడుదల చేయగానే రైతులకు ఏడాదికి 20 వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.