- వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే వర్మ సవాల్
- రైతులను ముంచింది జగన్‌రెడ్డే..
- చర్చకు వస్తే భూ దోపిడీ నిగ్గు తేలుస్తాం
- ఎలాంటి విచారణకైనా టీడీపీ సిద్ధం
పిఠాపురం (చైతన్యరథం): కాకినాడ ఎస్‌ఈజడ్‌పై బహిరంగ చర్చకు రావాలంటూ వైసీపీ నేతలకు టీడీపీ నాయకుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ సవాల్ విసిరారు. మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీత ఆ అంశంపై చేసిన విమర్శలను వర్మ ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశం లో గట్టిగా తిప్పికొట్టారు. సీబీఐ, ఈడీ సంస్థల విచారణ కోరుతున్న వైసీపీ నేతలు దొంగే దొంగ..దొంగ అని అరిచినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి విచారణకైనా టీడీపీ ఎప్పుడు సిద్ధమేనని సవాల్ విసిరారు. కాకినాడ ఎస్‌ఈజడ్ భూదోపిడీపై నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. కాకినాడ ఎస్‌ఈజడ్ వ్యవహారం బయటపడటంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని వర్మ ఎద్దేవా చేశారు. రైతులపై తెలుగుదేశం ప్రభుత్వం కేసులు పెట్టిందని విమర్శిస్తున్న వైసీపీ నాయకులు కాకినాడ ఎస్‌ఈజడ్ పెట్టింది ఎవరో తెలుసుకోవాలన్నారు. సెజ్‌ను ఎవరు ప్రారంభించారు? ఎవరెవరు బినామీలు ఉన్నారనే విషయాలపై సోమవారం సాయంత్రం 3గంటలకు ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో నిర్వహించే బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రాకపోతే రైతులకు అన్యాయం చేసిందే వారేనని అంగీకరించినట్టేనని పేర్కొన్నారు. తాము అన్ని పత్రాలతో చర్చకు సిద్ధంగా ఉన్నామని, వైసీపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎస్‌ఈజడ్ వ్యవహారంలో రైతులను నిలువునా ముంచింది మాజీ ముఖ్యమంత్రి,, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆరోపించారు. వైసీపీ నేతలు నేరుగా రైతుల భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం ఇందుకు నిదర్శనం ని చెప్పారు. కేవలం పెయిడ్ ఆర్టిస్టులతో వైసీపీ నాటకాలు ఆడుతోందని మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.