నెల్లూరు (చైతన్యరథం): తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసేందుకు వైసీపీ నాయకులు కంకణం కట్టుకున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆనం.. వైసీపీ నాయకుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. టీటీడీ పాలకవర్గాన్ని అవమానిస్తూ దూషించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వడం మానేసి బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. తిరుమల వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో ఒక రకంగా.. ముక్కోటి ఏకాదశి సమయంలో మరో విధంగా, ఒంటిమిట్టలో శ్రీకోదండరామస్వామివారి కల్యాణం సందర్భంగా.. ఇలా ప్రతిసారీ ఏదో ఒక అంశాన్ని లేవనెత్తి అనవసర విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు గోశాలపై పడ్డారు. ఇదంతా చూస్తుంటే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై నిందలు మోపడమే పనిగా పెట్టుకున్నారని అర్ధమవుతోంది. బుధవారం సీపీఐ జాతీయ నాయకులు నారాయణ గోశాలకు వెళ్లారు. అక్కడ ఎలాంటి సమస్యలు లేవు, అంతా సజావుగా ఉందని చెప్పారు. వైసీపీ నాయకులు మాత్రం సవాళ్లు చేస్తున్నారు.
గోశాలలో కొన్నిసార్లు సహజ మరణాలుంటాయి.
వాటిని కూడా పాలకమండలి, రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ చేసిన సమయంలో అంతులేని దోపిడీకి పాల్పడ్డారు. ఆలయం నిధులను సీసీ రోడ్ల పేరుతో దోచేశారు. దేవస్థానాన్ని అడ్డుగా పెట్టుకొని రూ. వందల కోట్లు దోచేశారు. కూటమి ప్రభుత్వాన్ని తప్పుపట్టే విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. లేదంటే సవాళ్లు విసురుతున్నారు. కరుణాకర్ రెడ్డికి విజ్ఞత లేదు. మీ పునాదులు కదిలిపోయాయి. మీగురించి ఆలోచించే వారు లేరు. ఆచారాలు, టీటీడీ విధానాల పట్ల తప్పుడు ఆలోచనలు మంచిది కాదని అనం హెచ్చరించారు.