- ఓడినా నియోజకవర్గాన్ని వీడలేదు, ప్రజలతో మమేకమయ్యాను
- సొంతనిధులతో 27 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాను
- మళ్లీ అక్కడే పోటీచేయాలనుకుంటున్నావా అని చంద్రబాబు అడిగారు
- మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు, తగ్గేదే లేదన్నాను
- నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో లోకేష్
మంగళగిరి: ఓడిన తరువాత ఈ నాలుగేళ్ల తొమ్మిది నెలల్లో మంగళగిరి ప్రజల మనసులను గెలుచుకున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఓడినా నేను నియోజకవర్గాన్ని వీడలేదు. నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర పార్టీలనుంచి ఎంతమంది వచ్చి చేరినా ఇప్పుడున్న కేడర్ ను కాపాడే బాధ్యత నాది అన్నారు. తాడేపల్లిలోని సీఎస్‌ఆర్ కళ్యాణమండపంలో బుధవారం జరిగిన మంగళగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. యువనేత లోకేష్ వచ్చినప్పుడు అభిమానుల కేరింతలు, నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. వేదికపైనున్న పార్టీ నేతలను పేరుపేరునా లోకేష్ పలకరించారు. యువనేతను పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు గజమాలతో సత్కరించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ విస్తృతస్థాయి సమావేశానికి విచ్చేసిన నా ప్రాణ సమానమైన మంగళగిరి టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. మంగళగిరి ప్రజలది మంచి మనసు. మంగళగిరి మినీ ఆంధ్రప్రదేశ్ లాంటిది. రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలవారు మంగళగిరిలో నివసిస్తారు. గతంలో గ్రామగ్రామానికి తిరిగి చేనేతలు, స్వర్ణకారులు, బీసీలు, దళితులు, ఎస్టీలు, మైనారిటీల సమస్యలను తెలుసుకున్నాను. యువగళం యాత్రలో అనేక సమస్యలు విన్నపుడు నాకు మంగళగిరి గుర్తు వచ్చేది, వారు చెప్పే సమస్యలన్నీ నేను మంగళగిరిలోనే తెలుసుకున్నాను. 2019లో గతంలో టీడీపీ ఎన్నడూ గెలవని మంగళగిరి నియోజకవర్గంలో నేను పోటీచేశాను, ప్రజలు దయ చూపలేదు. ఆనాడు లోకేష్ ఏమిటో ప్రజలు తెలుసుకోలేకపోయారు. ఓడినా నేను నియోజకవర్గాన్ని వీడలేదని లోకేష్ అన్నారు.
సొంతనిధులతో 27 సంక్షేమ కార్యక్రమాలు
గత నాలుగేళ్ల తొమ్మిది నెలల కాలంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యాను. సొంతనిధులతో 27 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాను. అన్న క్యాంటీన్ల ద్వారా పేదవారి ఆకలి తీర్చాం, పెళ్లి కానుకలు అందజేసాం, స్వయం ఉపాధి కోసం తోపుడు బల్లలు అందించాం. స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్ శిక్షణ ఇచ్చి ఉచితంగా మెషిన్లు అందించాం. ఎన్టీఆర్ సంజీవని ద్వారా ఉచితంగా వైద్యం, మందులు ఇస్తున్నాం. యువ పేరుతో స్కిల్ డెవలప్మెంట్ అందిస్తున్నాం, జలధార పేరుతో ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందిస్తున్నాం, వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసాం, యువత కోసం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసాం, టోర్నమెంట్లు నిర్వహిస్తున్నాం. దివ్యాంగుల కోసం ట్రై సైకిల్స్ ఇచ్చాం, రజక సోదరులకు ఇస్త్రీ బల్లలు అందించాం. స్వర్ణకారులకు లక్ష్మినరసింహ స్వర్ణకార సహకార సంఘం ఏర్పాటు చేసాం. పురోహితులు, పాస్టర్లు, ఇమామ్ లకు పండుగ కానుకలు ఇస్తున్నాం. రోడ్లకు మరమ్మతులు చేసాం. కొన్ని రోడ్లు వేసాం, నాయీ బ్రాహ్మణులకు సెలూన్ చైర్లు అందించాం. కార్మికుల కోసం వెల్డింగ్ మెషిన్స్ అందించాం. కోవిడ్ సమయంలో వైద్య సహాయం అందించాం. టీడీపీ కార్యకర్తలకు ఆర్థిక సాయం అందించాం, ఆర్‌ఎంపీ డాక్టర్లకు వైద్య పరికరాలు అందించాం. వేసవిలో చలి వేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసాం. దళిత బిడ్డల పెళ్లి కి తాళిబొట్లు అందిస్తున్నాం, చేనేత కార్మికులకు రాట్నాలు అందించామని లోకేష్ చెప్పారు.
మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు
ఓడినపుడు చాలామంది నన్ను ఎగతాళి చేశారు. మళ్లీ మంగళగిరి నుంచే పోటీచేయాలనుకుంటున్నావా అని చంద్రబాబు అడిగారు. మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు. తగ్గేదే లేదని చెప్పాను. వైసీపీ ప్రభుత్వం మంగళగిరికి చేసింది గుండుసున్నా. రెండుసార్లు వైసీపీిని గెలిపించారు, మంగళగిరి అభివృద్ధి ఎలా ఉండాలి? ఇప్పుడు ఎమ్మెల్యేనే మారిపోయే పరిస్థితి వచ్చింది? ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేశాక మీడియా మిత్రులతో మాట్లాడుతూ మా సీఎం మంగళగిరి ప్రజలను మోసం చేశారన్నారు. ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని మాటతప్పి, మడమతిప్పారు, ప్రత్యేక నిధులు కేటాయిస్తానని చెప్పి నయాపైసా కేటాయించలేదు. ఆర్కే నే జగన్ పని అయిపోయిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మంగళగిరి ప్రజలను మోసం చేసిందని లోకేష్ విమర్శించారు.
మంగళగిరి అభివృద్ధి బాధ్యత నాది
మంగళగిరిని నా కడుపులో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా. ఓడిపోయినా కష్టకాలంలో నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడ్డా. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించా. టీడీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఇళ్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తాం. నియోజకవర్గంలో ఎసైన్డ్, ప్రభుత్వ, ఇరిగేషన్, ఎండోమెంట్ భూముల్లో దశాబ్దాలుగా ఎంతోమంది పేదలు నివసిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లలో వారి స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్
టిడ్కో ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటా. తాడేపల్లిలో రైతులకు అత్యంత ఇబ్బందికరంగా తయారైన యూ 1 జోన్ ఎత్తేసి ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తాం. నియోజకవర్గంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ఫ్లైఓవర్, అండర్ పాస్ లు ఏర్పాటుచేస్తాం. ఉపకులాల వారీగా అన్ని గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు, స్మశానాలకు స్థలాలు కేటాయిస్తాం. రైతాంగానికి అండగా నిలబడతాం. నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది, వాటర్ గ్రిడ్ ద్వారా శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరిస్తాం. భూగర్భ డ్రైనేజి ఏర్పాటుచేసే బాధ్యత నాది. ఇక మనముందు ఉన్నది కేవలం వందరోజులు మాత్రమే. నియోజకవర్గంలోని పెద్దల వద్దకువెళ్లి కలుస్తున్నాను. సమయాన్ని బట్టి అందరినీ కలుస్తా. నాయకులకు ప్రోటోకాల్, ఈగోలు వద్దు, అందరం కలిసి పనిచేద్దామని లోకేష్ పిలుపు ఇచ్చారు.
గ్రూప్ రాజకీయాలు వద్దు
ఓటర్ వెరిఫికేషన్ పై కేడర్ అంతా దృష్టిసారించాలి, ఇందుకోసం క్లస్టర్, యూనిట్, బూత్ వ్యవస్థ ఏర్పాటుచేశాం. ప్రతిగడపకు వెళ్లి మన హామీలను ప్రజల్లోకి వెళ్లాలి, ఇప్పటికి 52వేల ఇళ్ల వద్దకు వెళ్లారు, జనవరికల్లా అన్ని ఇళ్లకు వెళ్లాలి. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ పేరిట చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారు, ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మన నియోజకవర్గంలో ఇళ్లు లేని వారు, రెగ్యులరైజ్ చేయాల్సిన వివరాలు సేకరించాలి. ప్రతి గడపకూ వెళ్లాలి. కార్యకర్తలు, నాయకులు గ్రూప్ రాజకీయాల జోలికి వెళ్లవద్దు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి నేను ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలో ఎవరు మంచి పనితీరు కనబరుస్తారో వారినే నేను గౌరవిస్తాను. వారానికి 5రోజులు ఓపిగ్గా ప్రజల వద్దకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలు రాసుకోండి. 45రోజుల్లో పూర్తిచేయవచ్చు. ప్రచార ఆర్భాటం వద్దు. బూత్ లలో ఉన్న కమిటీ సభ్యులు ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వైకాపా వాళ్ల ఇళ్లకు కూడా వెళ్లి మనం అమలుచేసే పథకాలు తెలియజేయాలని లోకేష్ సూచించారు.
కేడర్ ను కాపాడే బాధ్యత నాది
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర పార్టీలనుంచి పలువురు వచ్చినా ఇప్పుడున్న కేడర్ ను కాపాడే బాధ్యత నాది. మనవారిని ఇబ్బంది పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోను. పార్టీకోసం ఎవరు ఎంతకష్టపడ్డారో నాకు తెలుసు, మీ బాధ్యత నాది. ఈ ప్రభుత్వంలో అందరూ పోలీసులతో సహా బాధితులే. నాయకులంతా అందరూ ప్రజల్లో ఉండి, ప్రజలతో మమేకమై మంగళగిరిలో భారీ మెజారిటీతో పసుపు జెండా ఎగురవేయాలి. వచ్చే ఎన్నికల్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే చంద్రబాబుతో పోరాడి ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా. వచ్చే వంద రోజులు పార్టీకోసం కేడర్ అంతా అహర్నిశలు కృషిచేయండి. ఇప్పటి వైసీపీ ఇన్‌చార్జి గురించి మాట్లాడాల్సిన పనిలేదు, ఎవరేమిటో ప్రజలకు తెలుసునని లోకేష్ అన్నారు.
వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రచారాలు నమ్మొదు
మళ్లీ ప్రత్యేకంగా క్లస్టర్, యూనిట్, బూత్ బాధ్యులతో సమావేశమవుతాను. ఓడిన తరువాత ఈ నాలుగేళ్ల తొమ్మిది నెలల్లో మంగళగిరి ప్రజల మనసులను గెలుచుకున్నాను. మంగళగిరి నుంచే పోటీచేస్తా, ఎటువంటి అపోహలు వద్దు. వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రచారాలు నమ్మొద్దు. సొంత బాబాయిని చంపి మనపై నెట్టారు, కోడికత్తి డ్రామా ఆడి, ఆ నెపాన్ని మనపై వేసిన చరిత్ర వైసీపీది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మనం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాబోయే అయిదేళ్లలో మంగళగిరి రూపురేఖలు మార్చే బాధ్యత నాది, అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీకి ఘనవిజయం చేకూర్చాలని లోకేష్ కోరారు.