- పాలనలోపడి కార్యకర్తలను కలవలేకపోయా
- ఇప్పుడు మీతూ సమావేశం సంతోషిన్నిస్తోంది..
- ప్రతి పర్యటనలో ఇదొక బాధ్యతగా పెట్టుకుంటా
- ఏ ఓటమైనా పాలనాలోపంతో కాదు, శ్రేణుల అసంతృప్తివల్లే
- వైసీపీకి ఉపకారం చేస్తే పాముకు పాలుపోసినట్లే…
- ఈ విషయం నేతలు, కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలి
- వైనాట్ 175, వైనాట్ కుప్పం అన్నవాళ్లు ఇప్పుడేమయ్యారు?
- 30ఏళ్ల తర్వాత జీడీ నెల్లూరులో విజయం కార్యకర్తల కృషి
- ఇక ఈ ప్రాంతం.. తెదేపా కంచుకోటగా మారుస్తా
- జీడీ నెల్లూరు కార్యకర్తలతో చంద్రబాబు విస్తృత సమావేశం
- ప్రతిభ కనబర్చిన శ్రేణులకు ప్రత్యేక ప్రశంసలు
- నేతల పనితీరుపై కార్యకర్తల భేటీలో ఓపెన్ డిబేట్
జీడీ నెల్లూరు (చైతన్య రథం): ‘కార్యకర్తలను చూస్తే నాకు కొండంత ధైర్యం వస్తుంది. ఎనిమిది నెలలుగా పరిపాలనలో నిమగ్నమయ్యాను. అందుకే పార్టీ శ్రేణులతో సమావేశం కాలేకపోయాను. మళ్లీ కుటుంబ సమానులైన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉంది. 30 ఏళ్ల తర్వాత జీడీ నెల్లూరు కోటపై టీడీపీ జెండా ఎగురవేశాం. పార్టీ విజయం కోసం కార్యకర్తలు ప్రాణం పెట్టి పనిచేశారు. మీకు నేను పూర్తిగా సహకరిస్తా. ఈ నియోజకవర్గం పార్టీకి కంచుకోటగా మార్చాలి. తంబళ్లపల్లి, పుంగనూరులో కొంచెం గురితప్పాం తప్ప జిల్లా అంతటా టీడీపీ జెండా ఎగిరింది. వైనాట్ 175, వైనాట్ కుప్పం అన్నవాళ్లు ఏమయ్యారు.? మొన్నటి ఎన్నికల్లో సరిగా చేసుకునివుంటే పులివెందులలోనూ మనమే గెలిచేవాళ్లం. పార్టీ స్థాపించిన నాటినుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. ఈసారి మనం పగడ్బందీగా వ్యవహరించడంతో ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలు గెలిచాం. మిమ్మల్ని, నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రాణాలు పోయినా పర్వాలేదుగానీ, వారికి లొంగబోమని పోరాడటంతో 93 శాతం సీట్లు గెలిచాం’ అని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జీడీ నెల్లూరులో పేదల సేవలో కార్యక్రమం అనంతరం నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో శనివారం సమావేశమయ్యారు.
2004, 2019లో కార్యకర్తల అసంతృప్తివల్లే ఓటమి
‘దేశంలో ఎక్కడా ఇలాంటి విజయం రాలేదు. దీనికి కారణం ఐదేళ్లపాటు ప్రజలు, కార్యకర్తలు నరకం చూడటం. శనివారం వస్తే ఎక్కడ ప్రొక్లెయిన్ వస్తుందో, ఏ నాయకుడు అరెస్టవుతారో తెలియలేదు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని యంత్రాంగం టీడీపీకి ఉంది. దీనికి నేను చాలా గర్వపడుతున్నా. నేను రుణపడి ఉన్నానంటే అది పార్టీ కార్యకర్తలకే. అందుకే మీ రుణం తీర్చుకుంటానని చెప్తున్నా. ఇందుకు మీ సహకారం కూడా అవసరం. 2004, 2019లో పార్టీని నేనే ఓడిరచుకున్నా. రాష్ట్రాన్ని బాగు చేయాలని, ప్రజల తలరాతలు మార్చాలని మిమ్మల్ని పట్టించుకోకుండా పని చేశా. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలబెట్టా. 2004లో ఓడిపోయాక అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టింది. మళ్లీ 2014లో చాలా సమస్యలు వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో పార్టీని కాపాడుకోవడం చారిత్రాత్మక అవసరం. కానీ సమైక్య ముసుగులో వైసీపీ విభజన కోరుకుంది. అయినా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మనల్ని గెలిపించారు. 2014-2019 మధ్య అవిశ్రాంతంగా పనిచేసి 13.5 గ్రోత్‌రేట్ సాధించాం. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందంటే దానికి కారణం ప్రజలకు మంచి చేయకపోవడం వల్ల కాదు… కార్యకర్తల్లో అసంతృప్తి వల్లే. మీలో అనువణువు పసుపు రక్తం తప్ప మరొకటి ఉండదు. మీతో నేను మాట్లాడకుంటా ఉంటే మీరు కూడా నాపై అసంతృప్తితో ఉంటారు. అందుకే కార్యకర్తల కోసం సమావేశం ఏర్పాటు చేశాను’ అని చంద్రబాబు అన్నారు.
నాకు, కార్యకర్తలకు మధ్య దూరం ఉండదు
‘మునుపు ఎన్నికలయ్యాక కేడర్ కోసం ఆలోచించలేకపోయాం. కానీ ఈసారి కార్యకర్తలకు, నాకు గ్యాప్ ఉండదు. పర్యటనకు వెళ్లిన ప్రతిచోటా కార్యకర్తలు, నేతలతో సమావేశమవుతా. పొలిటికల్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. పంచాయతీ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీ, అనుబంధ కమిటీలున్నాయి. ఎన్నికల్లో గెలవడానికి కొత్తగా క్లస్టర్, యూనిట్, బూత్‌స్థాయిలను తీసుకొచ్చాం. సోషల్ రీ ఇంజనీరింగ్‌వల్ల ఘన విజయం సాధించాం. జనాభా దామాషా ప్రకారం బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. టీడీపీకి ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ ఉంది. పార్టీలో ఉండే సీనియారిటీని కూడా అందరూ గుర్తుంచుకోవాలి. పార్టీ కోసం ఎప్పటినుంచో పనిచేసి ఆస్తులను పోగొట్టుకున్నవాళ్లు ఉన్నారు. పార్టీకి మరింత యువత బలం కావాలి. మొన్నటి ఎన్నికల్లో ఎక్కువ మంది యువతకు ప్రాధాన్యతనిచ్చాం. 120మంది ఓటర్ల కోసం కొత్తగా తీసుకొచ్చిన కుటుంబ సాధికార సారథిగా నేను కూడా ఉంటాను. పదవుల నియామకాల్లో పార్టీకి సేవ చేసిన వారికే ప్రాధాన్యముంటుంది. ప్రజలు, కార్యకర్తల ఎంపిక మేరకే ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేశాను. ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా ఎమ్మెల్యే, ఎంపీ గురించి మీనుంచి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాను. ప్రభుత్వంలో ఉన్న మనం ప్రజల కోసం ఏంచేస్తున్నామో చెప్పడానికి కూడా సోషల్ మీడియా ఒక ఆయుధం… ప్రజలకు సమాచారం త్వరగా చేరవేయడంలో కీలకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలి’ అని చంద్రబాబు సూచించారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్యకర్తల సమస్యలు తీర్చాలి
ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలతో అనుసంధానం కావడంతోపాటు కేడర్‌కు అందుబాటులో ఉండాలి. సమస్యలు పరిష్కరించాలి. జనసేన, బీజేపీలతో సమన్వయంతో ముందుకెళ్లాలి. నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళాలు పెట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలి. వైసీపీ నేతలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపకారం చేసే పరిస్థితి ఉండకూడదు. ఈ విషయం నేతలకు నేరుగా, గట్టిగా చెప్తున్నా. వైసీపీకి ఉపకారం చేస్తే పాముకు పాలు పోసినట్టే. శ్రేణులు కూడా ఒక్కొక్కరు ఒకరి ఇష్టం ప్రకారం కాకుండా నాయకత్వం కింద పనిచేయాలి. నా దృష్టిలో మాటలు చెప్పే వారు కాదు… ఓట్లు సంపాదించేవారే అసలైన విజేతలు. నన్ను పొడిగితే మీకు వచ్చేదేమీ ఉండుదు. మీరు మంచిపనులు చేస్తే మన ప్రభుత్వం వస్తుంది. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు వన్‌టైంగా చూసుకోవద్దు. మీరు రాజకీయాల్లో ఉన్నన్నాళ్లు ప్రజాప్రతినిధులుగా ఉండాలి. నాకు ఎన్నిపనులున్నా ఎక్కడికెళ్లినా కార్యకర్తలను కలవడం బాధ్యతగా పెట్టుకుంటా. మీకు నేను గౌరవం ఇవ్వడమే కాదు… అవసరమైతే కొరడా తీసుకుంటాను. మారకపోతే వేటు తప్పదు. అది కూడా త్వరలో చేసి చూపిస్తాను. మీతో 45 సంవత్సరాలు అనుబంధముంది. అది శాశ్వతంగా ఉండాలి. మొన్నటి ఎన్నికల్లో నా మిత్రులను కూడా పక్కనబెట్టా. అవసరమైతే మీతో కలిసి టీ తాగుతా, భోజనం చేస్తానని చెప్పాగానీ పార్టీని త్యాగం చేయనని స్పష్టంగా చెప్పా’ అని చంద్రబాబు పార్టీ నేతలు, శ్రేణులను దిశానిర్దేశం చేశారు.