- పోరాటయోధులకు శిరస్సువొంచి నమస్కరిస్తున్నా
- మీరిచ్చింది భూములు కాదు, రాష్ట్ర భవిష్యత్‌ని
- గత ప్రభుత్వ విధ్వంసాన్ని ఎప్పటికీ మరువలేం
- బాబు పాలనాదక్షతతో అద్భుత రాజధాని ఖాయం
- అమరావతి దేశానికే తలమానికం అవుతుంది..
- ప్రధాని మోదీ సహకారానికి ధన్యవాదాలు
- ‘అమరావతి’ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతి (చైతన్య రథం): అమరావతి, మే 2: అమరావతి రైతులు గత ఐదేళ్లుగా సాగించిన ధర్మ పోరాటంలో విజయం సాధించారని, అలుపెరుగని రైతు పోరాటానికి శిరస్సుమంచి నమస్కరిస్తున్నానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని రైతులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. శుక్రవారం రాజధాని అమరావతిలో నిర్వహించిన అభివృద్ది పనుల పున:ప్రారంభ సభలో పవన్ మాట్లాడుతూ అమరావతి అభివృద్ది పనుల పునఃప్రారంభానికి విచ్చేసిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి రైతులు గత ఐదేళ్లుగా నలిగిపోయి.. లాఠీ దెబ్బలు తిన్నారని, గతంలో రైతులను కలిసినప్పుడు ‘మా కన్నీళ్లు తుడిచేదెవరు’ అని అడిగినట్టు గుర్తు చేసుకున్నారు. అమరావతి ఐదు కోట్లమందికి సంబంధించిన హబ్ అని అభివర్ణించారు. దేశమే తన కుటుంబంగా మోదీ భావిస్తున్నారని కొనియాడారు. దివిసీమ తుపానులా గత ప్రభుత్వం అమరావతిని తుడిచేసింది. అలాంటి అమరావతి మళ్లీ పునరుజ్జీవం పొందడానికి రైతుల ధర్మయుద్ధమే కారణం. మీ త్యాగాలను మరిచిపోలేం. మీకు జవాబుదారీగా ఉంటాం. రాజధాని నిర్మించి అమరావతి రైతుల రుణం తీర్చుకుంటాం. రైతులు భూములు ఇవ్వడం మాత్రమే కాదు.. రాష్ట్రానికి భవిష్యత్‌ని ఇచ్చారు. అమరావతి ప్రపంచస్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు ఉండటం వల్ల శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. భవిష్యత్తులో మన విద్యార్థులు బెంగళూరు, హైదరాబాద్ వలస వెళ్లరు. అందరం కోరుకున్నట్లే చంద్రబాబు సీఎం అయ్యారు. ఆయన పాలనా దక్షతతో అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతాం. అమరావతి రాష్ట్రానికే కాదు.. దేశానికే తలమానికంగా నిలుస్తుంది. దేశ ప్రజలు అంతా మోదీ కుటుంబీకులేనని, వారి సంక్షేమానికి, అభ్యున్నతికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ అలుపెరుగని కృషి చేస్తున్నారని కొనియాడారు. భవానిమాత మోదీని మరింత శక్తిమంతుణ్ణి చేయాలని ఆకాంక్షించారు. కాశ్మీర్‌లో ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఎంతో దు:ఖంలో ఉండి కూడా అమరావతి రైతుల త్యాగాలను ఆయన గుర్తించబట్టే ఇక్కడకు రావడం జరిగిందన్నారు. అమరావతి అభివృద్దికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎంతగానో సహకరిస్తున్నారంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధన్యవాదములు తెలిపారు.