- 15 శాతం వృద్ధి రేటు దిశగా అడుగులు
- గతేడాదితో పోలిస్తే.. 4.03 శాతం వృద్ధి అదనం
- ఏపీని బలమైన ఆర్థిక వ్యవస్థగా మారుస్తా
- లక్ష్యాలకు అనుగుణంగానే ప్రణాళికల అమలు
- గత ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టుపట్టించింది
- ఇప్పుడిప్పుడే అవన్నీ గాడిన పడుతున్నాయి
- వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఏపీ.. మా ప్రభుత్వ నినాదం
- పీ-4ద్వారా పేదల జీవన ప్రమాణాల పెంపు
- 18న వాట్సప్ గవర్నెన్స్‌కు శ్రీకారం
- ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటన
- వృద్ధి రేటుపై సీఎం పవర్ ప్రజెంటేషన్
అమరావతి (చైతన్య రథం): 2047నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రస్తుతం రూ.2.68 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం.. అప్పటికి రూ.58.14 లక్షలు అవుతుందని తెలిపారు. 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని, 2047నాటికి 42 వేల డాలర్ల తలసరి ఆదాయం లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వృద్ధిరేటుపై ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టుపట్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేశారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు.
‘ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నన్ను నమ్మారు. నేను వస్తే అభివృద్ధి జరుగుతుంది. సంపద వస్తుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించి ఆదాయం పెరుగుతుంది. పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఓట్లు వేసి గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు
గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వ్యవస్థలు భ్రష్టుపట్టాయి. మూడు రాజధానుల పేరిట అమరావతిని సమాధి చేశారు. ఏపీ జీవనాడి పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. గత పాలనలో ఎవ్వరికీ స్వేచ్ఛ లేదు. ఇక్కడ పుట్టి పెరిగిన వారు కూడా రాష్ట్రానికి రావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. విపత్కర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకెళ్లే బాధ్యత ప్రజలు మాకు అప్పగించారని ముఖ్యమంత్రి అన్నారు.
సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది
అభివృద్ధివల్ల సంపద వస్తుంది. సంపదవల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించి పేదరికం రూపుమాపవచ్చు. ఇది నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం. 1995లో నేను ఐటీ అంటే అందరూ నవ్వారు. ఐటీ తీసుకొస్తే తిండిపెడుతుందా? అని ఎగతాళి చేశారు. నేడు ఐటీ మనిషిని ఎక్కడికో తీసుకెళ్తోంది. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణలు, 1992లో వచ్చిన ఇంటర్నెట్ విప్లవాన్ని నేను మనసా వాచా నమ్మి ఆచరణలో పెట్టాను. నేను తెచ్చిన విజన్ 2020తో నేడు దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ ముందుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కువ తలసరి ఆదాయం ఆర్జిస్తున్నారు. రెండోతరం ఆర్థిక సంస్కరణలకు నేను నాంది పలికాను. విద్యుత్‌రంగంలో సంస్కరణలు తెచ్చి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చి నేను ఓడిపోయాను. ఆ విషయంలో నేను రాజీపడి ఉంటే ఓడిపోయేవాడిని కాదేమో. విమానాశ్రయాలకు ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చాను. శంషాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులకు శ్రీకారం చుట్టాను. శంషాబాద్ ఎయిర్ పోర్టును 5 వేల ఎకరాలతో ప్రారంభించామని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. నాడు విశాలమైన రహదారులకు శ్రీకారం చుట్టాను. నేడు 14 లైన్ల వరకూ రోడ్లు వేస్తున్నారు. నాడు హైదారాబాద్‌లో 163 కిలోమీటర్ల రింగ్ రోడ్డుకు శ్రీకారం చుట్టాము. ఇవన్నీ సంపద సృష్టే. వీటివల్లే ఆదాయం పెరిగింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
15శాతం వృద్ధి రేటు లక్ష్యంగా…
స్వర్ణాంధ్ర `2047 విజన్ లక్ష్యంగా పనిచేస్తున్నాం. 15 శాతం వృద్ధి రేటు సాధించడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. 2047నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారుకావాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాము. గత ఏడాదికంటే ఈ ఏడాది 4.03 శాతం వృద్ధి రేటు పెరిగింది. తెలుగుదేశం హయాంలో తలసరి ఆదాయం వృద్ధి 13.21 శాతం ఉండగా గత ప్రభుత్వంలో అది 9.06 శాతమే ఉంది. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి. ఆదాయం పెరిగితేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. అందుకే విజన్ రూపొందించి దానికి అనుగుణంగా పనిచేస్తున్నాము. టీడీపీ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. టీడీపీ అధికారంలోవుంటే రైతులకు పండుగే. ఏడు నెలల్లోనే రూ.1500 కోట్ల బకాయిలు చెల్లించాము అని ముఖ్యమంత్రి వివరించారు.
పీ-4 గేమ్ ఛేంజర్
ఉమ్మడి రాష్టంలో అమలు చేసిన సంస్కరణలు, తెచ్చిన పాలసీలతో కోట్లాది మంది జీవితాలు మారాయి. ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా నాడు తీసుకువచ్చిన పీ`3 (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్) విధానంతో ఉపాధి, సంపద సృష్టి జరిగింది. ఇప్పుడు స్వర్ణాంధ్ర-2047 విజన్‌ను ఆవిష్కరించాం. ఇందులో పేర్కొన్న పది సూత్రాల అమలు ద్వారా తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ వన్ చేసేందుకు అడుగులేస్తున్నాం. వీటిలో ప్రథమ సూత్రం జీరో పావర్టీ. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్దేశించిందే పీ`4 కాన్సెప్ట్ (పబ్లిక్ -ప్రైవేటు- పీపుల్-పార్టనర్షిప్). దక్షిణ భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీ జనాభా వృద్ధి రేటు 1.5 శాతం. దక్షిణ కొరియాలో అయితే 5 శాతం వృద్ధి ఉంది. జపాన్, చైనా, యూరప్ వంటి దేశాల్లో జనాభా తగ్గింది. జర్మనీవంటి దేశాలు ఇప్పుడు మానవ వనరులు కోసం ఎదురుచూస్తున్నాయి అని చంద్రబాబు వివరించారు.
వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మా నినాదం
ఒక వ్యక్తి ఆనందంగా ఉంటే ఆ కుటుంబం ముందుకుపోతుంది. కొన్ని కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులను చూసుకోలేని పరిస్థితి. నేను రూ.4 వేలు పెన్షన్ ఇవ్వడంతో ఇప్పుడు తల్లిదండ్రులను పిల్లలు చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, కిడ్నీ రోగులకు రూ.10 వేలు ఇచ్చాం. మంచం మీదనుంచి లేవలేని స్థితిలో ఉన్నవారికి రూ.15 వేలు ఇస్తున్నామన్నారు.
18న వాట్సాప్ గవర్నెన్స్‌కు శ్రీకారం
కుటుంబ వ్యవస్థవల్ల భద్రత ఉంటుంది. నేడు ఆధార్‌వల్ల ఎవరు ఏమిటో వెంటనే తెలిసిపోతోంది. పూర్తి వివరాలు వచ్చేస్తున్నాయి. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పెట్టినా, పెన్షన్ ఇచ్చినా, రైతు భరోసా ఇచ్చినా విడివిడిగా ఇస్తున్నారు. నేను వీటన్నింటినీ కుటుంబానికి అనుసంధానం చేస్తున్నాను. ఆ ఇంటిని జియో ట్యాగింగ్ చేస్తున్నాను. ఏదైనా విపత్తు వస్తే నేరుగా సంబంధిత ఇంటి వివరాలు వచ్చేస్తాయి. ఈనెల 18న వాట్సాప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుడుతున్నాము. సెల్ ఫోన్ ద్వారా ప్రజలకు అవినీతిరహితంగా 150 సేవలు అందిస్తాము. దీనివల్ల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదని చంద్రబాబు వివరించారు.
విజన్‌తో అద్భుత ఫలితాలు
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి రూ.నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అమరావతి పనులు జరుగుతున్నాయి. పోలవరం పనులు వేగవంతం చేశాం. అమెరికా సిలికాన్ వ్యాలీలో నీరులేక రూ.4 లక్షల కోట్ల ఆస్తి బూడిదయ్యింది. అందుకే నీటి భద్రత ముఖ్యం. పోలవరం పూర్తయ్యే నాటికి గోదావరి పెన్నా నదుల అనుసంధానం చేస్తాము. టెక్నాలజీ సాయంతో వ్యవసాయం లాభసాటిగా మార్చడంతో పాటు ఖర్చు తగ్గించే విధానాలపై దృష్టి పెట్టాను. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనపైన దృష్టి పెట్టాను. స్వచ్చాంధ్రప్రదేశ్ నినాదాన్ని ప్రజల్లోకి ఉధృతంగా తీసుకెళ్తున్నాము. గత ఐదేళ్లు గుంతల రోడ్లుతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆరు నెలల్లోనే రోడ్లు వేశాం. సంక్రాంతికి ఇంటికి వెళ్లిన వారందరూ రోడ్లను చూసి సంతోషం వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.