- అనంతపురం ‘‘సూపర్ సిక్స్ ` సూపర్ హిట్’’ సభ గ్రాండ్ సక్సెస్
- ఫేక్ ప్రచారాలు తప్ప జగన్‌కు మరో అజెండా లేదు
- సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి.. ఇదే కూటమి ప్రభుత్వ మంత్రం
- చంద్రబాబు విజన్‌తో ఏరోస్పేస్ హబ్‌గా అనంతపురం
- రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
అనంతపురం (చైతన్యరథం): అనంతపురంలో జరిగిన ‘‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’’ సభ అంచనాలకు మించి విజయవంతం అయిందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. తొలి ఏడాదిలోనే హామీల అమలు, సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని పల్లా ఉద్ఘాటించారు. ప్రభుత్వంపై విశ్వాసంతో లక్షలాది ప్రజలు స్వచ్ఛందంగా అనంతపురం సభకు తరలివచ్చారన్నారు. అనంతపురంతో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సభతో అనంతపురం, రాయలసీమ భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం కొత్త దిశా నిర్దేశం చేస్తోందని పేర్కొన్నారు. రాజమండ్రిలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలలో 90% అమలు చేసి, ప్రజల ముందుకు రావడం గర్వకారణం.. అందుకే ఈ సభ కేవలం సూపర్ సిక్స్ కాదు, నిజంగా సూపర్ హిట్ సభ’’ అని ఆయన అన్నారు. జగన్ తన పాలన ఐదేళ్లలో ప్రజల్లోకి రాలేదు. అధికారం పోయాక ఇంట్లో కూర్చొని సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాలు చేయడం తప్ప ఆయనకు మరే అజెండా లేదు. మూడు రాజధానులంటూ అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేయలేదు. విశాఖ ఉక్కు ప్రైవేటుపరం అవుతోందని గగ్గోలు పెడుతూనే కేంద్రం నుండి ఒక్క రూపాయి తెచ్చుకోలేకపోయారు. కానీ కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో రూ.14 వేల కోట్లు తెచ్చి, విశాఖ స్టీల్ ప్లాంట్ ను 80% సామర్థ్యంతో నడుస్తున్న స్థితికి తీసుకువచ్చింది. అమరావతి, రాయలసీమ, ఉత్తరాంధ్రపై జగన్ ఫేక్ ప్రచారాలు మాత్రమే చేస్తున్నారని పల్లా విమర్శించారు.
ఎన్టీఆర్ వేసిన బీజాలు, చంద్రబాబు హయాంలో ఫలితాలు ఇచ్చాయి. డ్రిప్ ఇరిగేషన్ తో అనంతపురం హార్టికల్చర్ హబ్ అయింది. చంద్రబాబు విజన్‌తో కియా మోటార్స్ రాకతో అనంతపురం ఆటోమొబైల్ హబ్‌గా మారింది. ఇప్పుడు అదే విజన్ తో దేశం గర్వించే ఏరోస్పేస్ హబ్‌గా అనంతపురాన్ని తీర్చిదిద్దుతామని పల్లా ఉద్ఘాటించారు. హంద్రీనీవా ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు మానస పుత్రిక. దీని ద్వారా 3,850 క్యూసెక్కుల నీటిని అనంతపురం జిల్లాకు తేవగలిగాం. జీడిపల్లి, భైరవానితిప్ప వంటి అనేక ప్రాజెక్టుల ద్వారా వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఇవన్నీ రాయలసీమ భవిష్యత్తు కోసం పునాదులుగా పల్లా అభివర్ణించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే రాయలసీమకు కేంద్ర సంస్థలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అండ, కేంద్ర సహకారం, చంద్రబాబు అనుభవం ఇవన్నీ రాయలసీమ పునరుద్ధరణకు బలమైన ఆధారాలుగా పల్లా స్పష్టం చేశారు.