- ప్రతి ఇంటా సంక్షేమం, ప్రభుత్వ పథకాల అమలుపై హర్షం
- రాష్ట్రంలో ఏడాదిలో రూ.9.50 లక్షల కోట్ల పెట్టుబడులు
- రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్
- కోవూరు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగులో పాల్గొన్న మంత్రి టీజీ భరత్
కోవూరు (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం పదిలంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాలెంలో మంగళవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి టీజీ భరత్‌కు స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ముందుగా పోతిరెడ్డిపాలెంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం.. రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన పోతిరెడ్డిపాలెం బ్రాంచ్ రోడ్డు, పోతిరెడ్డిపాలెం నుంచి గిరిజన తిప్ప వెళ్లే రోడ్లను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో కలిసి మంత్రి భరత్ ప్రారంభించారు. అనంతరం పోతిరెడ్డి పాలెం గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత రోడ్లకు శంకుస్థాపన చేశారు.
పోతిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీవాణి కాలనీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, మంత్రి భరత్‌లకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ.. ఆప్యాయంగా పలకరించారు. ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఏడాదికాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. స్థానికులందరూ ఏడాది పాలనపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు పాలనలో సంతోషంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని నేతలు ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి భరత్ మాట్లాడుతూ… కోవూరు నియోజకవర్గ సమస్యలే పరిష్కారంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పనిచేస్తున్నారని, ఆ విషయాన్ని తాము ప్రత్యక్ష్యంగా చూస్తున్నామన్నారు. ఎప్పుడు, ఎక్కడ పలకరించినా.. ప్రజా సమస్యలనే ప్రస్తావిస్తుంటారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పనితీరును ఆయన కొనియాడారు. గత పాలనలో అధ్వానంగా మారిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిన పెడుతున్నారన్నారు. ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పినా వారి తీరు మారడం లేదని, ఇటీవల ప్రశాంతిరెడ్డిని ఉద్దేశించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అసభ్య వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు.
విజన్‌తో చంద్రబాబు పాలన
సీఎం చంద్రబాబు ఒక విజన్‌తో పాలన సాగిస్తున్నారని, ఆయన విజన్‌కు నేటి హైదరాబాద్ నిదర్శనమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సుస్థిర ప్రభుత్వాలు అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రానికి ఈ ఏడాదిలో రూ.9.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు బ్రాండ్ వల్లే సాధ్యపడిరదన్నారు. ఇది పనిచేసే ప్రభుత్వమన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయనే చంద్రబాబే మన సీఎం అన్నారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇఫ్కో కిసాన్ సెజ్ వివరాలపై ఆరా తీస్తామని అన్నారు.
20 రోజుల్లోనే లక్ష గడపలకు: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ… సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి భరత్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని మొదలు పెట్టిన 20 రోజుల్లోనే లక్ష ఇళ్లను పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాలల్లో ఇవ్వగలిగిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో తాను కూడా భాగం కావటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఏడాది కాలంలో సాధించిన విజయాలను వివరించేందుకు ప్రజల్లోకి వెళ్లాలని మీ వద్దకు పంపించినందుకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి నేడు ప్రజాక్షేత్రంలో ధైర్యంగా తిరుగుతున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 80 శాతం వరకు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు.
ఈ సందర్భంగా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలు, ఇఫ్కో కిసాన్ సెజ్, మిథాని పరిశ్రమల స్థాపన విషయాన్ని మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకొచ్చారు. కోవూరు నియోజకవర్గంలో నైపుణ్యమున్న యువతకు కొదవ లేదని, వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కిసాన్ సెజ్, మిథాని పరిశ్రమలు స్థాపిస్తే వేలాదిమందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా కోవూరు నాయకులు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, బుచ్చి మున్సిపల్ చైర్‌పర్సన్ మోర్ల సుప్రజ, జొన్నవాడ ఆలయ సేవా కమిటీ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, పోతిరెడ్డి పాలెం ఎంపీటీసీ నాగరాజు, కోవూరు ఎంపీపీ తుమ్మల పార్వతి, టీడీపీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, బుచ్చి అర్బన్, రూరల్ టీడీపీ మండల అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు, బెజవాడ జగదీష్, టీడీపీ నాయకులు ఇంత మల్లారెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, వేగూరు సర్పంచ్ అమరావతి, తదితరులు పాల్గొన్నారు.