- ముందుకొచ్చిన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా
- సీఎం చంద్రబాబు సమక్షంలో కుదిరిన ఎంఓయూ
విశాఖపట్నం (చైతన్యరథం): ఉత్తరాంధ్రకు మరో ఎయిర్ పోర్టు రానుంది. శ్రీకాకుళంలో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సంబంధించి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఈ మేరకు శనివారం అవగాహనా ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో అధికారులు ఎంఓయూ పత్రాలు మార్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు ఎయిర్‌పోర్ట్ రాకతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనెక్టివిటీ పెరుగుతుందని, అలాగే పర్యాటక రంగానికి దోహదపడుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఈ ప్రాంతంలో ఆర్ధిక వృద్ధికి ఊతం లభిస్తుందన్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రస్తుతం స్థల పరిశీలన జరుగుతోంది. మౌలిక వసతులు, రెగ్యులేటరీ అనుమతులపై ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏపీ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిసి పనిచేయనున్నాయి.













