డిల్లీ : మహిళల హక్కుల కోసం పోరాడే సోషల్ యాక్టివిస్టులు, ప్రధాన రాజకీయపక్షాల నేతలతో కలిసి డిగ్నిటీ ఫర్ ఉమెన్ పేరుతో జెఎసిగా ఏర్పడి డీజిపిని, గవర్నర్ ను కలిశాం. నేడు జాతీయ మహిళా కమిషన్, రాష్ట్రపతిని కలుస్తాం. స్వాతంత్య్రం సిద్ధించి 75ఏళ్లు గడిచాక ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు కనీసం గౌరవం కావాలని డిల్లీకి వచ్చి చెప్పుకునే దుస్థితి వచ్చింది. జగన్ రెడ్డి మహిళలను అక్క చెల్లెమ్మలని అంటారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, ఘోరాలపై ఆధారాలతో మేము ఊరికో ఉన్మాది బుక్ ను పబ్లిష్ చేశాం. ఈ పుస్తకాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు కూడా ఇచ్చాం. ఇప్పటివరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోకపోగా, విజయవాడలో ఒక మానసిక వికలాంగురాలిపై కామాంధులు 36గంటలపాటు గ్యాంగ్ రేప్ చేస్తే, బాధితురాలిని పరామర్శించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయడు పరామర్శకు వెళ్లారు. బాధితురాలికి న్యాయం చేయగపోగా, చంద్రబాబునాయుడుకు మహిళా కమిషన్ సమన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ, గౌరవం లేదు. న్యాయం చేస్తారన్న నమ్మకం లేదు. అశ్లీల వీడియోపై ఎందుకు ఎంపికి సమన్లు ఇవ్వలేదు? జాతీయ మహిళా కమిషన్, లోక్ సభ స్పీకర్ కూడా అడాలి. తప్పుడు పనులు చేసిన ఎంపిలపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ కు ఉంది. ఎంపి మాధవ్ పై ఇప్పటికే రేప్, మర్డర్ కేసులు ఉన్నాయి. అటువంటి వారితో ఏవిధంగా చట్టాలు చేస్తారో ఆలోచించాలి. ఒక అటెండర్ పోస్టుకు ఎంపిక చేసేటపుడు పోలీసు క్లియరెన్స్ కావాలంటారు. 10లక్షలమందికి ప్రజాప్రతినిధిగా ఎన్నికై శాసనాలు చేసేవారికి అటువంటివి అవసరం లేదా? రేపిస్టులు, కామాంధులు పార్లమెంటు, అసెంబ్లీలో కూర్చుని మాట్లాడుతున్నారు. వాస్తవపరిస్థితి ఇలా ఉంటే మహిళలు ఏవిధంగా సాధికారిత సాధించినట్లు? ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తరచూ డిల్లీకి వస్తున్నారు. ఆయన డిల్లీ పెద్దలను దిశా చట్టం గురించి ఎప్పుడైనా అడిగారా? ఎందుకు దానిగురించి మాట్లాడలేదు. మహిళల భద్రత, చట్టాలపై ముఖ్యమంత్రి, రాష్ట్రప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే మేం భారత రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించాం. ఎంపి మాధవ్ అశ్లీలవీడియో విషయమై అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ సంస్థ ఇచ్చిన నివేదికపై వివరణ కోరడానికి సిఐడికి సంబంధం ఏమిటి? ఎవరి అనుమతి తీసుకొని ఈ కేసులో సిఐడి జోక్యం చేసుకుంది? దుర్మార్గులను, కామాంధులను మహిళలను వేధించేవారిని ప్రోత్సహించే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండటం సిగ్గుచేటు. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేం డిల్లీకి వచ్చాం.