- ఇప్పటికీ వెంటాడుతున్నాయి
- ట్రూ అప్ పేరుతో రూ.32,166 కోట్ల భారం మోపిన వైసీపీ
- విద్యుత్ కొనుగోళ్ల నియంత్రణతోనే ప్రజలపై భారం తగ్గిస్తున్నాం
- చంద్రబాబు అనుభవం, దూరదృష్టితోనే తొలిసారి ట్రూ డౌన్
- ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి (చైతన్యరథం): జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు విద్యుత్ శాఖను, రాష్ట్ర ప్రజలను ఇప్పటికీ వెంటాడుతున్నాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దీనికి సంబంధించి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోకుండా… కమీషన్లకు కక్కుర్తి పడిన అప్పటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు అడ్డగోలు విద్యుత్ కొనుగోళ్లు చేసి, ఆ తరువాత ట్రూ అప్ పేరుతో రూ.32,166 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని ఆయన స్పష్టం చేశారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన విద్యుత్ విధ్వంస భారాలను ప్రజలు నేటికీ భరిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనా అనుభవం, దూరదృష్టితో ప్రజలపై భారం పడకుండా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి గొట్టిపాటి తెలిపారు.
9 సార్లు విద్యుత్ ఛార్జీల పెంపు
2019 వరకు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఏపీని, వైసీపీ పాలనలో అంధకారంలోకి నెట్టేశారని విమర్శించారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే, ప్రజలకు మేలు జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లను కూటమి ప్రభుత్వం తగ్గించిందని తెలిపారు. దీంతో పాటు ఇంధన శాఖ పరిధిలో ఉన్న వివిధ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పూర్తి స్థాయిలో పెంచి విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టినట్లు స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేసుకుని ప్రజలపై విద్యుత్ చార్జీల భారం తగ్గించే దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడిరచారు. సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ స్టోరేజ్ వంటి వినూత్న పద్థతులతో విద్యుత్ ఉత్పత్తిని పెంచడమే కాకుండా., బయట కొనుగోళ్లను నియంత్రించినట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు.
26 ఏళ్లలో తొలిసారి ట్రూ డౌన్…
1999లో ఏపీఈఆర్సీ ఏర్పాటైన నాటి నుంచి తొలిసారిగా ట్రూ డౌన్ అమలు చేసిన ప్రభుత్వంగా కూటమి సర్కార్ చరిత్ర సృష్టించిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.. వైసీపీ ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో రూ.32,166 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిందని పేర్కొన్నారు. తాజాగా అదనపు ట్రూ అప్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా కూటమి ప్రభుత్వం స్వయంగా భరించేందుకు సిద్ధమైందని తెలిపారు. విద్యుత్ కొనుగోలు చార్జీలు తగ్గించే దిశగా కసరత్తు చేస్తూ, భవిష్యత్తులో మరింతగా విద్యుత్ చార్జీలు తగ్గించేలా స్పష్టమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తూ, అదనపు భారం లేకుండా చార్జీలు తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేనని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.
రూ.4498 కోట్ల ట్రూ అప్ ఛార్జీల నుంచి ఊరట
విద్యుత్ రంగంలో సంస్కరణల్లో భాగంగా ఛార్జీలను తగ్గిస్తూ…ప్రజలపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోన్న సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. తాజాగా ట్రూ అప్ ఛార్జీల భారాన్ని భరించేందుకు సిద్ధమయింది. విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ఏపీఈఆర్సీకి డిస్కంలు ట్రూ అప్ ప్రతిపాదనలు పంపించాయి. డిస్కంల ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది. టూ అప్ ఛార్జీల మొత్తాన్ని తామే డిస్కంలకు చెల్లిస్తామని స్పష్టం చేస్తూ ఏపీఈఆర్సీకి కూటమి ప్రభుత్వం లేఖ రాసింది. మొత్తంగా రూ.4,497.89 కోట్ల భారాన్ని ప్రజలపై వేయకుండా భరించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.1551.69 కోట్లు, సీపీడీసీఎల్ పరిధిలో రూ.1163.05 కోట్లు, ఈపీడీసీఎల్ పరిధిలో రూ.1783.15 కోట్ల మేర భారాన్ని ప్రభుత్వం భరించనుంది. గత వైసీపీ ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో రూ.32,166 కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచింది. ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 1999లో ఏపీఈఆర్సీ ఏర్పాటైన నాటి నుంచి ట్రూ డౌన్ అమలు చేసిన తొలి ప్రభుత్వంగా చరిత్ర సృష్టించింది. ట్రూ డౌన్ అమలు ద్వారా విద్యుత్ ఛార్జీల్లో యూనిట్‌కు 13 పైసలు తగ్గించిన కూటమి ప్రభుత్వం..ఇప్పుడు తాజాగా ట్రూ అప్ ఛార్జీలను తామే భరిస్తామంటూ ముందుకు రావటంపై ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గించేలా కసరత్తు చేస్తూ భవిష్యత్తులో మరింతగా విద్యుత్ ఛార్జీలు తగ్గించేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది.













