అమరావతి (చైతన్య రథం): ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ఉధృతంగా వచ్చి చేరుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడిరచారు. బుధవారం సాయంత్రం 8 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 47.4 అడుగులు ఉందని పేర్కొన్నారు. ధవళేశ్వరం వద్ద రాత్రి 8 గంటలకు ఇన్, ఔట్ ఫ్లో 8.28 లక్షల క్యూసెక్కులు ఉందని, రేపటిలోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. ముందస్తుగా ప్రభావితం చూపే అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మండల అధికారులను అప్రమత్తం చేశామని ప్రఖర్ జైన్ వెల్లడిరచారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇస్తున్నామన్నారు.
మరోవైపు ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద ప్రవాహం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.67 లక్షల క్యూసెక్కులు ఉందని, మొదటి హెచ్చరిక కొనసాగుతుందని తెలిపారు. సహాయక చర్యలకు ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయని వెల్లడిరచారు. గోదావరి, కృష్ణా నదుల వరద ప్రవాహం వివిధ ప్రాజెక్టులలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున ఆయా నదీపరీవాహక ప్రాంత, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడంలాంటివి చేయరాదని సూచించారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ప్రఖర్ జైన్ హెచ్చరించారు.