- తిరుమలను అపవిత్రం చేసినవాళ్లను వదిలేది లేదు
విజయవాడ (చైతన్య రథం): తిరుమలలో గత ప్రభుత్వం భక్తులకు నాసిరకం భోజనంపెట్టి తిరుమల తిరుపతి పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల ప్రక్షాళన మొదలైందని, చాలావరకు ఫలితాలు వచ్చాయన్నారు. అపవిత్రం చేసిన వాళ్ల ఆధారాలు లభ్యమైన వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాల్సిందేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుమల ప్రసాదం తయారీలో నాసిరకం ముడి సరుకులు, అపవిత్ర పదార్థాలు వాడినట్టు ల్యాబ్ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయని, ఇందుకు కారకులెవరో కనిపెట్టి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ‘వెంకటేశ్వరస్వామి హిందువులకు కలియుగ దైవం. ఇలా చేస్తారని ఎవరూ ఊహించలేదు.
ఎవరైనా శ్రీవారికి అపచారం తలపెడితే.. వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే శిక్షిస్తాడని భక్తుల విశ్వాసం. హిందువులు జీవితంలో ఒక్కసారైనా వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని, కోరికలు చెప్పుకోవాలని అనుకుంటారు. అలాంటి పవిత్రమైన ప్రదేశాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించిన దుర్మార్గులను ఏంచేయాలో అర్థం కావడంలేదు. కక్కుర్తికి కూడా హద్దులు ఉంటాయి. కానీ హద్దులు దాటి ప్రవర్తించి ఏదైనా చేస్తామనే పరిస్థితికి వచ్చారు. ఇంటి వద్దే తిరుమల సెట్ వేసి పైశాచిక ఆనందం పొందారు. భక్తుల మనోభావాలు దెబ్బతిని చాలా మంది బాధపడ్డారు. నా జీవితంలో ఇంత గొప్ప విజయం ఎప్పుడూ రాలేదు. దానికి కారణం ఇలాంటి విషయాలన్నీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాయి’ అన్నారు. ఎన్టీఆర్ తిరుమలలో అన్నదానం ప్రవేశపెట్టి పవిత్ర కార్యంగా చూస్తే.. గత ప్రభుత్వం ఆ మహత్కార్యం స్థాయిని దిగజార్చి.. నాసిరకం అన్నదానం చేయడంపై గతంలోనే ఫిర్యాదులు వచ్చాయన్నారు. మొత్తం తిరుమల వ్యవస్థను చక్కదిద్ది.. పవిత్రతను ఆపాదించే కార్యాచరణను ఎన్డీయే సర్కారు మొదలుపెట్టిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.