- అందుకు ఆన్‌లైన్ మెకానిజంపై దృష్టి పెట్టా
- ఎన్‌సీసీ డైరక్టరేట్ ఏర్పాటుకు రక్షణమంత్రి సుముఖం
- శాసనసభలో మంత్రి నారా లోకేష్ సమాధానం
అమరావతి (చైతన్య రథం): ప్రైవేట్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి ఆన్‌లైన్ మెకానిజం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్టు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఆటస్థలాలు, అగ్నిమాపక భద్రతా పరికరాల ఏర్పాటుకుగల నిబంధనలు, ప్రైవేటు స్కూల్ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, పాఠశాలల్లో ఎన్‌సిసి అభివృద్ధికి చేపడుతున్న చర్యలపై ఎమ్మెల్యేలు పంతం వెంకటేశ్వరరావు, వాల్మీకి పార్థసారథి అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… ప్రైవేటు స్కూళ్ల అనుమతులకు సంబంధించి ఫైర్ ఎన్‌ఓసిని అగ్నిమాపకశాఖ, బిల్డింగ్ పర్మిషన్స్ పంచాయతీ, లోకల్ బాడీస్ ఇస్తాయి. జీఓ 88 ప్రకారం అడ్మిషన్లనుబట్టి ఎంత ఆటస్థలం ఉండాలనే విషయమై నిబంధనలు ఉన్నాయి. ఈ జీఓ ప్రకారం సరిపడనంత ఆటస్థలం లేకపోతే మున్సిపల్ గ్రౌండ్స్‌తో టైఅప్ కావచ్చు. అది కూడా అందుబాటులో లేకపోతే వేరే స్కూళ్లతో టైఅప్ కావచ్చని ఉంది. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన జీఓతో ఈ వెసులుబాటు కల్పించారు.
ప్రైవేటు స్కూళ్ల పర్మిషన్ల విషయంలో కొన్ని లోటుపాట్లు ఉన్నట్లు నా దృష్టికి వచ్చాయి. ఇందుకు ట్రాన్సపరెంట్ మెకానిజిం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఎన్‌సిసికి సంబంధించి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి డైరక్టరేట్ ఏర్పాటు చేయాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఆటస్థలాల విషయంలో మార్పులు, చేర్పులు చేయాలంటే జీఓ 88 సవరణ తీసుకురావాల్సి ఉంది. 50శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజిల్లో చదువుతున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని అనేక సంస్కరణలు చేపట్టాం. విద్యార్థుల మానసిక వికాసానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ కీలకపాత్ర వహిస్తుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి పిఇటిలను నియమించే విషయమై సమీక్షిస్తున్నాం. క్రీడాస్థలాల విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ప్రైవేటు స్కూల్ టీచర్ల జీతాల విషయమై ప్రైవేటు యజమానులతో సమావేశం కాగా, కొన్ని పత్రాలు ఇచ్చేందుకు ప్రైవేటు టీచర్లు నిరాకరిస్తున్నట్టు తమ దృష్టికి తెచ్చారు. ఏదేమైనా ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. వచ్చేవారం ప్రైవేటు టీచర్లతో అధికారులు సమావేశమై వారి సమస్యలు తెలుసుకోనున్నట్టు మంత్రి లోకేష్ వెల్లడిరచారు.