తిరుపతి (చైతన్య రథం): తిరుపతి తొక్కిసలాటలో భక్తుల మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతిలో తొక్కిసలాట జరగడం బాధాకరమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తుందని మోదీ ధైర్యం చెప్పారు. తిరుపతిలో తొక్కిసలాట చోటుచేసుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందడంపట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి లోకేష్‌లు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. ఐటీ మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విడుదల నేపథ్యంలో తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం నన్ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఇటువంటి అవాంచనీయ ఘటనలకు తావీయకుండా టిటిడి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. మృతిచెందిన భక్తుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ స్పందిస్తూ.. మృతులు, క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారు ఉన్నారని, అలాంటి కుటుంబాలకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం సత్వరమే తగిన ఏర్పాట్లు చేయాలని తితిదేను ఆదేశించారు. అదేవిధంగా మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్ళి పరామర్శించి మనో ధైర్యం ఇచ్చే బాధ్యత టీటీడీ పాలక మండలి తీసుకోవాలన్నారు. దుర్ఘటన నేపథ్యంలో తిరుపతి నగరంలోని టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ లైన్ల నిర్వహణలో అధికారులకు, పోలీసు సిబ్బందికి జనసేన నాయకులు, జన సైనికులు తోడ్పాటు అందించాలని డిప్యూటీ సీపం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.