జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వంపై పథకం ప్రకారం దుష్ట ప్రచారం చేస్తూ, రాష్ట్ర ప్రజల మనసుల్లో విషబీజాలు నాటడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ టీడీసీ ఛైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మండిపడ్డారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడిన ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతోందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుండి, ఎన్నికల హామీలను క్రమపద్ధతిలో అమలు చేస్తోందన్నారు. ప్రజలందరూ చంద్రబాబు నాయుడుకి జేజేలు పలుకుతుంటే, దాన్ని ఓర్చుకోలేక దుర్మార్గపు వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గోవులు మరణించాయని కుట్రకు తెరలేపిన జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతను కోల్పోయారన్నారు. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాను అని బాలాజీ స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు ఛాలెంజ్ విసిరి, గోవులు ఆకలితో మరణించాయని రుజువు చేయమని ఛాలెంజ్ విసిరితే, దాన్ని పక్కనపెట్టి, భూమన కరుణాకర్ రెడ్డి సమస్యను పక్కదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు అడ్డుకున్నారని చెప్పడం అసంబద్ధం. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే, మీ పార్టీకి చెందిన ఎంపీ గురుమూర్తి ఎలా గోశాలకు వెళ్లారు జవాబు చెప్పాలని నూకసాని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో టీటీడీలో జరిగిన అక్రమాలు, అరాచకాలను కప్పిపుచ్చకునేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం తిరుమలలో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును, ఆదరణను చేసి ఓర్వలేక వైసీపీ నాయకులు పథకం ప్రకారం విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
మీ ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు తిరుమలకు వచ్చారు? ఆయన ఏ రోజైనా డిక్లరేషన్ ఇచ్చారా? ఆచారాలు పాటించారా? శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు హిందూ సాంప్రదాయపరంగా సతీ సమేతంగా రావాలి. జగన్‌రెడ్డి ఎప్పుడైనా సతీ సమేతంగా టీటీడీ దర్శనాలను ఎలా భ్రష్టు పట్టించారో భక్తులందరికి తెలుసు. ఇవన్నీ ఇకనైనా మానుకొని, ఆరోపణలు చేసేటప్పుడు నిర్ధారణ చేసుకొని మాట్లాడాలని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రానికి, ప్రజలకు, దేవాలయాలకు హాని కలిగించే ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడితే, భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడటం ప్రతి ఆంధ్రుడి బాధ్యత. విమర్శలు చేయాలనుకుంటే, వాస్తవాలతో, నిజాయితీగా చేయాలి అని హెచ్చరించారు.