- తెలుగు భాష పరిరక్షణ కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి
- ఆయనతో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం
- దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన సేవలు మరువలేనివి
- తండ్రి బాటలోనే భాషాభ్యున్నతికి పాటుపడుతున్న బుద్ధ ప్రసాద్
- శతజయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు
విజయవాడ (చైతన్యరథం): తెలుగు భాష కోసం అహర్నిశలు కృషి చేసిన మండలి వెంకట కృష్ణారావు పేరును అధికార భాష సంఘానికి పెడతాం.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు.. దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివి.. మహాత్ముని ఆశయాలను తూచా తప్పుకుండా పాటించిన వెంకట కృష్ణారావు మనందరికీ స్ఫూర్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…తాను ఈ కార్యక్రమానికి రావడానికి ఓ ముఖ్య కారణం ఉందన్నారు. నేటి తరానికి విలువలతో కూడిన రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియాలి. 1978-1983 మధ్య కాలంలో మండలి వెంకట కృష్ణారావుతో ఎమ్మెల్యేగా కలిసి పని చేసే అవకాశం నాకు వచ్చింది. విలువలతో కూడిన రాజకీయాలు, సేవాభావంతో పనిచేసిన నాయకత్వాన్ని ఒకప్పుడు చూశాం. ఇప్పుడు పూర్తిగా విలువలు పడిపోయాయి. అడ్డదారుల్లో డబ్బు సంపాదించడమే ధ్యేయంగా ఉంటున్నారు. గాంధీజీ ఆశయాలను తూచా తప్పకుండా పాటించిన మండలి వెంకట కృష్ణారావు మహాత్మునికి నిజమైన వారసుడని సీఎం చంద్రబాబు కొనియాడారు.
గజానికో దిగ్గజం
సాహితీ, సాంస్కృతిక, రాజకీయ, సినీ రంగాలకు ఈ కృష్ణా తీరం వేదిక. దేశానికి మహామహులను అందించిన గడ్డ ఇది. భోగరాజు పట్టాభి సీతారామయ్య, గొట్టిపాటి బ్రహ్మయ్య, చండ్ర రాజేశ్వరరావు, కెఎల్ రావు వంటి రాజకీయ ఉద్దండులు ఇక్కడ పుట్టిన వారే. కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్నూరు కృష్ణారావు, ఆంధ్ర పత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు, పత్రికా ప్రముఖులు నార్ల వెంకటేశ్వరావు, ఈనాడు రామోజీరావు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ, బ్రిటిష్ కాలంలో ఇండియా క్రికెట్ టీం కెప్టెన్‌గా ఆడిన సికె నాయుడు ఈ జిల్లాలోనే జన్మించారు. అలాగే సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, అయ్యదేవర కాళేశ్వరావు, గోరా వంటి మహనీయులు ఈ గడ్డపైనే పుట్టారు. వీరంతా నేటి తరానికి స్పూర్తిగా నిలిచారని సీఎం చంద్రబాబు అన్నారు.
ఉప్పెనలో మర్చిపోలేని సాయం
1977 నవంబర్ 19వ తేదీన దివిసీమలో వచ్చిన ఉప్పెన 12 వేల మంది ప్రాణాలు తీసింది. లక్షల మందిని నిరాశ్రయులను చేసింది. దేశ చరిత్రలోనే ఇలాంటి ఉప్పెన చూడలేదు. నాటి ప్రళయంలో ప్రజలను ఆదుకోవడంతో పాటు, ఆ తరువాత కాలంలో ప్రజలకు కనీస అవసరాలు అందించడంలో వెంకట కృష్ణారావు అందించిన సేవలను సమాజం ఎప్పటికీ మరిపోలేదు. తుఫానులో ప్రాణాలకు తెగించి అనాథó పిల్లలను రక్షించారు. ఉప్పెన అనంతరం వేలాది శవాలతో నిండిన ఆ ప్రాంతంలో ఆయన పర్యటించి శవ దహన కార్యక్రమాలు చేశారు. ఆయన పిలుపుతో అనేక సంస్థలు, వ్యక్తులు తరలి వచ్చి నాడు దివిసీమ బాధితులకు సాయంగా నిలిచారు. దేశ, విదేశాల సహాయంతో పునర్నిర్మాణ పనులు చేపట్టేలా చూశారు. పక్కా ఇళ్లు, కరకట్టలు, షెల్టర్లు నిర్మించారు. దివిసీమ ఉప్పెన బాధితులను ఆదుకోవడాడానికి నాడు ఎన్టీఆర్ జోలె పట్టి విరాళాలు సేకరించారు. నేను కూడా ముఖ్యమంత్రిగా 1996లో సూపర్ సై క్లోన్ చూశాను. ఆ రోజు ఉభయ గోదావరి జిల్లాలు, అతలాకుతలం అయ్యాయి. విశాఖలో హుద్ హుద్ సమయంలోనైతే పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకూ అక్కడే ఉండి పనిచేశాననని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
మండలి జీవితం పేదలకు అంకితం
మచిలీపట్నం హిందూ కాలేజీలో బీఏ చదివిన కృష్ణారావు విద్యార్థి దశలోనే ఖద్దరు ధరించి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడడమే కాకుండా.. నిరుపేద విద్యార్థులకు సాయం చేసేవారు. పుస్తకాలు, దీపాల కోసం కిరోసిన్ సేకరించి పేద విద్యార్థులకు సాయం చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి.. యువ నాయకుడిగా పేదల సేవలో తరించారు. 1945లో జిల్లా విద్యార్థి కాంగ్రెస్ కార్య నిర్వాహక కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అదే ఏడాది ముంబైలో మహాత్మా గాంధీని కలిశారు. 1948-52 మధ్య కృష్ణా జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. 1952లో నాడు రాయలసీమ కరవులో విరాళాలు సేకరించి సాయం చేశారు. కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పని చేశారు. అంతే కాదు సముద్రపు ఒడ్డునునున్న భూమిని సాగులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. దీంట్లో భాగంగా 15 వేల ఎకరాలను సాగులోకి తెచ్చి.. పేదలకు అందేలా చేశారు. దివి, కైకలూరు తాలూకాలో 50,000 ఎకరాల బంజరు భూమి పేదలకు పంచిపెట్టేలా కృషి చేశారు. సహకార సంఘాల ద్వారా వ్యవసాయాభివృద్ధి చేసేలా ప్రొత్సహించి. 30 వేల ఎకరాల భూమిని సాగులోకి తెచ్చి, 11 వేల కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన మహోన్నత వ్యక్తి మండలి అని సీఎం చంద్రబాబు అన్నారు.
తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి
తెలుగు భాష అభివృద్ధికి మండలి ఎంతో పాటుపడ్డారు. 1957లో ఏప్రిల్‌లో ప్రథమ ప్రపంచ తెలుగు మహా సభలను హైదరాబాద్‌లో అద్భుతంగా నిర్వహించారు. ప్రపంచ తెలుగు సంఘాల ప్రతినిధులను ఒక వేదిక మీదకు తెచ్చిన ఘనత మండలిదే. చట్టసభల్లో ప్రతినిధిగా ఉన్నా…. సమాజ సేవలో బిజీగా ఉన్నా.. తెలుగు భాషపై మండలి కృష్ణారావు మమకారాన్ని వీడలేదు. తెలుగు భాషా సంస్కృతి సేవలో తరించారు. ప్రథమ, ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. అంతర్జాతీయ తెలుగు సంస్థ, విదేశాంధ్ర సేవా కేంద్రాలను స్థాపించారు. 1981లో అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షులుగా నియమితులైన ఆయన.. కౌలాలంపూర్లో రెండవ ప్రపంచ తెలుగు మహా సభలను నిర్వహించారు. పీవీ మంత్రివర్గంలో ఆయన సాంఘిక సంక్షేమ, సహకార శాఖల మంత్రిగా, జలగం వెంగళరావు మంత్రివర్గంలో విద్యా, సాంస్కృతిక శాఖా మంత్రిగా పనిచేశారు. అలాగే విద్యా రంగంలో అనేక సంస్కరణలు తెచ్చారు. మేధావుల సూచనలతో విద్యా శాఖను పునర్‌వ్యస్థీకరించారు. వరంగల్ కాకతీయ యూనివర్శిటీ, గుంటూరులో నాగార్జునా యూనివర్శిటీల స్థాపనకు కృషి చేశారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో 1974 లో వారం రోజుల పాటు అఖిల భారత తెలుగు సాంస్కృతికోత్సవాలను నిర్వహించి.. అధికార భాషా సంఘం నెలకొల్పోందుకు కారణమయ్యారని సీఎం చంద్రబాబు కొనియాడారు.
తండ్రి బాటలోనే తనయుడు
మండలి వెంకట కృష్ణారావు తనయుడు బుద్ద ప్రసాద్ కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్నారు. ఆదర్శవంతమైన రాజకీయాలు చేస్తున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి గురించే ఆలోచన చేస్తున్నారు. తండ్రిలాగే తెలుగు భాషోద్యమానికి తన వంతు సేవ చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం మా బాధ్యత. దీంతో పాటు నేటి తరానికి విలువలు తెలియాలి. అందుకోసమే గరికపాటి నరసింహారావుని ప్రభుత్వ సలహాదారులుగా ఉండమని కోరాను. కానీ ఆయన సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఈ సందర్భంగా మరోసారి దీనిపై ఆయన ఆలోచన చేయాలని కోరుతున్నాం. మండలి వెంకట కృష్ణారావు స్ఫూర్తితో మనందరం ముందుకు సాగుదామని సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చారు.