- సీఎం చంద్రబాబును కలిసిన సినీ నిర్మాత బండ్ల గణేష్
- తిరుమల పాదయాత్రను వివరించిన వైనం.
- సంతోషంగా ఆలింగనంతో సత్కరించిన చంద్రబాబు
- ఉండవల్లిలో ఐటీ మంత్రి లోకేష్‌నూ కలిసిన బండ్ల
అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో సినీ నిర్మాత బండ్ల గణేష్ గురువారం కలిశారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై 2023లో అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపింది. సీఎం చంద్రబాబు జైలునుంచి విడుదలై ముఖ్యమంత్రి అయితే తిరుమలకు పాదయాత్రగా వస్తానని బండ్ల గణేష్ అప్పట్లో మొక్కుకున్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించి చంద్రబాబు నాల్గవసారి సీఎం అయ్యారు. సంకల్ప యాత్ర పేరిట షాద్‌నగర్ ఇంటినుంచి జనవరి 19న పాదయాత్ర చేపట్టి ఈ నెల 10న బండ్ల గణేష్ తిరుమలకు చేరుకున్నారు. 23 రోజులపాటు 535 కి.మీమేర పాదయాత్ర సాగింది. రెండ్రోజుల క్రితం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని బండ్ల గణేష్ మొక్కును చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. తిరుమల నుంచి తీసుకువచ్చిన శ్రీవారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. బండ్ల గణేష్‌ను సీఎం చంద్రబాబు ఆత్మీయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. పాదయాత్ర సాగిన తీరును సీఎంతో బండ్ల గణేష్ పంచుకున్నారు. దారి పొడవునా పార్టీ కార్యకర్తలు అండగా నిలిచి తనతో నడిచారని, వారి ప్రోత్సాహంతో తాను మరింత ఉత్సాహంగా పాదయాత్ర చేస్తూ తిరుమలకు చేరుకున్నానని బండ్ల గణేష్ తెలిపారు.
మంత్రి లోకేష్‌నూ కలిసిన వైనం
అనంతరం ఉండవల్లి నివాసsలో విద్య, ఐటీ మంత్రి లోకేష్‌ను నిర్మాత బండ్ల గణేశ్ కలిశారు. పాదయాత్ర సాగిన తీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి ప్రసాదం స్వీకరించారు.












