- ప్రాణత్యాగంతో తెలుగువారికి దారిచూపిన మహనీయుడు శ్రీరాములు
- పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటుకు అన్ని విధాలా సహకరిస్తా
- విగ్రహం ఏర్పాటు కమిట్‌మెంటే కాదు, నాకో ఎమోషన్ కూడా
- విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అనుకున్నది సాధించాలి
- అమరావతిలో కాంస్య విగ్రహం, స్మృతివనం, ఆడిటోరియం నిర్మాణం
- శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ పిలుపు
అమరావతి (చైతన్య రథం): తన ప్రాణత్యాగంతో కోట్లాది తెలుగువారికి దారిచూపిన వ్యక్తి పొట్టి శ్రీరాములని, అలాంటి మహనీయుని పేరిట స్మృతివనం ఏర్పాటుకు అన్ని విధాలా సహకరిస్తానని విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతిలోని తుళ్లూరు-పెదపరిమి మధ్య ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల విస్తీర్ణంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహంతోపాటు ఆడిటోరియం, స్మృతివనం నిర్మాణానికి మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి.. పొట్టి శ్రీరాములుపై రూపొందించిన ఏవీని వీక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ‘వాసవీమాతాకి జై. మహాత్మాగాంధీ దేశానికి స్వాతంత్య్రం సాధిస్తే.. పొట్టి శ్రీరాములు తెలుగుజాతికి గుర్తింపు సాధించిన వ్యక్తి. గాంధీని ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే.. పొట్టి శ్రీరాములుని ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అంటారు. కొన్ని దీపాలు వెలుగునిస్తాయి. కొన్ని దీపాలు దారి చూపిస్తాయి. ప్రాణత్యాగంతో కోట్లాది తెలుగు ప్రజలకు దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు. ఈ రోజు ఆయన 58 అడుగుల విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకున్నాం. విగ్రహంతోపాటు ఆడిటోరియం, మెమోరియల్, మ్యూజియం, మినీ ధియేటర్‌ను 6.8 ఎకరాల్లో మన అమరావతి ప్రజా రాజధానిలో ఏర్పాటు చేసుకోనున్నాం’ అని లోకేశ్ వివరించారు.
ఆయన ప్రాణత్యాగంతోనే ఆంధ ఆవిర్భావం
‘‘కేవలం విగ్రహం ఏర్పాటే కాదు, ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత తీసుకోవాలని డూండి రాకేష్‌ను కోరుతున్నా. 58 అడుగుల విగ్రహం ఎందుకని చాలామంది అనుకోవచ్చు. దీనివెనుక చరిత్ర ఉంది. పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ప్రాణత్యాగంవల్లే ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. దీంతోపాటు నెహ్రూ ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు, భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశంలో ఏర్పడ్డాయి’’ అని మంత్రి లోకేశ్ ఉద్ఘాటించారు.
సమాజంలో మార్పు కోసం అహర్నిశలూ పోరాడారు
‘‘పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షతో దేశంలోనే పెను మార్పులు సంభవించాయి. ఆయన కేవలం భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసమే పోరాడలేదు. సమాజంలో మార్పు కోసం అహర్నిశలూ పోరాడారు. దళిత సోదరులు ఆలయ ప్రవేశం కోసం పోరాడారు. వివిధ సామాజిక అంశాలపై ఐదుసార్లు నిరాహార దీక్షలు చేశారు. ఆయన ఏకంగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లి గాంధీ తాత దగ్గరనుంచి అహింసను ఆయుధంగా చేసుకున్నారు. పొట్టి శ్రీరాములులాంటివారు పదిమంది ఉంటే చాలు. దేశానికి స్వాతంత్య్రం ఒక్క ఏడాదిలోనే వస్తుందని గాంధీ తాత సైతం వ్యాఖ్యానించారంటే.. శ్రీరాములు నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు’’ అని లోకేశ్ పేర్కొన్నారు.
నమ్మిన సిద్ధాంతం కోసం జీవితం త్యాగం
‘‘పొట్టి శ్రీరాములు గురించి పాఠ్యాంశాల్లో చదువుకున్నాం. కానీ ఆయన చేసిన కార్యక్రమాల వెనుక ఎంతో ఆలోచన, త్యాగం ఉందని అర్థం చేసుకోవాలి. దాన్నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది. నమ్ముకున్న సిద్ధాంతం కోసం జీవితం త్యాగం చేశారు శ్రీరాములు. ఒక్క మార్కు తక్కువొస్తే.. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న రోజులు చూస్తున్నాం. పొట్టి శ్రీరాములు దగ్గర నుంచి పట్టుదల, కమిట్‌మెంట్ నేర్చుకోవాలి. మనం ఏదైనా సాధించాలనుకుంటే తొలి అడుగు వేస్తే సమాజం మొత్తం మన వెనుక ఉంటుంది. ఇప్పుడు ప్రదర్శించిన వీడియోలో అదే చూశాం. ఆయన దీక్షకు కూర్చొన్నప్పుడు చాలామంది రాలేదు. ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టిందో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆయన వెనుక నిలబడిరది’’ అని లోకేశ్ భావోద్వేగంతో వివరించారు.
పొట్టి శ్రీరాములు స్ఫూర్తిగా అనుకున్నది సాధించాలి
‘‘ఇన్ని దశాబ్దాలైనా ఈ రోజు ఆయనను గుర్తుచేసుకుంటున్నామంటే.. ఆయన చేసిన త్యాగం వల్లే. మనం ఏ కార్యక్రమం చేసినా ఆయనను గుర్తుచేసుకోవాలి. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మనం అనుకున్నది సాధించాలి. పొట్టి శ్రీరాములు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆర్యవైశ్య సామాజిక వర్గంనుంచి కొణిజేటి రోశయ్య నాకు గుర్తుకువస్తారు. రోశయ్య తాత ఎప్పుడైతే గవర్నర్ అయ్యారో ఏడాదికోసారి ఆయనతో మాట్లాడేవాడిని. రాజకీయాల్లో మీరు లేని లోటు తెలుస్తోందని ఆయనతో చెప్పా. మిమ్మల్నిచూసి పెరిగానని, ఏవిధంగా అసెంబ్లీలో పోరాడారో.. రాజశేఖర్ రెడ్డికి, చంద్రబాబుకి మధ్య యుద్ధం జరుగుతుందంటే ఒక్కమాటతో దానిని చల్లబరిచేవారు. అది మీ గొప్పతనం ఇప్పటి రాజకీయాల్లో లేకుండా పోయిందని ఎన్నోసార్లు చెప్పాను’’ అంటూ లోకేశ్ గడచిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
పొట్టి శ్రీరాములు చరిత్రపై అధ్యయనం జరగాలి
‘‘రాష్ట్రం కోసం చాలామంది పనిచేశారు. వారిని మనం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు స్మృతివనం ద్వారా మనం కేవలం వీడియోలు, ఫోటోలు మాత్రమే కాకుండా ఒక చైర్ కూడా ఏర్పాటుచేసి పొట్టి శ్రీరాములు సమాజానికి ఏవిధంగా పనిచేశారో, దానిపై అధ్యయనం చేయాల్సిన అవసరముంది. దానికి వేదికపై ఉన్న పెద్దల సహకారం కోరుతున్నా. ఇప్పుడు ప్రదర్శించిన వీడియోలో పెద్దగా ఫోటోలు లేవు. ఆయన ఫోటోలన్నీ సేకరించాలి. లైబ్రరీనుంచి బుక్స్ తీసుకువచ్చి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. స్మృతివనం నిర్మించడమే కాదు.. ఒక చైర్ ఏర్పాటుచేసి ఆయన చరిత్రపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది’’ అని లోకేశ్ ప్రతిపాదించారు.
ఇది కమిట్‌మెంటే కాదు.. ఎమోషన్ కూడా
‘‘పాదయాత్ర చేస్తున్నప్పుడు అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్య సోదరులు కోరారు. అప్పుడే హామీ ఇవ్వడం జరిగింది. ఇది కమిట్‌మెంట్ మాత్రమే కాదు.. ఇది నాకో ఎమోషన్. పాదయాత్రలో మిమ్మల్ని కలిసిన తర్వాతనే ఆయన గురించి తెలుసుకున్నాను. అందుకే ఒక ఎమోషన్‌తో మేం అందరం పనిచేస్తున్నాం. అన్నిరకాలుగా ట్రస్ట్‌కు మేం సహకరిస్తాం, నిలబడతాం. కలిసికట్టుగా ముందుకెళ్లి ఎవరూ ఊహించనట్టుగా అద్భుతమైన స్మృతివనం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. అమర్ రహే పొట్టి శ్రీరాములు’’ అని లోకేశ్ భావోద్వేగంతో ప్రకటించారు.
ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ ‘‘అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ప్రతిష్టించాలని, ఆడిటోరియం నిర్మించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను కోరిన వెంటనే అంగీకరించారు. ఆ బాధ్యతను మంత్రి నారాయణ మీద వేసుకుని సీఆర్డీయే అధికారులతో మాట్లాడి స్థలం కేటాయించారు. వాసవీ కన్యాకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరితే సీఎంని ఒప్పించి, పెనుగొండ పంపించి పట్టువస్త్రాలు సమర్పించిన ఘనత ఎన్డీయే కూటమిది. పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం కోసం అమరావతి నడిబొడ్డున 6.8 ఎకరాల స్థలం కేటాయించారు. రాబోయే మార్చి 16న 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి నారా లోకేశ్‌తో ఆవిష్కరింపజేస్తామని మాట ఇస్తున్నా’’ అని ప్రకటించారు.
మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ… మంత్రి లోకేష్ గేమ్ చేంజర్. పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించాలని రాకేష్‌కు ఆలోచన రావడం గొప్ప విషయం. ఇందుకు ధన్యవాదాలు. మా టీజీవీ గ్రూప్ తరపున మొదటి విరాళం రూ.కోటి అందిస్తున్నాం. ఇతర ఏ సహకారం కావాలన్నా అందిస్తాం. గత ఎన్నికల్లో 95 శాతం ఆర్యవైశ్యులు కూటమికి ఓటేశారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా నాకు కూడా మంచి శాఖ కేటాయించి గుర్తింపునిచ్చారు’’ అని ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి పి నారాయణ మాట్లాడుతూ.. హరిజనుల కోసం పొట్టి శ్రీరాములు ఉద్యమాలు చేశారు. 58 రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టి ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి పాల్పడ్డారు. అలాంటి వ్యక్తికి విగ్రహం ఏర్పాటు చేయాలని లోకేశ్.. సీఎంకు ప్రతిపాదించగానే వెంటనే ఆదేశాలు జారీ అయ్యాయి. 6.8 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం. 2026 మార్చి 16 నాటికి స్మృతివనం నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతున్నారు. సీఆర్డీయే తరపున అన్ని విధాల సహకారం అందిస్తా’’మని హామీ ఇచ్చారు. అనంతరం పొట్టి శ్రీరాములు వారసులు నలుగురిని స్జేజిపైకి ఆహ్వానించి మంత్రి లోకేష్ వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంత్రి లోకేష్‌కు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ పొట్టి శ్రీరాములు జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.