- సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు
- ప్రజావినతుల్లో బాధితుడి వినతిపత్రం
- గ్రీవెన్స్‌కు తరలివచ్చిన అర్జీదారులు
- వినతులు స్వీకరించిన మంత్రి గొట్టిపాటి
మంగళగిరి(చైతన్యరథం): తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు గురువా రం టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తారు. శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డిలు అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
` కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడు గ్రామానికి చెందిన ఈదిగ వీరన్న సమస్యను వివరిస్తూ 1971లో తన తండ్రి కొనుగోలు చేసిన భూమిని సీ. నాగేశ్వరరావు అనే వ్యక్తి అక్రమంగా ఆన్‌లైన్ చేయించుకున్నాడని ఫిర్యాదు చేశారు. దీనిపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఎటువంటి పరిష్కారం దొరకలేదని వివరించాడు. దయచేసి ఈ అక్రమ ఆన్‌లైన్‌ను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
` విజయనగరం జిల్లా డెంకాడ మండలం బంటుపల్లి గ్రామంలో తన తండ్రి పొలం కొనుగోలు చేశారని.. తాము విజయవాడలో ఉండి అక్కడి పొలాన్ని కౌలుకు ఇవ్వగా అధికారులు, కబ్జాదారులు కుమ్మక్కై రికార్డుల్లో పేర్లు మార్చారని విజయవాడకు చెందిన గోవిందరావు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
` 2018లో నాడు చంద్రబాబు మహిళల మీద ఉన్న గౌరవ అభిమానాలతో పశువైద్యశాలల్లో 6400 మంది డ్వాక్రా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కల్పించారు.. పశు సఖి వర్కర్స్‌గా రైతులకు, డాక్టర్స్‌కు వారధిగా పనిచేస్తున్న తమను గత ప్రభుత్వం తొలగించి తమకు అన్యాయం చేసిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తమను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
` తమకు వారసత్వంగా వచ్చిన భూమిని ఆన్‌లైన్ చేయమంటే అధికారులు పట్టించుకోవడం లేదని పల్నాడు జిల్లా అచ్చెంపేటకు చెందిన సందేపోగు రాజు వినతి పత్రం అందజేశాడు. తమ భూమిని ఆన్ లైన్ చేసేలా చూడాలని వేడుకున్నారు.
` తాను ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యానని.. తనకు రావాల్సిన బకాయి డబ్బులు ఇవ్వమంటే అధికారులు ఏదోక సాకుతో తిప్పుకుంటున్నారని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన గోనుగుంట్ల పూర్ణచంద్రరావు ఫిర్యాదు చేశాడు. దయచేసి తన సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
` 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నాడు 18 సంవత్సరాలు దాటి పెళ్లి కాని అమ్మాయిలకు కూడా పరిహారం ఇస్తామని చెప్పి నేడు పరిహారం ఇవ్వకుండా అధికా రులు తమను ఇబ్బంది పెడుతున్నారని ఏలూరు జిల్లాకు చెందిన పలువురు పోలవరం నిర్వాసితులు తెలిపారు. పరిహారం ఇవ్వడానికి ఉన్న సమస్యను పరిష్కరించి తమకు కూడా నిర్వాసిత పరిహారం అందజేయాలని తల్లవరం గ్రామానికి చెందిన కుంజం విజయలక్ష్మి, ఇరపం లక్ష్మి, కొండ్రుకోటకు చెందిన యండపల్లి పరిమళ కోరారు.