- రూ.4.10 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు తరగతుల నిర్మాణానికి శంకుస్థాపన
రామచంద్రపురం (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సభాష్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రధానమంత్రి ఉషా పథకం కింద మంజూరైన రూ.4.10 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం సర్వరాయ షుగర్స్ (చెల్లూరు) మంజూరు చేసిన సీఎస్‌ఆర్ నిధులు రూ. 10 లక్షలతో ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌ను మంత్రి సుభాష్‌తో పాటు, కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, జనసేన ఇన్చార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విద్యకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయన్నారు. ప్రధానమంత్రి ఉషా పథకం కింద రాష్ట్రంలో మొత్తం 19 కళాశాలలకు నిధులు మంజూరు చేశారని మంత్రి సుభాష్ తెలిపారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్య, గ్రామీణ విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేస్తోందన్నారు.
ఈ నిధుల ద్వారా 13 అదనపు తరగతుల నిర్మాణం పూర్తవుతుందన్నారు. తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా ప్రమాణాలు అందించే అవకాశం కలుగుతుందన్నారు. విద్యకు సంబంధించి ఎలాంటి సహకారం అవసరమైన అందించడానికి తాను ఎప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా విద్యకు సంబంధించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణంతో విద్య బోధనకు మరింత సౌకర్యం ఏర్పడుతుందన్నారు. అదనపు తరగతులు త్వరితగతిన నిర్మాణం పూర్తి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ రామకృష్ణ, కూటమి పార్టీ నాయకులు గరికపాటి సూర్యనారాయణ, అక్కల రిశ్వంత్ రాయ్, నాయుడు మాస్టర్, కళాశాల సిబ్బంది, వార్డు కౌన్సిలర్, పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.