- కూటమి మధ్య చిచ్చుకు వైసీపీ చేసే కుట్రలను తిప్పికొట్టండి
- రెడ్ బుక్ మరువను… కేడర్‌ను ఇబ్బంది పెట్టిన వారిని వదలను
- సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తా… పనిచేసే వారిని గుర్తిస్తా
- మన పెద్దపండుగ మహానాడును విజయవంతం చేయండి
- గుంతకల్లు ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత నారా లోకేష్
గుంతకల్లు (చైతన్యరథం): ప్రతి కార్యకర్త మన ప్రభుత్వం చేసింది చెప్పుకోవాలి.. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రూ.4వేల పెన్షన్ ఇవ్వడం లేదు.. అవ్వతాతలకు అండగా నిలిచేందుకే పెన్షన్ పెంచాం.. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తున్నాం.. వాటిగురించి పార్టీ కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లి మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపు ఇచ్చారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి సమీపంలోని రామరాజుపల్లిలో గురువారం జరిగిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత లోకేష్ మాట్లాడుతూ….అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే కసితో పనిచేయాలన్నారు. బాబు సూపర్ `6, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో పార్టీ తరపున పలు హామీలు ఇచ్చాం. ఒక్కొక్కటిగా వాటిని అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 11నెలల ప్రజాప్రభుత్వంలో వృద్ధాప్య పెన్షన్ రూ.4వేలకు, వికలాంగ పెన్షన్ రూ.6వేలకు పెంచాం. రాష్ట్రవ్యాప్తంగా పేదల ఆకలితీర్చే అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ పథకంలో నిబంధనలు సడలించి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు చేయాలని నిర్ణయించాం. మత్స్యకారులకు ఆర్థికసాయం అందించాం, చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రోడ్లపై గుంతలన్నీ పూడ్చుకుంటూ వస్తున్నాం. జూన్ మాసంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ఇస్తాం. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ ముందుకెళ్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి
మన ప్రభుత్వం స్కూళ్లు మూసివేస్తోందని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఒక్క పాఠశాలను కూడా మూయడం లేదు. అది మన లక్ష్యం కాదు. ఒక క్లాస్ కు ఒక టీచర్ ఉండాలన్నదే మన ధ్యేయం. మన ప్రభుత్వం వచ్చేనాటికి కేవలం 1200 స్కూళ్లలో క్లాసుకో టీచర్ ఉంటే, ఇప్పుడు 9800 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో 45లక్షల మంది విద్యార్థులు ఉండగా, ఇప్పుడు 33లక్షలకు పడిపోయారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతాం. మంత్రి నారాయణ సహకారంతో ప్రభుత్వ జూనియర్ కాలేజిల్లో మంచి ఫలితాలు వచ్చాయి. మన ప్రభుత్వం వచ్చి జూన్ మాసానికి సంవత్సరం అవుతుంది. జూన్ నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇస్తాం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా అన్నీచేస్తాం. బీజేపీ, జనసేన పార్టీతో కలిసి పొత్తుతో పోటీచేశాం. నామినేటెడ్ పదవుల విషయంలో వారితో మాట్లాడి పదవులు ఇస్తున్నాం. కొందరు వైసీపీ వాళ్లు అపోహలు సృష్టిస్తున్నారు, వక్ఫ్ బిల్లులో సవరణలు ప్రతిపాదించి ముస్లిం సోదరులకు అండగా నిలిచాం. ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత టీడీపీ చూసుకుంటుంది. జనసేనతో కలిసి పోటీ చేశాం, భవిష్యత్తులో కలిసే ప్రయాణం చేస్తాం, మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు. ఈరోజు మనం తలెత్తుకుని తిరగడానికి కేంద్ర సహకారం కారణం. దేశవ్యాప్తంగా విశాఖ స్టీల్ తప్ప అన్ని ప్రైవేటీకరిస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సాయం చేస్తున్నారు. వైసీపీ వాళ్లు చిచ్చుపెట్టాలని చూస్తారు, సమర్థవంతంగా తిప్పికొట్టాని మంత్రి లోకేష్ సూచించారు.
5ఏళ్లలో చేయలేనిది 11నెలల్లో చేశాం
యువగళం పాదయాత్ర చేసినపుడు కార్యకర్తల అభీష్టం మేరకు కష్టపడిన కార్యకర్తలను గుర్తించడానికి మీ ముందుకు వస్తున్నా. కార్యకర్తల పనితీరును టెక్నాలజీకి అనుసంధానం చేస్తే ఎవరు పనిచేస్తారో తెలుస్తుందని నేను ఆనాడే చెప్పా. దీనివల్ల ఎవరు పనిచేస్తున్నారో స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చే ముందు క్లస్టర్, గ్రామ, మండల నేతలను కలుస్తానని చెప్పిన మేరకు శుక్రవారం మెగా సోలార్ పార్కు శంకుస్థాపనకు వచ్చే ముందు ఇక్కడకు వచ్చా. అయిదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేయలేనిది 11నెలలో చేసి చూపించాం. కరెంటు చార్జీలు పెంచబోమని చెప్పాం. జగన్ నిర్వాకం వల్లే ట్రూ అప్ చార్జీలు వేయాల్సి వస్తోంది. దీనిపై మనం మాట్లాడకపోతే దెబ్బతింటాం. 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ఇచ్చాం. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రానికి పెద్దఎత్తున కంపెనీలు వస్తున్నాయి. అనంతపురానికి రూ. 22వేల కోట్ల విలువైన భారీ సోలార్ విండ్ ప్రాజెక్టు వస్తోంది. విశాఖకు టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్ వస్తోంది. రాబోయే అయిదేళ్లలో మనపిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. పార్టీ కార్యకర్తలంతా ప్రభుత్వపరంగా చేపట్టే అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళాలని మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు.
అందరి కష్టంతో చరిత్రను తిరగరాశాం
పార్టీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ లేనివిధంగా ప్రజలు కూటమికి 94శాతం సీట్లు ఇచ్చారు. సునామీ మాదిరి ప్రజలు ఇచ్చిన తీర్పుతో చరిత్ర తిరగరాశాం, దీనివెనుక కార్యకర్తల కష్టం, త్యాగాలు ఉన్నాయి. నాలుగున్నర దశాబ్దాల్లో అధికారం, ప్రతిపక్షం రెండూ చూశాం. అయితే గత అయిదేళ్ల లాంటి అరాచక పాలన ఇదివరకెన్నడూ చూడలేదు. గతంలో చంద్రబాబు పరామర్శకు వెళ్తే ఎవరూ ఆపే సాహసం చేయలేదు. 2019 నుంచి 24వరకు భయానక పరిస్థితులు కల్పించారు. చంద్రబాబు బయటకు వస్తుంటే ఇంటి గేట్లకు తాళ్లు కట్టేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే బి.ఫారాలు పట్టుకెళ్లారు, ఇళ్లు ధ్వంసం చేశారు. పుంగనూరులో అంజిరెడ్డి తాత మీసాలు మెలేసి తొడగొట్టి నామినేషన్ వేశారు. ఆయనే నాకు స్పూర్తి. పల్నాడులో మంజులారెడ్డి అనే తెలుగు మహిళ బూత్ ఏజంటుగా ఉన్నందుకు కత్తులతో దాడిచేసినా పోలింగ్ అయ్యి ఓటింగ్ మిషన్ సీల్ వేసేవరకు అక్కడే ఉన్నారు. పల్నాడులో చంద్రయ్య మెడపై కత్తిపెట్టి జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నందుకు మెడకోసి హత్యచేశారు, అయిదేళ్ల రాక్షస పాలనలో అనేక కష్టాలు మనం ఎదుర్కొన్నామని మంత్రి లోకేష్ గుర్తు చేశారు.
సభ్యత్వంలో సత్తా చాటాం
తెలుగుదేశం పార్టీ రెండేళ్లకోసారి చేపట్టే సభ్యత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా చేసి చూపించారు. భారత్ లో ఏ ప్రాంతీయ పార్టీకి లేనివిధంగా కోటి సభ్యత్వాలు టీడీపీకే సొంతం. దానికి కార్యకర్తల కష్టమే కారణం. కార్యకర్తల బీమాను రూ.5 లక్షలకు పెంచాం, పేదపిల్లలకు నిరంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్య అందిస్తున్నాం. కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. గుంతకల్లులో గుమ్మనూరు జయరాంను ఎన్నికలకు నెలముందు చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు, అయినప్పటికీ భుజాలపై మోసి గెలిపించారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలు తెలుసుకోవాల్సిందిగా ఎమ్మెల్యేని కోరుతున్నా. వారి సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకోవాలి. పార్టీలో పాత, కొత్తల కలయిక జరగాలి. పనిచేసినవారికి పెద్దపీట వేయాలి. సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తా, పనిచేసేవారిని ప్రోత్సహిస్తా. కార్యకర్తలు గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండాలి. మనందరిదీ ఒకటే వర్గం, అది తెలుగుదేశం. గత 35 ఏళ్లలో ఎప్పుడూ గెలవని మంగళగిరిలో 2019లో పోటీచేసి నేను ఓడిపోయా. మొదటిరోజు బాధపడినా రెండోరోజు నుంచి కసిపెరిగింది. కష్టపడి పనిచేసి అక్కడ చరిత్ర తిరగరాశాం. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచాం, మంగళగిరిలో ఇప్పుడు ఎటువంటి గ్రూపులు లేవని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
కేడర్‌ను ఇబ్బందులు పెట్టినవారిని వదలను
పార్టీ కేడర్ ఎర్ర బుక్ గురించి అడుగుతున్నారు. మన కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వారిని వదలను. నా అంతట నేనుగా ఎవరితో గొడవపెట్టుకోను, మన జోలికి వస్తే మాత్రం వదలను. గత ప్రభుత్వంలో మద్యంలో ఎంత కుంభకోణం జరిగిందో రాష్ట్రమంతా చూస్తున్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో కొంచెం సమయం పట్టొచ్చు. కార్యకర్తలు అహంకారం లేకుండా ప్రజల్లోకి వెళ్లి వారి చుట్టూ తిరగాలి. పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. కార్యకర్తల కోసం జగన్‌పై కంటే మూడురెట్ల ఎక్కువగా పార్టీలో పోరాడుతున్నా. ఇది మన కుటుంబం, మన పార్టీ. అన్యాయం జరిగితే నన్ను, ఇతర పార్టీ పెద్దలను కలవాలి. ఇన్‌చార్జి మంత్రి నెలకు ఒకసారి రావాలని ఇప్పటికే చెప్పా. జోనల్ కోఆర్డినేటర్, పార్లమెంటు అధ్యక్షుడు ఉన్నారు. సమస్యలపై నాలుగు గోడల మధ్య యుద్ధం చేద్దాం, బయటకు వచ్చాక జై తెలుగుదేశం అని నినదిద్దామని మంత్రి లోకేష్ అన్నారు.
త్వరలో మై టీడీపీ పేరుతో కొత్త యాప్
పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు కేడర్ కు చేరవేసేందుకు మహానాడు తర్వాత మై టీడీపీ పేరుతో కొత్త యాప్ విడుదల చేస్తాం. కెఎస్‌ఎస్, బూత్, క్లస్టర్, అందరికీ ఒకే యాప్ ద్వారా కార్యక్రమాలపై సందేశాలు పంపిస్తాం. ఈనెల 18,19,20 నియోజకవర్గ స్థాయిలో మినీ మహనాడు జరుగుతుంది. 27,28, 29 కడపలో మన పెద్దపండుగ మహనాడు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొనాలని మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జోన్ ` 5 కోఆర్డినేటర్ కోవెలమూడి నాని, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, అనంతపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.