విజయవాడ (చైతన్య రథం): పేదలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తోందని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుగారు అన్నారు. ఈమేరకు ఆదివారం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో నందిగాం మండలం దిమ్మిడిజోల గ్రామానికి చెందిన 15మంది లబ్ధిదారుకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదలకు ఇళ్లు కడతామని నమ్మించి కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడిరదన్నారు. పేదల కల నేరవేర్చలేకపోయారని దుయ్యబట్టారు. నియోజకవర్గపరిధిలో అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ స్ధలాలు గర్తించమని అధికారులను ఆదేశించామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతగూడు కల నెరవేర్చడమే లక్ష్యమని మంత్రి అన్నారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి, సోమేశ్వరరావు, తెలుగు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.