- వైసీపీ పాలనలో కనీసం మరమ్మతులకూ నోచని రోడ్లు
- జగన్ రెడ్డి హయాంలో అధ్యాన్న రోడ్లపై లక్షా 15 వేల ప్రమాదాలు
- 43 వేల మంది ప్రాణాలు కోల్పోయారు
- నేడు కూటమి ప్రభుత్వంలో రహదారులకు నూతన కళ
- రాష్ట్రం బాగుండాలంటే దుష్టశక్తులను ప్రజలే అడ్డుకోవాలి
- టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య
అమరావతి (చైతన్యరథం): ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం రోడ్లకు మరమ్మతులు చేసిన పాపాన పోలేదని.. దాంతో లక్షా 15 వేల రోడ్డు ప్రమాదాలు జరిగి 43 వేల మంది ప్రాణాలు కోల్పోయారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య విమర్శించారు. వ్యవస్థలను సర్వనాశనం చేసి దోచుకోవడం దాచుకోవడం తప్ప నాటి పాలకులు ప్రజలకోసం చేసింది ఏమి లేదని మండి పడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆనంద్ సూర్య మాట్లాడుతూ.. ఐదేళ్ల వైసీపీ పాలనలో రహదారుల నిర్వహణ పూర్తి అధ్వాన్నంగా మారిందన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో రోడ్లకోసం రూ.500 కోట్లు కేటాయించినా ఖర్చు చేసింది కేవలం రూ.10 కోట్లు మాత్రమే. 2014-19 మధ్య కాలంలో 26 వేల కి.మీ. సీసీ రహదారులు, 22 వేల కి.మీ. బీటీ రహదారులను సీఎం చంద్రబాబు నిర్మించారు.
సుమారు 6 వేల కి.మీ. రాష్ట్ర, జాతీయ రహదారులు నిర్మించారు. రూ.36 వేల కోట్లతో మరో 5 జాతీయ రహదారుల అభివృద్ధికి అంచనాలు రూపొందించారు. మరో 8 వేల సీసీ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 6,534 కి.మీ. మేర కొత్త రహదారుల నిర్మాణం, 624 కి.మీ. పాత రోడ్లు బాగు చేసేందుకు ఏఐఐబీతో ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు అవసరమయిన రూ.4944 కోట్లలో 70 శాతం రుణం ఇచ్చేందుకు ఏఐఐబీ అంగీకరించింది. 2019-24 మధ్య అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి రహదారుల నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేశాడు. 30 శాతం రాష్ట్ర వాటా ఇవ్వకుండా మూర్ఖపు ఆలోచనతో ఒప్పందాన్ని రద్దు చేశాడు. అటు అమరావతి ` అనంతపురం ఎక్స్‌ప్రెస్ వేని ఆపేశాడు. అమరావతి రింగ్ రోడ్డ్ పనుల్ని నిలిపివేశాడు. ఇలా రాష్ట్ర ప్రగతికి గత టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ప్రతి పనినీ అడ్డుకున్నాడు. ధ్వంసం చేశాడు. సుమారు 30 వేల కి.మీ. రహదారులు రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్నా పట్టించుకోలేదని ఆనంద్ సూర్య దుయ్యబట్టారు.
చంద్రబాబు అధికారంలోకి రాగానే..
ఈ పరిస్థితుల్లో 2024లో అధికారంలోకి రాగానే గుంతలమయమైన రహదారులపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. సంక్రాంతి పండుగకు ఊళ్లకు వచ్చే ప్రతి బిడ్డకు నూతన రహదారులు స్వాగతం పలకాలనే సంకల్పంతో రహదారుల మరమ్మతులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఒక పండుగలా ‘‘గుంతల రహిత రహదారులు’’ కార్యక్రమం చేపట్టి తనే స్వయంగా అనకాపల్లిలో ప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తం దెబ్బతిన్న రాష్ట్ర, గ్రామీణ రహదారులకు మరమ్మతులు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించి రూ.861 కోట్లు ఖర్చు చేసి 20,058 కి.మీ. మేర గుంతలమయమైన రహదారులను బాగు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.55 వేల కోట్లతో 2,376 కి.మీ. జాతీయ రహదారుల నిర్మాణ పనులు చకచకా కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లోనే 652 కి.మీ. జాతీయ రహదారి పనులు పూర్తి చేశారు. 2,640 చోట్ల శిథిలమైన వంతెనలకు, కల్వర్టులకు రూ.5,460 కోట్లతో పనులు చేపట్టారు. రాష్ట్రంలో 14 జాతీయ రహదారులకు కేంద్రం రూ.4,744 కోట్లు ఆమోదం తెలిపేలా చంద్రబాబు కృషి చేశారు.
మచిలీపట్నం` విజయవాడ రోడ్డును 6 వరుసల రహదారిగా విస్తరించనున్నారు. తద్వారా బందర్ పోర్ట్ నుంచి సరకు రవాణాతో రాష్ట్రానికి మరింత ఆదాయం వస్తుంది. ఎన్నో ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. చంద్రబాబు కృషి వల్ల హైదరాబాద్ ` అమరావతి మధ్య గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే విజయవాడ ` ఖమ్మం మధ్య జాతీయ రహదారి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జగన్ హయాంలో నిలిచిపివేసిన అనంతపురం ` అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే పనులకు సంబంధించి డీపీఆర్ సిద్ధమైంది. ప్రజా రాజధాని అమరావతి చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం సమ్మతితో శ్రీకారం చుట్టాం. ప్రజా రాజధానిలో జరుగుతున్న పనులు చూసి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు తరలివస్తున్నారు.
భారతమాల కింద రాష్ట్ర్లంలో 7 నేషనల్ హైవేలకు సంబంధించి రూ.6,280 కోట్లతో పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 10,200 వేల కి.మీ. రాష్ట్ర రహదారుల నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం రూ.3,296 కోట్లతో 1,307 కి.మీ. రహదారి పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రగతికి సోపానాలైన రహదారుల నిర్మాణానికి బడ్జెట్ లో రూ.8,700 కోట్లు కూటమి ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలో ఉన్న ఎయిర్ పోర్ట్‌లు, పోర్ట్ లు, పరిశ్రమలకు మంచి కనెక్టివిటీతో ఉండే రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నందనవనంలా ఏపీని ఉంచుకోవాలనుకున్నప్పుడు దుష్ట పార్టీలను అడ్డుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. అటువంటి వ్యక్తులను ముందుకు రానీయకుండా తుంగలో తొక్కాలి. ఏ వ్యవస్థను జగన్ రెడ్డి పట్టించుకోలేదు. అభివృద్ధిని, ప్రజలను అసలు పట్టించుకోలేదు. అటువంటి దుర్మార్గపు వ్యక్తులను నిలువరించడం మనందరికి కర్తవ్యం. రాష్ట్రం కోసం నిత్యం తపించే కృషీవలుడు సీఎం చంద్రబాబుతోనే సువర్ణాంధ్ర సాధ్యమనే విషయం ప్రజలు గ్రహించాలని ఆనంద్ సూర్య విజ్ఞప్తి చేశారు.