- మహిళలను గౌరవించేలా పాఠ్యపుస్తకాల్లో మార్పులు
- పెట్టుబడులతోపాటు నైతిక విలువల్లోనూ ఏపీని అగ్రగామిగా నిలుపుతాం
- తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత విద్యార్థులదే
- నైతిక విలువలపై రాష్ట్రస్థాయి విద్యాసదస్సులో మంత్రి లోకేష్
విజయవాడ (చైతన్యరథం): నైతిక విలువల ద్వారా సమాజంలో మార్పు తేవాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నన్ను పిలిచి సమాజంలో నైతిక విలువలు తీసుకురావాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. తదనంతరం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును కేబినెట్ ర్యాంకుతో నైతిక విలువల సలహాదారుగా నియమించారు. ఇది ఒక పవిత్రమైన బాధ్యత అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నైతిక విలువలపై సోమవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ‘విలువల విద్యా’ సదస్సులో పాల్గొన్న మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద తాను జీవిత కాలం నేర్చుకునే విద్యార్థిలాంటి వాడిని అన్నారు. రాజకీయాల్లో అనేకమంది వ్యక్తులను కలిసినపుడు అంతా కేబినెట్ ర్యాంకు హోదా కావాలని కోరుకునేవారు, అలాంటిది చాగంటికి కేబినెట్ ర్యాంకు ఇచ్చినా కనీసం కప్పు కాఫీ కూడా తాగలేదు. ప్రభుత్వ వాహనం ఉపయోగించలేదు. ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా ఆయనే చెల్లిస్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తిద్వారా ఈరోజు నైతిక విలువలపై పుస్తకాలు రూపొందించి విద్యార్థుల భవిష్యత్తు కోసం అందిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
నైతిక విలువల ద్వారానే ఉత్తమ పౌరులు
మట్టి.. కుండలా మారుతుంది, శిల.. శిల్పంలా తయారవుతుంది. చిన్న విత్తనం.. పెద్ద చెట్టుగా ఎదుగుతుంది. అలాగే బడిలో పిల్లలకు చదువుతో పాటు నైతిక విలువలు నేర్చితే సమాజంలో మనం ఆశిస్తున్న మార్పును సాధించగలుగుతాం. అణుశక్తిని బాబులా వాడటం వల్ల హిరోషిమా, నాగసాకీ నగరాల్లో ఎంత వినాశనం జరిగిందో అందరం చూశాం. అదే అణుశక్తిని విద్యుత్ తయారీకి వాడితే దేశానికి వెలుగు, అభివృద్ధి లభిస్తుంది. అలాగే పిల్లలను సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులందరిపైనా ఉందని మంత్రి లోకేష్ ఉద్బోధించారు.
మహిళలను గౌరవించాలి
మహిళలను, పెద్దలను గౌరవించాలి. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా నాకు మా తల్లి భువనమ్మ ఈ నైతిక విలువలు నేర్పారు. నా చిన్ననాటి నుంచీ ఆమె నాకు క్రమశిక్షణ నేర్పించారు. ఆమె ఎప్పుడూ.. కష్టపడాలి, నీ వంతుగా ప్రజలకు సేవచేయాలని మాత్రమే చెప్పారు. ప్రభుత్వంగా చేయాల్సింది మేం చేస్తాం. చాగంటి లాంటి గొప్ప వ్యక్తులతో పుస్తకాలు రూపొందిస్తాం. కానీ అది సరిపోదు. మార్పు మన ఇంటినుంచే మొదలు కావాలి. తల్లిదండ్రులుగా మనపై ఉన్న పెద్ద బాధ్యత ఇది. తెలుగుభాషలో కొన్ని వాడుక పదాలు ఉన్నాయి. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అడపిల్లలా ఏడవొద్దు అని ఎవరైనా తక్కువగా మాట్లాడితే నాకు చాలా బాధ కలిగేది. అలాంటి మాటలకు పూర్తిగా ఫుల్‌స్టాప్ పెట్టాలి. అలాంటి మాటలు ఎవరు మాట్లాడినా మా లోకేష్ అన్నకు చెబుతామని చెప్పండి. మహిళలను గౌరవించినపుడే సమాజం బాగుపడుతుంది. సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో మహిళలను అవమానించే డైలాగులు, సన్నివేశాలు ఉండకూడదనే విషయమై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో చర్చించానని మంత్రి లోకేష్ తెలిపారు.
సమాజంలో మార్పు కోరుకుంటున్నా
నేను విద్యాశాఖ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత పాఠ్య పుస్తకాలు పరిశీలించాను. అందులో ఇంటి పనులు చేస్తున్న ఫొటోలన్నీ మహిళలవే కనిపించాయి. వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి, వాటిని మహిళలు, పురుషులకు చెరిసగం ఉండేలా మార్పు చేశాము. పనులు చేస్తున్న మగవారి ఫొటోలు కూడా 50 శాతం పెట్టాం. ఇంటిపనుల కూడా ఇద్దరూ సమానంగా చేయాల్సి ఉంది. నేను అమెరికాలో చదుకునేటప్పుడు నా భార్య బ్రహ్మణ,ి నేను ఇంటిపనులు చెరోసగం చేసేవాళ్లం. మాకు ఎలాంటి భేషజం లేదు. అలాంటి మార్పు సమాజంలో రావాలని బలంగా నమ్ముతున్నా. యువగళం పాదయాత్రలో ఒక చిన్న పిల్లవాడు పసుపు రంగు టీ షర్ట్ వేసుకుని వస్తే నాకు బాధ కలిగింది. చిన్నవయసులో పార్టీరంగులు వద్దని వారించాను. పిల్లల్లో నాకు దేవుడు కన్పిస్తాడు. చంద్రగిరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్నపుడు ఒక తల్లి నన్ను కలసి తన బాధ చెప్పుకుంది. ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆమె పెద్ద కుమార్తెను గంజాయికి బానిస చేసి 30 రోజులు శారీరకంగా వాడుకున్నారు. రాయవెల్లూరు సీఎంసీలోని డీఅడిక్షన్ కేంద్రానికి పంపడానికి మీరు సహాయం చేయండి అని అడిగింది. అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించాం. దీనిని సీరియస్‌గా తీసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
విద్యాశాఖను ఛాలెంజ్‌గా స్వీకరించా
నేను విద్యాశాఖ బాధ్యత తీసుకుంటున్నానని అన్న వెంటనే చాలామంది కఠినమైన శాఖ నీకు ఈ చాలెంజ్ అవసరమా? టీచర్ యూనియన్లు, స్టూడెంట్ యూనియన్లు ఉంటాయి అన్నారు. కానీ జీవితమే ఒక ఛాలెంజ్. మార్కులు తక్కువ వచ్చాయని, తల్లిదండ్రులు మందలించారని పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం బాధ కలిగిస్తోంది. 2019 ఎన్నికల్లో నేను మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి 5300 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఒక్కరోజు బాధ, ఆవేదన కలిగింది. రెండోరోజు నుంచి ఆ అపజయం నాలో కసి పెంచింది. అయిదేళ్లు కష్టపడి వారి మనసు గెలవాలని నిర్ణించుకుని ప్రజల్లోకి వెళ్లాను. అనేకమంది అవమానించినా వెనుకడుగు వేయలేదు. ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తే సాధించే శక్తి దేవుడు మనకు ఇస్తాడు. 2024 ఎన్నికల్లో తిరిగి అదే నియోజకవర్గంలో నేను 91వేల మెజారిటీతో గెలుపొందాను. అదే స్పూర్తితో విద్యాశాఖ మంత్రిగా బాధ్యత స్వీకరించాను. తరతరాలుగా టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించా. టీచర్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్ తెచ్చాను. 9,600 పాఠశాలల్లో వన్ క్లాస్` వన్ టీచర్ విధానాన్ని తీసుకువచ్చాను. ఒక్క లిటిగేషన్ లేకుండా కేవలం 150రోజుల్లో మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీచేశామని మంత్రి లోకేష్ వివరించారు.
తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టండి
కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్ ప్రక్షాళన చేస్తున్నాం. అందులో ఇప్పటికే తొలి అడుగు వేశాం. పిల్లలకు అందించే బ్యాగులు, పుస్తకాలు, బెల్ట్ లపై రాజకీయపరమైన ఆనవాళ్లు లేకుండా చేశాం. వాటిపై ఎక్కడా మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఫోటోలు లేవు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు కిట్స్ అందించాం. డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. ప్రతి శనివారాన్ని నో బ్యాగ్ డే గా ప్రకటించాం. మేము బాధ్యత గల ప్రభుత్వంగా పనిచేస్తున్నాం. ఎంతోమంది మహనీయులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నతస్థానాలకు చేరుకున్నారు. మీ అందరిలో ఆ శక్తి ఉంది. తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేసి ప్రతిరూపాయి మీకోసం ఖర్చుపెడుతున్నారు. వారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. సమాజంలో నైతిక విలువలు చాలా అవసరం. పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి సహా ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమం పూర్తయ్యాక అక్కడి విద్యార్థులంతా నిలబడి ఎవరి బాటిల్, గ్లాస్ తీసుకుని చిన్న పేపర్ కూడా లేకుండా చెత్తబుట్టలో వేశారు. అలాంటి మార్పు మనందరిలో రావాలి. అప్పుడే ఆశించిన సమాజాన్ని సాధించుకోగలమని మంత్రి లోకేష్ అన్నారు.
మాకు చాగంటి దిశానిర్దేశం చేయాలి
మాకు మార్గదర్శకత్వం ఇచ్చి నడిపించాల్సిన బాధ్యత చాగంటిపై ఉంది. 42ఏళ్ల వయసులో నేను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాను. దీనిని ప్రజలు నాపై పెట్టిన పవిత్రమైన బాధ్యతగా భావిస్తున్నా. చాగంటి మార్గదర్శకత్వంలో పనిచేయడానికి విద్యాశాఖ యంత్రాంగం యావత్తు సిద్ధంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలను అన్ని జిల్లాలు, పార్లమెంటు నియోజకవర్గాలు, అసెంబ్లీ కేంద్రాల్లో నిర్వహించాలన్నది నా ఆలోచన. కేవలం ఉపాధ్యాయులు, పిల్లలతోనే కాకుండా ప్రజలను కూడా భాగస్వాములను చేసి చైతన్యం తీసుకురావాలి.. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల సాధనలో నెం.1గా చేయాలని మేమంతా తపనతో పనిచేస్తున్నాం. నైతిక విలువలు కూడా ఉన్నపుడు ఏపీ అన్నిరంగాల్లో అగ్రగామిగా తయారవుతుంది, అందుకు మాకు మార్గదర్శకత్వం వహించాలని చాగంటికి మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, తదితరులు పాల్గొన్నారు.













