- దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు
- కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
- ముగిసిన అభ్యుదయం సైకిల్ యాత్ర
ఇచ్ఛాపురం (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ఉన్నారని, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ కేంద్రంగా మారి యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖ రేంజి పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో 53 రోజులుగా 1300 కి.మీ. మేర సాగిన ‘అభ్యుదయం’ సైకిల్ యాత్ర శనివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలానన్ను హెూంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గంజాయి మూలాలను వెలికితీసి వాటిని పూర్తిగా నిర్మూలిస్తోందని, అలాగే యువతను నైపుణ్యం కలిగిన శక్తిగా మార్చేందుకు కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. శ్రీకాకుళం యువత కేవలం శ్రమశక్తిపైనే కాకుండా, ఆధునిక సాంకేతికత, నైపుణ్యాల కలయికతో ప్రపంచస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
భవిష్యత్తు నాశనం: హోంమంత్రి అనిత
ఇచ్ఛాపురం ఆడబిడ్డగా ఇక్కడ ముగింపు వేడుకలు జరగడం సంతోషంగా ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గంజాయి మత్తులో విద్యార్థులు కన్నవారిపైనే దాడులు చేయడం కలచివేస్తోందని, యువత బంగారు భవితను నాశనం చేసుకోవద్దని కోరారు. మంత్రి లోకేష్ తన పాదయాత్రలో గంజాయి బాధితుల కష్టాలు చూసి ఆనాడే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. ఐజీ గోపీనాథ్ జెట్టి మానస పుత్రికగా తలపెట్టిన ఈ యాత్ర ద్వారా గంజాయిని రాష్ట్రంలో జీరో స్థాయికి తీసుకువచ్చాం. కేవలం శిక్షల ద్వారానే కాకుండా, అవగాహన ద్వారా యువతలో మార్పు తెస్తున్నామని ఆమె వివరించారు.
ఈ సందర్భంగా రూ.9.13 కోట్ల ఆస్తుల జప్తు, 53 వేల కేజీల గంజాయి ధ్వంసం వంటి గణాంకాలను ప్రస్తావించారు.
1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలి
స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెండాలం అశోక్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ అరాచక పాలనలో యువత మత్తులో మునిగిపోయిందని, నేడు ఫ్రెండ్లీ: పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలు భయం వీడి 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని కోరారు. విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిరోధం ఒక్క పోలీస్ శాఖతోనే సాధ్యం కాదని, ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించిన డీజీపీ, ఎస్పీలకు కృతజ్ఞతలు తెలిపారు. కేవలం డ్రగ్స్ మాత్రమే కాకుండా సైబర్ నేరాలు, రహదారి ప్రమాదాలపై కూడా చైతన్యం తెస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈగల్ ఐజి ఎ రవి కృష్ణ మాట్లాడుతు స్వయంగా తల్లిదండ్రులే తమ పిల్లలపై ఫిర్యాదు చేస్తున్నారని, దీని బట్టి మత్తు పదార్థాలు ఎంతగా వారిని బానిస చేస్తున్నాయో అర్థం అవుతుందని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు తమ సహచరుల ప్రవర్తనలో తీవ్రమైన మార్పు వస్తే మత్తుపదార్థాలకు బానిసయ్యారని అనుమానం ఉంటే ఈగల్ కు తెలియజేయాలని, టోల్ ఫ్రీ నెంబర్ను వినియోగించాలన్నారు. పోలీసుల నుండి ఎలాంటి సమస్యలు రావని హామీ ఇచ్చారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ఈ యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందని, జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం నిఘా కొనసాగిస్తుందని తెలిపారు. ఈ యాత్రలో 1.14 లక్షల మంది విద్యార్థులు, 36 వేల మంది ప్రజలు పాల్గొని..సే నో టు డ్రగ్స్ బ్రో.. అంటూ నినదించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నడకుదుటి ఈశ్వరరావు, బగ్గు రమణ మూర్తి, గౌతు శిరీష, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ఎస్పీలు తుహిన్ సిన్హా, ఏఆర్ దామోదర్, మాధవరెడ్డి పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా పోలీసు శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, విజేతలకు బహుమతులు అందజేశారు.















