- ప్రభుత్వానికి తెలియకుండా జరిగిన తప్పును మన్నించాలి
- కూల్చిన పలు షెడ్ల పునర్నిర్మాణానికి సొంత నిధులిస్తా
- ఆర్టీసీ బస్సు సర్వీస్ కల్పించేందుకు మంత్రితో మాట్లాడతా
- కాశీనాయన ఆశ్రమ నిర్వాహకులు జీరయ్యస్వామికి మంత్రి లోకేష్ హామీ
అమరావతి (చైతన్య రథం): ప్రభుత్వానికి తెలియకుండానే అటవీ శాఖ అధికారుల అత్యుత్సాహంతో కాశీనాయన ఆశ్రమంలో పలు షెడ్ల కూల్చివేతకు పాల్పడ్డారని, ఇది తప్పిదమేనని, ఆశ్రమ నిర్వాహకులు జీరయ్యస్వామికి విద్య ఐటీ మంత్రి నారా లోకేష్ క్షమాపణలు చెప్పారు. అటవీ భూములు, టైగర్ జోన్ కారణంతో ఇటీవల కాశీనాయన ఆశ్రమానికి సంబంధించిన పలుషెడ్లను అటవీ అధికారులు కూల్చివేశారు. దీనిపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్.. ఆశ్రమ నిర్వాహకులు జీరయ్యస్వామితో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వానికి తెలియకుండా అటవీశాఖ అధికారులు చేసిన తప్పిదానికి మన్నించాలని కోరారు. సమాచారం తెలిసి చాలా బాధపడ్డానని వివరించారు. కూల్చిన షెడ్ల పునర్నిర్మాణానికి సొంత నిధులిస్తానని, ఆర్టీసీ బస్సు సర్వీస్ కల్పించేందుకు రవాణా శాఖా మంత్రితో మాట్లాడతానని జీరయ్య స్వామికి మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. కాశీనాయన ఆశ్రమం, జ్యోతిక్షేత్రం నిర్వాహకులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయాలని, అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తామని, సాయం అందిస్తామని మంత్రి లోకేష్ భరోసానిచ్చారు.