- మున్సిపల్ మంత్రి నారాయణ ఆదేశం
- 26న మరోసారి భేటీకి నిర్ణయం
అమరావతి (చైతన్య రథం): విశాఖ అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ తొలిదశ పనులు సెప్టెంబరులోగా పూర్తి కావాలని మున్సిపల్ మంత్రి పి నారాయణ ఆదేశించారు. విశాఖపట్నం యూజీడీ పనులపై అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన సమావేశానికి జీవీఎంసీ అధికారులతో పాటు యూజీడీ పనులు చేస్తున్న టాటా ప్రాజెక్ట్స్ ప్రతినిధులు హాజరయ్యారు.. విశాఖపట్నంలోని పెందుర్తి, గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో రెండు ప్యాకేజీలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులను చేపట్టారు. ఈ రెండు ప్యాకేజీల పనులను టాటా ప్రాజెక్ట్స్ సంస్థ దక్కించుకుంది. రెండు ప్యాకేజీల ద్వారా మురుగునీరు పారుదల కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణంతో పాటు రీసైక్లింగ్ వాటర్‌ను హెచ్‌పీసీఎల్, ఆర్‌ఐఎన్‌ఎల్‌కు సరఫరా చేసేలా ఒప్పందం చేసుకుంది. మొదటి ప్యాకేజీలో భాగంగా పెందుర్తి ప్రాంతంలో 226 కిలోమీటర్ల యూజీడీ పనులను 412 కోట్లతో చేపట్టింది. మొదటి ప్యాకేజిలో 46 ఎంఎల్‌డీ నీటిని రెండు సంస్థలకు సరఫరా చేయాల్సి ఉంది. ఇక రెండో ప్యాకేజిలో భాగంగా గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో 429 కిమీ మేర యూజీడీ పనులను రూ.530 కోట్లతో చేపట్టారు. రెండు ప్యాకేజిలకు సంబంధించిన పనులపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. కాంట్రాక్ట్ సంస్థ టాటా ప్రాజెక్ట్స్‌కు పెండిరగ్ ఉన్న బిల్లులను త్వరితగతిన క్లియర్ చేయాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. మొదటి ప్యాకేజి పనులను సెప్టెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని టాటా ప్రాజెక్ట్స్ ప్రతినిధులను ఆదేశించారు. ఈనెల 26న మరోసారి ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చించాలని మంత్రి నారాయణ నిర్ణయించారు. వచ్చేవారంలో విశాఖపట్నంలో పర్యటించి ప్రాజెక్ట్ పనులను స్వయంగా పరిశీలించాలని మంత్రి నారాయణ నిర్ణయించారు.