- వ్యవసాయాభివృద్దికి పాటుపడతా, రైతన్నలకు అండగా నిలుస్తానని స్పష్టీకరణ
అమరావతి(చైతన్యరథం) తనపై నమ్మకంతో అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర వ్యవసాయశాఖ, మార్కెటింగ్, పశుసంవర్థక శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తనకు చంద్రబాబు నాయుడు అప్పగించిన బాధ్యతను అంతఃకరణ శుద్ధితో నిర్వహించి ప్రతిక్షణం రైతన్నల సంక్షేమానికి, రాష్ట్ర వ్యవసాయాభివృద్దికి పాటుపడతానని తెలిపారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖను భ్రష్టుపట్టించింది. రానున్న 5 ఏళ్లలో రాష్ట్రంలో వ్యవసాయాభివృద్దికి పాటుపడతాం. విత్తనం నుంచి విక్రయం వరకు రైతన్నలకు అన్ని విధాలా అండగా నిలబడతాం. రైతుల ఆదాయం పెంపొందించేందుకు కృషి చేస్తా. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అందించిన సబ్సిడీ యంత్రాలు, యంత్ర పరికరాలు, మైక్రో ఇరిగేషన్ వంటి అన్ని పథóకాలు పునరుద్ధరిస్తాం. రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
 
	    	 
 














