- మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం
- మంత్రి నారా లోకేష్ భరోసా
అమరావతి (చైతన్యరథం): అన్నమయ్య జిల్లా గుండాల కోన వద్ద ఏనుగుల దాడిలో వై.కోటకు చెందిన ముగ్గురు భక్తులు మృతి చెందారన్న వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
మంత్రి మండిపల్లి సంతాపం
అన్నమయ్య జిల్లాలో భక్తులపై ఏనుగుల దాడి ఘటనపై జిల్లాకు చెందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. భక్తుల మృతి పట్ల మంత్రి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారి పరిస్థితిపై ఫోన్‌లో ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
మంత్రి జనార్దన్‌రెడ్డి దిగ్భ్రాంతి
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తుల మృతిపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగుల దాడి చేయడంపై జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. గాయపడిన వారికీ మెరుగైన వైద్యం సహాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.
మంత్రి ఆనం ప్రగాఢ సానుభూతి
అన్నమయ్య జిల్లాలో భక్తులపై ఏనుగుల దాడి ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరా తీశారు. ఘటనపై ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
భద్రత పెంచాలి: హోంమంత్రి అనిత
శ్రీశైల క్షేత్రంలో ఉత్సవాల నేపథ్యంలో అడవి మార్గంలో కాలినడకన వచ్చే భక్తులకు భద్రత ఏర్పాట్లు పెంచాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమ సహా అటవీ ప్రాంతాల్లోని శివాలయాల వద్ద భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాలినడకతో కర్ణాటక సహా పలు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు సదుపాయాలతో పాటు వారి రక్షణ కోసం పోలీస్ శాఖ అటవీ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని హోంమంత్రి అని దిశా నిర్దేశం చేశారు.