అమరావతి: హత్యలు చేసే సంస్కృతి జగన్ రెడ్డిది, వైసీపీదేనని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. శనివారం సీఎం నివాసం వద్ద మీడియాతో అనగాని మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యాలన్నింటినీ కూటమి ప్రభుత్వానికి జగన్ రెడ్డి అంటగడుతున్నారని మండిపడ్డారు. పార్టీ మారనందుకు తమ నేత తోట చంద్రయను హత్య చేసిన సంస్కృతి వైసీపీదన్నారు. టీడీపీ ప్రభుత్యం హత్యా రాజకీయాలను అసలు ప్రోత్సహించదన్నారు. తోట చంద్రయ్య లాగా ఎంతో మంది టీడీపీ నేతలను జగన్ రెడ్డి హత్య చేయించారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని జగన్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ళలో టీడీపీ అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తే జగన్ రెడ్డి హేళన చేశారని, నిండు సభలో మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా తమ పార్టీ అధినేతను అవమానించారని, తమ దళిత ఎమ్మెల్యే పై దాడి చేశారని, దీన్ని గమనించే ప్రజలు 11 సీట్లే గెలిపించారని , అయినా జగన్ రెడ్డికి బుద్ధి రాలేదన్నారు. జగన్ రెడ్డి బెదిరింపులకు బెదిరేవారు ఎవరూ లేరన్నారు.
ఇప్పటికైనా జగన్ రెడ్డి శవ రాజకీయాలను మానేసి అసెంబ్లీకి వచ్చి ప్రజలకు ఉపయోగపడే చర్చల్లో పాల్గొంటే మంచిదని మంత్రి అనగాని సత్యప్రసాద్ హితవు చెప్పారు. 5 ఏళ్ల పాటు నేరాలు, ఘోరాలతో రాష్ట్రాన్ని నేరాంధ్రగా మార్చిన జగన్ రెడ్డి నేడు రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడటం విడ్డూరమని మంత్రి విమర్శించారు. రేపల్లెలో అమర్నాధ్ గౌడ్, మాచర్లలో తోట చంద్రయ్య, మదనపల్లిలో ఫాతిమా.. ఇలా వైసీపీ పాలనలో జరిగిన దారుణ హత్యలు చాలానే ఉన్నాయన్నారు. ఎన్డీయే కూటమి నెల రోజుల పాలనకే రాష్ట్రపతి పాలన కావాలంటే..మరి నాడు మీ అరాచక పాలనకు మిమ్మల్ని ఈ పాటికి దేశ బహిష్కరణ చేసి ఉండాలని దుయ్యబట్టారు. ఇకనైనా మీ వంకర బుద్ది మార్చుకోకపోతే కచ్చితంగా ప్రజలే మిమ్మల్ని దేశం నుంచి తరిమికొడతారనే విషయం జగన్‌రెడ్డి గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఢల్లీిలో ధర్నా చేసేముందు ఆంధ్రలోని గల్లీగల్లీలో జగన్ అరాచక పాలనకు ఆనవాళ్లుగా మిగిలిన బాధితుల కాళ్ళ మీద పడి క్షమాపణ కోరితే ప్రజలు హర్షిస్తారని మంత్రి అనగాని హితవు పలికారు.