- వీసీలుగా విద్యాశిఖరాల నియామకం
- ప్రతిభే ప్రాతిపదికన మంత్రి నారా లోకేష్ ఎంపిక
- యోగి వేమన వీసీని ఏరికోరి పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా నియమించుకున్న కేంద్రం
- దేశవ్యాప్తంగా లోకేష్ నిర్ణయాలపై చర్చ
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలు యావత్ దేశం దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల వివిధ యూనివర్శిటీలకు వీసీలుగా అత్యున్నత విద్యావంతులను, వివాద రహితులను ఎంపిక చేసిన తీరుపై అంతటా ప్రశంసలు వస్తున్నాయి. దేశానికే మోడల్‌గా ఏపీ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతానని మంత్రి లోకేష్ బాధ్యతలు స్వీకరించిన నాడే ప్రకటించారు. అదే సమయంలో జగన్ హయాంలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన యూనివర్సిటీలకు వీసీల నియామకం మంత్రి లోకేష్‌కి కత్తి మీద సాముగా మారింది. వైసీపీ హయాంలో వీసీలుగా వచ్చిన వారు రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా యూనివర్సిటీలను కలుషితం చేశారు. యూనివర్సిటీల్లో వైసీపీ వార్షికోత్సవాలు, జగన్ జన్మదిన వేడుకల నిర్వహణతో విద్యా వ్యవస్థకే కళంకం తీసుకొచ్చారు.
జగన్ నాశనం చేసిన విద్యావ్యవస్థను, యూనివర్సిటీలను ప్రక్షాళన చేసే దిశగా మంత్రి లోకేష్ చర్యలు ఆరంభించారు. ఖాళీ అయిన వైస్ ఛాన్సలర్ల భర్తీకి పారదర్శకంగా నోటిఫికేషన్ ఇచ్చారు. 500కు పైగా దరఖాస్తులు వచ్చాయి. నిబంధనల మేరకు ప్రతిభ ప్రాతిపదికగా, రాజకీయ సిఫార్సులకు దూరంగా అత్యున్నత విద్యావేత్తలను వీసీలను ఎంపిక చేశారు. వివిధ యూనివర్సిటీలకు వీసీలుగా నియమితులైన వారు అర్హతల్లోనూ, అనుభవంలోనూ ఆణిముత్యాలుగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నన్నయ యూనివర్సిటీ వీసీ ప్రసన్నశ్రీ గురించి బీబీసీలో డాక్యుమెంటరీ ప్రసారం కావటంతో దేశవ్యాప్తంగా మంత్రి లోకేష్ నిర్ణయాలపై చర్చ మొదలైంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తమ పరిధిలోని సెంట్రల్ యూనివర్సిటీలకు వీసీల నియామకం కోసం ఏపీ వైపు దృష్టి సారించింది.
ఈ క్రమంలోనే కడప యోగి వేమన విశ్వవిద్యాలయం వీసీ ప్రకాశ్‌బాబుని పుదుచ్చేరి సెంట్రల్ వర్సిటీ వీసీగా కేంద్రం నియమించింది.
గత ఫిబ్రవరి 24న యోగి వేమన వర్సిటీ వీసీగా బాధ్యతలు చేపట్టిన ప్రకాశ్‌బాబుకి సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవి దక్కడం మంచి ప్రమోషన్‌గా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. వీసీల ఎంపికలో ప్రతిభే కొలమానంగా మంత్రి లోకేష్ అనుసరించిన విధానానికి కేంద్రం నుంచి దక్కిన ప్రశంసగా కూడా భావిస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారదర్శకంగా ఎంపిక చేసిన వీసీలు.. దేశవ్యాప్తంగా రాష్ట్ర కీర్తిని చాటి చెబుతున్నారు.