- బిజినెస్ రూల్స్ మార్చుకుంటే తప్పేంటి?
- ఫైళ్ల క్లియరెన్స్ మరింత వేగవంతం
- అనవసర ఫైళ్లు సృష్టించే విధానం పోవాలి
- 18 నెలల పాలనపై సమీక్షించుకుందాం
- భవిష్యత్‌పై లక్ష్యాలు నిర్దేశించుకుందాం..
- మంత్రులు, హెచ్‌ఓడీలు, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): మంత్రులు, హెచ్‌వోడీలు, కార్యదర్శులతో బుధవారం సచివాలయంలో నిర్వహించిన సదస్సులో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశంలో రాజ్యాంగాన్నే అనేకసార్లు సవరించుకున్నాం. ప్రజలకు మంచి చేయడానికి బిజినెస్ రూల్స్ మార్చుకుంటే తప్పేంటి?’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడమే కాదని… అనవసర ఫైళ్లు సృష్టించే విధానం మారాలని స్పష్టం చేశారు. దీనికోసం అవసరమైతే బిజినెస్ రూల్స్‌ను మార్చాలని సీఎం అన్నారు. పాలనను సులభతరం చేయడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని… దీని కోసం అధికారులు అనవసరంగా ఉన్న నిబంధనలను తొలగించాలన్నారు. శాఖల్లో పూర్తిస్థాయి మార్పులు తీసుకురావాలని.. టెక్నాలజీ, డేటాలేక్ ద్వారా మరింత సమర్థంగా పాలన అందించాలన్నారు. ప్రతి శాఖలో ఆడిటింగ్ జరగాలని స్పష్టం చేశారు. ప్రతి అధికారి, ప్రతిశాఖ పనితీరు ఏవిధంగా ఉందో ప్రభుత్వం వద్ద పూర్తిస్థాయిలో సమాచారం అందుబాటులో ఉందని… దీన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ… విజన్‌తో ప్రతి అధికారి పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.













