- అరాచక పాలన ముగిసింది
- వైసీపీ నేతల కలలో కూడా చంద్రబాబే
- చంద్రబాబు ఎక్కడికి వెళితే జోగికెందుకు?
- అందరి లెక్కలూ తేలుస్తాం
అమరావతి(చైతన్యరథం): ఐదేళ్లుగా పదేపదే విద్యుత్‌ఛార్జీల పెంచి ప్రజలపై పెనుభారం మోసిన జగన్‌రెడ్డి అధికారం నుండి దిగిపోయే సమయంలో కూడా మరోసారి కరెంట్ బిల్లులు పెంచి జనం నడ్డి విరిచాడని, వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టాడని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల సొమ్ములతో హెలికాఫ్టర్లు, ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజలను అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్ రెడ్డి అరాచక పాలనకు జనం ముగింపు పలికారన్నారు. ఓటమి ఖాయమని తేలటంతో వైసీపీ నాయకులకు చేసిన తప్పులన్నీ కళ్ల ముందు మెదులుతూ భయంతో వణుకుతున్నారు. భవిష్యత్ ఏంటో తెలియక మాజీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి గుళ్ల చుట్టూ తిరుగుతున్నాడని రాకేష్ ఎద్దేవా చేశారు.
విదేశాల నుండి తిరిగి వచ్చిన జగన్ మొట్టికాయలు వేయడంతో మంత్రి జోగి రమేష్ ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబు బాబు పర్యటన వివరాలు బయట పెట్టాలని, లోకేష్ ఎక్కడికి వెళ్లాడో చెప్పాలని అడుగుతున్నాడు. వాళ్లు ఎక్కడికి వెళ్లారో అడగటానికి జోగి రమేష్ ఎవరు? ఆయనకేంటి సంబంధం. మీ నాయకుడు ఎక్కడానికి వెళ్లినా కోర్టుకు సమాధానం చెప్పుకోవాలి. మా నాయకుడు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరంలేదు. మీ నాయకుడు గతంలో దావోస్ వెళతానని చెప్పి ఎక్కడికి వెళ్లాడో మీరే సమాధానం చెప్పాలి. లండన్ వెళుతున్న జగన్ రెడ్డి విమానం గాల్లోనే గిరగిర తిరిగి ఆమ్‌స్టర్‌డామ్ ఎయిర్‌పోర్ట్ లో ఎందుకు ఆగింది. చంద్రబాబు, లోకేష్ గురించి మాట్లాడే ముందు మీ నాయకుడు పాస్‌పోర్టులు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలని జోగి రమేష్‌ను రాకేష్ ఎద్దేవా చేశారు.
వైసీపీ నేతల కలలో కూడా చంద్రబాబే..
ఓటమి భయంతో జనాలకు పక్కదారి పట్టించడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నేతలకు నిద్ర కూడా పట్టకుండా కలలో కూడా చంద్రబాబే వస్తున్నారు. లోకేష్ రెడ్‌బుక్ లో వీళ్ల పేర్లన్నీ ఉన్నాయి. ప్రజల సొమ్ములతో జగన్‌రెడ్డి ఐదేళ్లుగా పబ్బం గడిపాడు. వేల కోట్లు అప్పులు చేశాడు. పక్కనే పది కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాఫ్టర్ వాడి ప్రజలు సొమ్ములు దుర్వినియోగం చేశాడు. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాడు. ఒక వేలు చంద్రబాబువైపు చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్లు మీవైపే చూపిస్తాయి. వైసీపీ నేతలు ఇది తెలుసుకోవాలి. జగన్ లాగా 36 కేసులు మా నాయకుడిపై లేవు.. మీ లాగా కోర్టుల అనుమతి తీసుకుని విదేశాలకు వెళ్లాల్సిన అవసరం మా నాయకుడికి లేదు. మీకు లాగా ఒక దేశానికి వెళ్తామని మరోదేశానికి దొంగదారిన వెళ్లి పబ్బం గడుపుకోవాల్సిన అవసరం మా నాయకుడికి లేదు. నాలుగురోజులు ఆగితే అందరి లెక్కలు తేలుతాయి.
సత్రాల ఆస్తులు అమ్ముకున్న దౌర్భాగ్యుడు జోగి. వైసీపీ నాయకులు జగన్ రెడ్డి ఉచ్చులో పడితే మూల్యం చెల్లించుకుంటారు. జనం ఓట్లతో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలవబోతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చట్టాలను అతిక్రమించిన వారికి, వ్యవస్థలను నాశనం చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతాం. వ్యాపారస్తుల ఇబ్బందులన్నింటినీ చంద్రబాబు సరిచేస్తారని రాకేష్ భరోసా ఇచ్చారు.