- అందరం కలిసి ఏపీ, విశాఖ, తెలుగువారు గర్వపడేలా కృషిచేద్దాం
- చంద్రబాబునాయుడు నేతృత్వంలో పనిచేయడం మా అదృష్టం
- ఏపీ ఎకనామిక్ పవర్ హౌస్‌గా విశాఖను తీర్చిదిద్దుతాం
- విశాఖ నగరాలతో కాదు.. ప్రపంచంతో పోటీ పడుతోంది
- కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్‌కు శంకుస్థాపనలో మంత్రి లోకేష్
విశాఖపట్నం (చైతన్య రథం): అందరం కలిసి ఏపీ, విశాఖ, తెలుగువారు గర్వపడేలా కృషిచేద్దామని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంకు అంతర్జాతీయ ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ రాక చారిత్రక మైలు రాయిగా అభివర్ణించారు. చంద్రబాబునాయుడు నేతృత్వంలో పనిచేయడం మా అదృష్టం. ఏపీ ఎకనామిక్ పవర్ హౌస్‌గా విశాఖను తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. విశాఖ మధురవాడలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ‘‘ఏపీ నాయకత్వంపై విశ్వాసం ఉంచినందుకు కాగ్నిజెంట్ సంస్థ రవి, సూర్యకు ధన్యవాదాలు. అంతర్జాతీయస్థాయి దిగ్గజ ఐటీ కంపెనీ విశాఖలో అడుగుపెట్టటం చారిత్రాత్మక మైలు రాయి. ఇవాళ విశాఖపట్టణానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి చరిత్రాత్మక రోజు. కాగ్నిజెంట్ ద్వారా 8వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రవి అయితే.. 20 వేల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్‌ను కూడా ఈ రోజే ప్రారంభించడం జరిగింది. ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు. కాగ్నిజెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యానికి ఇది ప్రారంభం. వైజాగ్ అభివృద్ధి చెందడం మాత్రమే కాకుండా ముందుండి నడిపిస్తుంది.
కాగ్నిజెంట్ రాక టెక్ యుగానికి నాంది
‘‘కాగ్నిజెంట్ సంస్థ సుమారు 15 వందల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇప్పటికే తాత్కాలిక క్యాంపస్ లో వెయ్యి మంది పనిచేస్తున్నారు. ఈ కేంద్రం కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారించనుంది. ఈ పెట్టుబడి హైక్వాలిటీ జాబ్స్‌ను తీసుకురావడమే కాకుండా విశాఖ డిజిటల్ ఎకోసిస్టమ్‌ను బలపరుస్తూ.. ఒక కొత్త టెక్ యుగానికి నాంది పలుకుతుంది. ఇది కేవలం భూమిపై పెట్టుబడి కాదు. అవకాశాల్లో పెట్టుబడి. ఈ క్యాంపస్‌లోని ప్రతి సీటు ఒక ఉద్యోగం, ఒక కల, మన యువత భవిష్యత్ తయారవుతున్న ఒక అవకాశం’’ అని పేర్కొన్నారు.
ఏపీ, తెలుగువారు గర్వపడేలా చేస్తాం
‘‘ఈ ఒప్పందం వెనుక ఓ కథ ఉంది. దావోస్‌లో జనవరి 23 నా బర్త్ డేకి ఈ జర్నీ మొదలైంది. నేను రవిని కలిసినప్పుడు అనేక ప్రశ్నలు అడిగారు. అన్నింటికి సమాధానం చెప్పాను. ముఖ్యమంత్రి అనుమతి తీసుకుని ఎకరా భూమిని 99 పైసలకే కేటాయిస్తామని చెప్పాను. రవి ఆశ్చర్యపోయారు. ఇది సాధ్యమేనా? అని అడిగారు. 99 పైసలకే భూమి ఇస్తే పరిశ్రమలు వస్తాయా? అని సీఎం అడిగారు. అవకాశమిస్తే విశాఖలో చరిత్ర సృష్టిస్తామని చెప్పాను. ఈ రోజు కాగ్నిజెంట్ విశాఖకు వచ్చింది. సీఎం చంద్రబాబుకు 11 నెలలు అంటే సుదీర్ఘ కాలం. ఆయనకు రియల్ టైమ్‌లో నిర్ణయాలు జరగాలని ఆశిస్తారు. ఆయన కేబినెట్‌లో మంత్రులందరం స్వేచ్ఛగా రాష్ట్ర అభివృద్ధికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందరూ 1995నాటి యుగం గురించి చెబుతున్నారు. 2024 యుగం కూడా ప్రారంభమైంది. ఏపీని, తెలుగువారిని గర్వపడేలా చేస్తాం. చాలా రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతోంది. ఏపీలో నిర్ణయాలు ఫైల్స్‌లోనే ఆగిపోవు. అవి ఇలాంటి ఫౌండేషనల్‌గా మారతాయి. మేము రెడ్ టేప్‌ను రెడ్ కార్పెట్‌తో మార్చేశాం. దానికి కాగ్నిజెంట్ ఉదాహరణ’’ అన్నారు.
చంద్రబాబునాయుడు నేతృత్వంలో పనిచేయడం మా అదృష్టం
ఏపీలో 25మంది మంత్రుల్లో 17మంది కొత్తవారున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల్లో మొదటిసారి గెలిచిన వారున్నారు. చంద్రబాబునాయుడు నేతృత్వంలో పనిచేయడం మా అదృష్టం. నాయకత్వం అంటే కేవలం ప్రకటన కాదు. సాధించిన ఫలితాల గురించి, దానికి ఈ రోజు ప్రత్యక్ష సాక్ష్యం. ముఖ్యమంత్రి పెద్దపెద్ద కలలు కంటారు. ఏపీ దానికి ఇంకా పెద్దగా సాధిస్తుంది. అది మాకు చాలా గర్వకారణం. కాగ్నిజెంట్ విశాఖను ఎంచుకోవడం నమ్మకానికి నిదర్శనం’’ అని లోకేష్ ఉద్ఘాటించారు.
ఏపీ ఎకనామిక్ పవర్ హౌస్‌గా విశాఖను తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం
ఏపీ ఎకనామిక్ పవర్ హౌస్‌గా విశాఖను తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. ఏపీ ఐటీ, జీసీసీ హబ్‌గా విశాఖ మారుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కేంద్రంగా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ రూపుదిద్దుకుంటుంది. విశాఖ దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడటం లేదు. విశాఖ ప్రపంచంతో పోటీ పడుతోంది. వై నాట్ వైజాగ్ అనే ప్రశ్న ఉదయించేలా ఐటీ కంపెనీలు, పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి ఆహ్వానిస్తున్నాం. ఆర్సెలార్ మిట్టల్‌లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ ప్రాంతానికి వస్తోంది. గతంలో హైదరాబాద్‌లో ఊరు చివరగా జూబ్లిహిల్స్ చెక్ పోస్టు ఉండేది. ఇప్పుడు అక్కడ చెక్ పోస్టు కాదు అంతర్జాతీయస్థాయి మౌలిక సదుపాయాలకు ప్రతీకగా మెట్రో స్టేషన్ ఉంది. 30 ఏళ్ల క్రితం చేసిన విజన్‌కు నిదర్శనంగా హైదరాబాద్‌లోని అభివృద్ధి నిలుస్తోంది. విశాఖను కూడా అదేవిధంగా అభివృద్ధి చేస్తాం’’ అన్నారు.
కాగ్నిజెంట్‌లో పనిచేసే ఉద్యోగులంతా విశాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి
‘‘మా ముఖ్యమంత్రి ఓ జీపీఎస్. నిరంతరం అందరినీ అభివృద్ధివెంట పరుగులు పెట్టిస్తారు. రాష్ట్రంలో పెట్టిన ప్రతీ ప్రాజెక్టునూ ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి చేయూత అందిస్తామని చెప్పాం. ఇప్పుడు కాగ్నిజెంట్‌కు కూడా అదేస్థాయి ప్రోత్సాహం అందిస్తాం. కాగ్నిజెంట్‌లో పనిచేసే ఉద్యోగులంతా విశాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి. యువత నైతిక విలువలు అలవర్చుకోవాలి. 5 లక్షల ఐటీ ఉద్యోగాలు ఈ ప్రాంతానికి వచ్చేలా మా ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌ను అభివృద్ధి బాటలో నడుపుతుంటే ఏపీని సీఎం చంద్రబాబు నాయుడు పురోగతి బాట పట్టిస్తున్నారు. వారిరువురూ 25 ఏళ్ల వయస్సున్న యువకుల్లా దేశ, రాష్ట్రాభివృద్ధికి పనిచేస్తున్నారు. వీరినుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ఏపీ, విశాఖ, తెలుగువారు గర్వపడేలా కృషి చేద్దాం’’ అని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.














