అమరావతి (చైతన్యరథం): ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి, గిరిజన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ స్పష్టం చేశారు. పాడేరు నియోజకవర్గం నందిగరువు గ్రామంలో శనివారం నిర్వహించిన ‘గిరిజనులతో మాటామంతి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, మోత’లతో ఇబ్బందులు పడుతున్న మారుమూల గ్రామం నుంచి మార్పు మొదలు కావాలని, అందుకే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ‘సమస్యలు ఏవైనా రాత్రికి రాత్రే పరిష్కారం కావు. కానీ పరిష్కరించాలనే సంకల్పం మాకుంది. గత ప్రభుత్వంలో ఈ నిధులు ఏమయ్యాయో మీరు వైసీపీ నాయకులను నిలదీయాలి.
మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే 460 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాం. పార్టీలతో సంబంధం లేకుండా నిధులు కేటాయిస్తున్నాం. నాయకులకు ఈ ప్రాంతాలకు రావాలంటేనే భయం. కానీ, నేను ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని కాబట్టి ఎవరికీ భయపడను. మీ సమస్యలు తెలుసుకోవడానికి ముందుకు వచ్చాన ని’ తెలిపారు. నందిగరువు గ్రామస్తుల విన్నపం మేరకు కొత్త పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, 1.6 కిలోమీటర్ల మేర నూతన రోడ్డు నిర్మాణంతో పాటు గ్రామంలో మ్యాజిక్ డ్రైన్లు మంజూరు చేశారు. అలాగే సుమారు 3 వేల గ్రామాలకు తాగు నీరు అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు వెల్లడించా రు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధికి కీలకమైన జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు.















