- ఛాంపియన్స్‌కు దిశా నిర్దేశం చేసిన ఎంపీ కేశినేని
- కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎన్‌ఐఆర్‌డిలో 33మందికి శిక్షణ
- పల్లెల అభివృద్ధికి సిద్ధమైన పంచాయతీ ఛాంపియన్స్
విజయవాడ (చైతన్య రథం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో ప్రతి ఇంటికి చేరాలని ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశయం వికసిత్ భారత్ సాధించాలంటే గ్రామాభివృద్ధితోనే సాధ్యమని, అలాగే సీఎం చంద్రబాబు లక్ష్యమైన ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలంటే పంచాయతీ ఛాంపియన్స్ అలుపెరుగని కృషి చేయాలని శివనాథ్ (చిన్ని) దిశానిర్దేశం చేశారు. వికసిత్ పంచాయిత్‌లో భాగంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఎన్‌ఐఆర్‌డి సహకారంతో సొంత నిధులతో కేశినేని ఫౌండేషన్ ద్వారా సమగ్ర గ్రామాభివృద్ధి సాధనకు తీర్చిదిద్దిన 33మంది పంచాయతీ ఛాంపియన్స్‌తో హైదరాబాద్ ఎన్‌ఐఆర్డీపీఆర్‌లో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న పంచాయతీ ఛాంపియన్స్‌కు ఎంపీ కేశినేని, ఎన్‌ఐఆర్డీపీఆర్ డైరెక్టర్ జనరల్ జి నరేంద్రకుమార్ సర్టిఫికేట్లు అందించారు.
సమావేశంలో గ్రామాభివృద్ధికి ఎలాంటి ప్రాతిపదిక అనుసరించాలో శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాన్ని పంచాయతీ ఛాంపియన్స్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఇంటికో పారిశ్రామికవేత్తని తయారు చేయటమే ఏపీ సీఎం లక్ష్యమని, అర్హులందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. యువతకు ఉపాధిమార్గం కల్పించే కేంద్ర పథకాలపై గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు అవగాహన పెంచాలన్నారు. వారందర్నీ చిన్నచిన్న పెట్టుబడులతో ఎక్కువ లాభాలు ఆర్జించే కుటీర పరిశ్రమలు ఏర్పాటుకు ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత పంచాయితీ ఛాంపియన్స్‌పై ఉందన్నారు.
ప్రతి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయటానికి విద్య, ఉపాధి కల్పన, మహిళా సాధికారత, గ్రామీణ విద్య, ఆరోగ్యంపై దృష్టి, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపొందించడం, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నిర్వహణ, స్వచ్ఛ గ్రామ, హరిత గ్రామ అభివృద్ధి, డిజిటల్ సేవల ద్వారా పంచాయతీ పరిపాలన, ఫ్రెండ్లీ విమెన్, గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ కల్పనకు పెద్దపీట వేస్తూ అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధును సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సి ఉంటుందని దిశానిర్దేశం చేశారు.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని 295 గ్రామాల్లో సాధించే అభివృద్ధి దేశానికి రోల్ మోడల్‌గా నిలవాలన్నారు. పలు ఎన్జీవోలతో కలిసి నాలుగు నియోజకవర్గాల్లో శానిటరీ నాప్కిన్స్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి తక్కువ ధరకే పంపిణీ చేసేందుకు ఏర్పాటు జరుగుతున్నట్టు తెలిపారు. సీఎం చంద్రబాబు నిర్దేశించిన జీడీపీ లక్ష్యం 15శాతం వృద్ధి సాధించటానికి కృషి చేయాలన్నారు. శిక్షణ ద్వారా పెంచుకున్న అవగాహనతో గ్రామాలకు కావలసిన సౌకర్యాలు, వనరులపై నివేదికలు తయారు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉన్నతాధికార్లు, శిక్షకులు, పలువురు కో`ఆర్డినేటర్లు పాల్గొన్నారు.