- ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం కేంద్రమే చేపట్టాలి
- కేంద్రమంత్రి గడ్కరీని కోరిన సీఎం చంద్రబాబు
ఢిల్లీ (చైతన్య రథం): రాజధాని అమరాతిని దేశంలోని వేర్వేరు నగరాలతో అనుసంధానించేలా జాతీయ రహదారుల నెట్వర్క్‌ను అనుసంధానించాలని ఏపీ సీఎం చంద్రబాబు.. కేంద్రమంత్రి గడ్కరీని కోరారు. ఢల్లీి పర్యటనలో భాగంగా నితిన్ గడ్కరీతో సీఎం సమావేశమయ్యారు. జాతీయ రహదారి నెట్వర్క్‌ను బలోపేతం చేయడంలో నితిన్ గడ్కరీ కృషిని కొనియాడారు. వివిధ ప్రాంతాల కనెక్టివిటీతోపాటు ఆర్ధిక ప్రగతికి సూచికగా జాతీయ రహదారులు నిలిచాయని పేర్కొన్నారు. గ్రీన్ ఫీల్డ్ నగరంగా అభివృద్ధి చెందుతున్న అమరావతికి జాతీయ రహదారులతో ప్రత్యక్ష, పరోక్ష నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కోరారు. కృష్ణానదిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 6 లేన్ల ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. 6 లేన్ల ఐకానిక్ కేబుల్ స్టెడ్ వంతెన మూలపాడు వద్ద 3 కీలకమైన జాతీయ రహదారులతో అమరావతిని అనుసంధానిస్తుందని తెలిపారు. విజయవాడ-హైదరాబాద్, చెన్నై- కోల్‌కతా సహా తీరప్రాంత రోడ్ కారిడార్‌తో అమరావతిని ఈ వంతెన అనుసంధానిస్తుందన్నారు. హైదరాబాద్ నుంచి అమరావతి వరకూ ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ హైవే హై స్పీడ్ యాక్సెస్ కలిగిస్తుందన్న ముఖ్యమంత్రి.. నగరాల మధ్య కనెక్టివిటీతోపాటు ప్రజలకు ప్రయాణ సమయాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని స్పష్టం చేశారు. అమరావతిని జాతీయ రహదారి గ్రిడ్లో మొబిలిటీ కేంద్రంగా, లాజిస్టిక్స్ నోడ్‌గా మారుస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడిరచారు. ఒక ప్రధాన నదిపై నిర్మించే ఈ 6 లేన్ ఐకానిక్ బ్రిడ్జిని జాతీయ రహదారుల సంస్థ చేపట్టేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి కీలకమైన ప్రాజెక్టుగా 6 లేన్ల ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.












