అమరావతి (చైతన్య రథం): మన డబుల్ ఇంజన్ ప్రభుత్వం అందించిన ఊపుతో మూలపేట పోర్టు అభివృద్ధికి మరింత బలం చేకూరిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈమేరకు ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. “నౌపాడ సాల్ట్ ఫ్యాక్టరీ వద్దనున్న 385.24 ఎకరాల ఉప్పు భూమిని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డుకు బదిలీ చేయడానికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపడం సంతోషాన్నిచ్చింది. సమర్థవంతమైన కార్యకలాపాల కోసం అనుసంధానాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించి, ఈ భూ బదిలీ పోర్టు అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సాధికారత దిశగా తీసుకున్న ఈ కీలకమైన చర్యకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెబుతున్నాను. ఓడరేవులు శ్రేయస్సు, పురోగతికి చోదకశక్తులుగా ఉంటూ, విఖ్తీయ భారత్‌కు దోహదపడాలన్న ఆయన దార్శనికతకు అనుగుణంగా, ములపేట పోర్టు ఇప్పుడు ఒక కీలక కేంద్రంగా ఆవిర్భవించడానికి సిద్ధంగా ఉంది. నిరంతర మద్దతు అందిస్తున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ధన్యవాదాలు” అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.















