- మంత్రి లోకేష్ మంచి మనసుకు నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కృతజ్ఞతలు
- మీ ఆదరాభిమానాలు జీవితంలో మర్చిపోలేం
- అనారోగ్యానికి గురైన విద్యార్థిని ప్రాణం నిలబెట్టిన మంత్రి లోకేష్
- మంత్రి సాయానికి ఎక్స్ ద్వారా పలువురి ధన్యవాదాలు
అమరావతి (చైతన్యరథం): మెదడు సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ప్రాణం నిలబెట్టిన మంత్రి నారా లోకేష్‌కు సోషల్ మీడియా వేదికగా పలువురు ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన మురపాల అనూష నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ మొదటి ఏడాది చదువుతోంది. ఎంతో చురుకుగా ఉండే అనూషకు హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణం నిలబెట్టేందుకు మెరుగైన వైద్యం కోసం సాయం అందించాలని సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి..తన టీం ద్వారా అవసరమైన వైద్యసాయం అందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అనూషకు అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్‌కు ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థిని పద్మజ సహా పలువురు ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. గతంలో నూజివీడు ట్రిపుల్ ఐటీలో నాసిరకం భోజనంపై తక్షణమే స్పందించి, విద్యార్థులకు మంచి భోజనం అందేలా మంత్రి లోకేష్ చర్యలు తీసుకున్నారని..నేడు అదే విశ్వవిద్యాలయంలో చదువుతున్న అనూష ప్రాణాపాయ స్థితిలో ఉందనే విషయం తెలియగానే ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారని వ్యాఖ్యానించారు. మీరు చేసే ప్రతి పని మాలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతోందన్నారు. మాకు అన్నగా అండగా నిలుస్తున్నారని, కోరిన వెంటనే ప్రతిసారి సాయం చేస్తున్నారని, మీరు చేసిన సాయానికి జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు.