- స్పోర్ట్స్ పాలసీపై చంద్రబాబుకి వినూత్న కృతజ్ఞతలు
- 2కి.మీ మేర దారి పొడవునా క్రీడాహారం..
- ప్లకార్డులు, నినాదాలతో సీఎంపై ప్రశంసల జల్లు
- కార్యక్రమానికి సారథ్యం వహించిన శాప్ ఛైర్మన్ అనిమిని
అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగు వేలమంది క్రీడాకారులు ముక్తకంఠంతో ‘థాంక్స్’ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన క్రీడా పాలసీపై క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. క్రీడలను ప్రోత్సాహించేందుకు అత్యుత్తమ పాలసీని రూపొందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విద్యార్థులు, క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నారావారిపల్లె నుండి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో శ్రీనివాస మంగాపురంవద్ద దాదాపు 2 కి.మీ మేర దారికి ఇరువైపులా క్రీడాకారులు బారులు తీరారు. ‘థాంక్స్’ ప్లకార్డులను ప్రదర్శిస్తూ క్రీడాకారులంతా ముక్తకంఠంతో ‘థాంక్యూ సీఎం’ అని చెప్పడంతో.. క్రీడాకారులను చూసి ముఖ్యమంత్రి మురిసిపోయారు. కార్యక్రమంలో శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పాల్గొన్నారు. క్రీడారంగానికి ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలే క్రీడా పాలసీని ప్రకటించారు.
ఐదేళ్ల జగన్ హయాంలో కునారిల్లిపోయిన క్రీడావ్యవస్థను తట్టిలేపి.. జాతీయ అంతర్జాతీయ వేదికలవైపు క్రీడాకారులను పరుగులు తీయించేందుకు అనువైన పాలసీని ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. దేశంలో అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీగా ఏపీ నూతన క్రీడా పాలసీ రూపుదిద్దుకుంది. రాష్ట్రాన్ని క్రీడాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు పాలసీలో నాలుగు లక్ష్యాలపై ప్రధానంగా దృష్టిపెట్టారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2నుంచి 3శాతానికి పెంచుతూ నిర్ణయించారు. ఒలంపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ప్రోత్సాహకాలను భారీగా పెంచారు. ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తే ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచడం ఏపీ ప్రభుత్వం ప్రకటించిన క్రీడా పాలసీలో ప్రత్యేకతలు. శాప్ చైర్మన్‌గా యువకుడైన అనిమిని రవినాయుడికి బాధ్యతలు అప్పగించడంతో.. రాష్ట్ర క్రీడా విభాగానికి పూర్వవైభవం తెచ్చేందుకు అనిమిని అహర్శశలూ కృషి చేస్తున్నారు.
అమరావతికి సీఎం చంద్రబాబు
సోదరుడు, మాజీ ఎంఎల్‌ఏ రామ్మూర్తినాయుడు కర్మ క్రియల ప్రక్రియ పూర్తవ్వడంతో.. తిరుపతి జిల్లా పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజధానికి పయనమయ్యారు. శుక్రవారం ఉదయం 11.05 గం.లకు రేణిగుంట విమానాశ్రయం నుండి బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్థానిక నాయకుల నుంచి సాదర వీడ్కోలు లభించింది. డిఐజి షిమోషి బాజ్‌పేయ్, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి మునిసిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, జెసి శుభం బన్సల్, ఎంఎల్‌ఏలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్‌రెడ్డి, కోనేటి ఆదిమూలం, భానుప్రకాష్, నెలవల విజయశ్రీ, పూతలపట్టు మురళి, ఎంఎల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్, మాజీ ఎంఎల్‌ఏ సుగుణమ్మ, శ్రీధరవర్మ తదితరులు ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు పలికారు.