- మాజీఎంపీ రెడ్డప్పరెడ్డి ఇంటికి వచ్చిన మిథున్‌రెడ్డి
- గో బ్యాక్ అంటూ ఇంటిని ముట్టడిరచిన స్థానికులు, ఎన్డీఏ కార్యకర్తలు
- కవ్వింపు చర్యలతో రాళ్లదాడికి దిగిన వైసీపీ కార్యకర్తలు
- తొమ్మిదిమంది ఎన్డీఏ కార్యకర్తలకు గాయాలు
- పరిస్థితి అదుపు చేసిన పోలీసులు
పుంగనూరు: గత ఐదేళ్ల పాపాలు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డిని వెంటాడుతున్నాయి. వైసీపీ పాలనలో మితిమీరిన నియంతృత్వ ధోరణితో ప్రత్యర్ధులపై దాడులు, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టించి భయానక వాతావరణం సృష్టించారు. ఇప్పుడు ఎన్నికల్లో పరిస్థితి తారుమారు కావడంతో అక్కడి ప్రజలు తండ్రి, కొడుకులపై తిరగబడుతున్నారు. ఆ మధ్య పెద్దిరెడ్డి పుంగనూరు పర్యటనను వ్యతిరేకించిన స్థానికులు ఇప్పుడు అయన కొడుకు మిథున్ రెడ్డి పుంగనూరులో అడుగు పెట్టటంపై ఆగ్రహంతో రగిలిపోయారు. దీంతో గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్‌రెడ్డి వచ్చినట్లు తెలుసుకున్న స్థానికులు, ఎన్డీఏ కార్యకర్తలు ఆగ్రహంతో ఆ ఇంటిని చుట్టుముట్టారు. వెంటనే మిథున్ రెడ్డి పుంగనూరు నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు.
ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. పోలీసులపైనా కుర్చీలు విసిరారు. ఈ రాళ్లదాడిలో తొమ్మిదిమంది కూటమి కార్యకర్తలు గాయపడ్డారు. ఇద్దరు మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టటంతో కూటమి కార్యకర్తలు ప్రతిఘటించారు. తిరిగి వైసీపీ కార్యకర్తలపై రాళ్లు విసిరారు. మిథున్‌రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టి ఇరువర్గాలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించారు. అనంతరం ఎంపీని పోలీసులు గృహనిర్బంధం చేశారు.
వైసీపీ శ్రేణుల రాళ్లదాడిలో గాయపడిన కూటమి కార్యకర్తలు, నాయకులకు స్థానిక ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని తిరుపతి సిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. వైసీపీ నేతలు ఉద్దేశపూర్తకంగా తమను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. దాడిని టీడీపీపై నెట్టే ప్రయత్నం చేయడం ద్వారా శాంతిభద్రతల సమస్యల తలెత్తేలా వైసీపీ కుట్ర చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక పథకం ప్రకారం భవనం పైనుంచి వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడికి దిగారని చెబుతున్నారు.