అమరావతి (చైతన్యరథం): రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయ పునరుద్ధరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలపడం తద్వారా కళలకు కాణాచి, సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరానికి పునఃవైభవం వస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలోని రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతుల ఉన్నత స్థాయి పరిశోధన కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం పనిచేస్తుందని తెలిపారు. తెలుగు భాష, సాహిత్యం ఆధారంగా కళా సంస్కృతి, సంగీతం, రంగస్థల నాటకాలు, చిత్ర లేఖనం తదితర వాటిలో అధునాతన అధ్యయానికి, పరిశోధనలు సులభతరం చేయడానికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
అన్ని భాషలను గౌరవిస్తూనే మాతృభాషకు అగ్రతాంబూలం ఇవ్వాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భవిష్యత్‌లో జరిగే శాస్త్రీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి రంగంలోనూ ప్రాచీన తెలుగు పరిశోధనలకు అవకాశం కల్పిస్తామన్నారు. అంతేగాక తెలుగు భాషా సాహిత్యాలు, కళలు, సంస్కృతి, శాస్త్రాలు సంపూర్ణంగా, సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజల తరపున సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారాలోకేష్ లకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంస్కృతి, వారసత్వానికి వారధిగా నిలుస్తూ పవిత్ర గోదావరి చెంతన ఉన్న రాజమహేంద్రవరంలో తెలుగు వైభవంగా వెలుగొందుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాషా సంస్కృతులు, కళలు మరింతగా విరాజిల్లుతాయన్న ఆశాభావాన్ని మంత్రి దుర్గేష్ వ్యక్తం చేశారు.