- రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధితోనే ఆయనకు నిజమైన నివాళి
- శ్రీరాములు త్యాగాన్ని గుర్తుంచుకునేలా స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్
- అమరజీవి త్యాగంతో రాష్ట్రం… రైతుల త్యాగంతో రాజధాని
- వైశ్యులను వేర్వేరు పేర్లతో కాకుండా… ఆర్యవైశ్యులుగా పరిగణించేలా జీవో
- ఇబ్బందుల్లేకుండా వ్యాపారాలు చేసుకునేలా సహకరిస్తున్నాం
- శ్రీరాములు భారీ కాంస్య విగ్రహావిష్కరణ సభలో సీఎం చంద్రబాబు
- అమరావతిలో తొలి భారీ శిల్పంగా అమరజీవి విగ్రహం
- రికార్డుస్థాయిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్క్ మొదటి దశ పనులు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోగలిగినప్పుడే అమరజీవి పొట్టి శ్రీరాములుకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాములు స్పూర్తిని నిరంతరం గుర్తుపెట్టుకుని రాష్ట్రాభివృద్ధికి పని చేయాలని పిలుపునిచ్చారు. దీనికి అనుగుణంగానే అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం ఏర్పాటైందని.. అమరజీవి త్యాగానికి గుర్తుగా ఆయన విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ పేరు సముచితమని సీఎం అభిప్రాయపడ్డారు. సోమవారం అమరావతిలోని శాఖమూరు పార్కులో పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. అమరావతిలో తొలి భారీ శిల్పంగా పొట్టి శ్రీరాములు విగ్రహం నిలుస్తుంది. శాఖమూరు పార్కులోని 6.80 ఎకరాల్లో అమరజీవి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 6 నెలల రికార్డు కాలంలోనే ప్రాజెక్ట్ మొదటి దశ పనులను ట్రస్ట్ పూర్తి చేసింది. ఈ భారీ విగ్రహానికి 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ వినియోగించారు. రెండో దశలో మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “స్పూర్తికి మారు పేరు పొట్టి శ్రీరాములు. ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. అందరివాడు. 58 రోజుల నిరాహారదీక్షకు చిహ్నంగా 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు భారీ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ అని పేరు పెట్టారు.
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉంది.. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉంది… ఇప్పుడు ఏపీలో స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ ఉంది. పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్కును ఆరు నెలల్లో మొదటి దశ పనులు పూర్తి చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆయన్ను స్పూర్తిగా తీసుకోవాలి. తెలుగువారికి గుర్తింపు కూడా లేని రోజుల్లో తెలుగువారి సత్తా చాటిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. మహాత్మా గాంధీ అహింసా సిద్దాంతంలో స్వాతంత్య్రం తెచ్చారు… పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసి రాష్ట్రాన్ని సాధించి పెట్టారు. ప్రాణాలను లెక్క చేయకుండా తెలుగు వారికి రాష్ట్రం కోసం పోరాడారు. పొట్టి శ్రీరాములు త్యాగం తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కేంద్రం నాందీ పలికింది. ఐదు దశాబ్దాల్లో అనునిత్యం అనేక విషయాల్లో పొట్టి శ్రీరాములు పొరాడారు. భార్య పిల్లలు చనిపోయిన తర్వాత ఆ బాధను దింగమింగి దేశ కోసం పోరాడారు. దళితుల ఆలయ ప్రవేశం కోసం పోరాడారు.. 29 రోజుల నిరాహార దీక్ష చేశారు. కనీసం నీళ్లు కూడా తాగకుండా 58 రోజుల దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేశారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని తెలుగు జాతి గుర్తు పెట్టుకోవాలి”అని సీఎం చెప్పారు.
తెలుగు జాతికి నిత్యం సమస్యలే…
“తొలుత మదరాసు ఏలుబడిలో ఉన్న తెలుగు ప్రజలు.. పొట్టి శ్రీరాములు పోరాటంతో ఆంధ్ర రాజధాని కర్నూలుగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ గా ఏర్పాటు చేసుకుని తెలుగు జాతి మనుగడ సాగించింది. ఆ తర్వాత అమరావతి రాజధానిగా నవ్యాంధ్ర రాష్ట్రం ఏర్పడింది. పొట్టి శ్రీరాములు వంటి వారి త్యాగాలను నిరంతరం గుర్తు పెట్టుకోవాలి… రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి. అమరజీవి త్యాగ ఫలితంగా రాష్ట్రం వచ్చింది.. ఆయన స్పూర్తిని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. సమస్యలు వచ్చినా… ఇబ్బందులు వచ్చినా ప్రజలంతా సమిష్టిగా పని చేయాలి. తెలుగు జాతి గతంలోనూ… ఇప్పుడూ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. 2019-24 మధ్య కాలంలో రాజధాని మూడు ముక్కలాటగా మారింది. మూడు రాజధానులన్నారు… అసలు రాజధానే లేని పరిస్థితి తెచ్చారు. ఇప్పుడు ప్రజా రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందుతోంది. తెలుగు జాతి వివిధ సమయాల్లో విడిపోయి ఉంది.. వివిధ సందర్భాల్లో కలిసి ఉంది. అందరికీ న్యాయం చేయగలినప్పుడే పొట్టి శ్రీరాములుకు నిజమైన నివాళి. ఇది జరిగినప్పుడే పొట్టి శ్రీరాముల త్యాగానికి సార్థకత చేకూరుతుంది”అని సీఎం చంద్రబాబు చెప్పారు.
రాజధానిని మూడు ముక్కలాట చేశారు…
“తెలుగు జాతికి రెండు రాష్ట్రాలు ఉన్నాయి. రాజధానితో గత పాలకులు ఆటలాడారు… బాధేస్తోంది. అమరావతిని శ్మాసనం అన్నారు.. ఎడారి అన్నారు.. ఇక్కడ రాజధాని ఉండకూడదన్నారు. పొట్టి శ్రీరాముల త్యాగాన్ని ముందుగా ఎవ్వరూ గుర్తించని విధంగానే… ఇక్కడి రైతుల త్యాగాన్ని కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతుల త్యాగం ఓ స్పూర్తి.. చరిత్ర. 2019-24 మధ్య కాలంలో రాజధాని రైతుల పోరాటం ఓ చరిత్ర. రాజధాని నిర్మాణానికి డబ్బులు లేనప్పుడు ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రాజధాని ఏర్పాటు ప్రారంభించాం. ప్రజలను భాగస్వాములను చేసి రాజధాని నిర్మాణం మొదలు పెట్టాం. రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. 21 నెలల పాటు మంచి ఫలితాలు సాధించేలా పాలన చేస్తున్నాం. సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి… ఇలాంటి ప్రాజెక్టును విధ్వంసం చేశారు. పోలవరం నిర్మాణం వేగంగా సాగుతోంది… పుష్కరాలకంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాం. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండడమే కాదు… రాష్ట్రానికి రాజధాని కూడా ఉండాలి. నా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా రాజధానిని తీర్చిదిద్దుతాం. మూడేళ్లల్లో అమరావతి ఎలా అభివృద్ధి చేస్తామో మీరే చూస్తారు. రాజధాని అమరావతిపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర బిందువుగా రాజధాని అభివృద్ధి ఉంటుంది”అని ముఖ్యమంత్రి వివరించారు.
ఆర్యవైశ్యులకు అండగా కూటమి ప్రభుత్వం…
“ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం… ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. గడచిన ప్రభుత్వంలో ఆర్యవైశ్యులు వ్యాపారాలు చేసుకునేందుకు భయపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎలాంటి భయాందోళనలు లేకుండా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. సంపాదించిన సొత్తులో కొంత భాగం దాన ధర్మాలకు ఖర్చు చేసే ఏకైక వర్గం ఆర్యవైశ్యులు. పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా ఆర్యవైశ్యులు అదే సంకల్పంతో పూర్తి చేశారు. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేపడుతున్నాం. వాసవీ మాత పుట్టిన ప్రాంతం పెనుగొండను వాసవీ పెనుగొండగా మార్చాం. ఆర్యవైశ్యుల సెంటిమెంట్ గౌరవించాం. ఇంటింటికీ నీళ్లిచ్చే జల జీవన్ మిషన్ పథకానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘అమరజీవి జలధార’ అని పేరు పెట్టారు. నీరు తాగే ప్రతి ఒక్కరూ అమరజీవిని స్మరించుకునేలా పవన్ కళ్యాణ్ చొరవ చూపారు. వైశ్యులను వేర్వేరు పేర్లతో కాకుండా… అందర్నీ ఆర్యవైశ్యులు అని పరిగణించేలా జీవో తెస్తాం. అభివృద్ధి-సంక్షేమం సమతూకంతో సుపరిపాలన సాగిస్తాం. హెల్తీ-వెల్తీ-హ్యాపీ సొసైటీని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ప్రజలందరి జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. యుద్ద ప్రభావంతో రాష్ట్రంలో వివిధ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఇబ్బందులు వస్తున్నాయి.
యుద్ద ప్రభావం దేశం మీద పడకుండా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారు. యుద్దం ప్రభావం ఉందని కుంగిపోవాల్సిన అవసరం లేదు. కష్టకాలంలో సమిష్టిగా పని చేయాలి… అభివృద్ధి ఆగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రధాని మోదీ పని చేస్తున్నారు…దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్-1 చేసేలా మనం పని చేయాలి”అని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, సవిత సహా పలువురు ప్రజా ప్రతినిధులు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. అమరజీవి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం కాంస్య విగ్రహానికి నివాళులర్పించారు. విగ్రహావిష్కరణ సభలో అమరావతి అభివృద్ధి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్పూర్తితో చేప్టటబోయే కార్యక్రమాలపై ఏవీ ప్రదర్శించారు. తపాలా శాఖ రూపొందించిన పొట్టి శ్రీరాములు పోస్టల్ కవర్ ను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పపన్ కళ్యాణ్ వేదికపై సన్మానించారు.















