- ఎన్ని జన్మలెత్తినా తెలుగుజాతిలోనే పుట్టాలని కోరుకుంటా
- భవిష్యత్‌లో అమరావతి, హైదరాబాద్ సిటీలు మొదటి, రెండవ స్థానంలో ఉంటాయి
- తెలుగు వన్ అధినేత కంఠంనేని రవిశంకర్ పట్టుదల, కృషి అందరికీ ఆదర్శం
- 400 ఛానళ్లతో తిరుగులేని శక్తిగా తెలుగు వన్
- సోషల్ మీడియా వేదికగా ఆడబిడ్డల వ్యక్తిత్వ హననం..దీనిపై నియంత్రణ అవసరం.
- తెలుగు వన్ డిజిటల్ మీడియా రజతోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
హైదరాబాద్, మే 18 :- ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగుజాతి ఉంటుందని, నాలెడ్జ్ ఎకానమీ, ఆంతప్రెన్యూర్‌షిప్‌లో తెలుగుప్రజలు ముందుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఎన్ని జన్మలైనా తాను తెలుగుజాతిలోనే పుట్టి సేవ చేయాలని కోరుకుంటున్నానన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం కంఠంనేని రవిశంకర్‌కు చెందిన తెలుగు వన్ డిజిటల్ మీడియా రజతోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు.
రవిశంకర్ పట్టుదల ఆదర్శం
తెలుగు వన్ డిజిటల్ మీడియా ప్రయాణం 2000 సంవత్సరంలో ప్రారంభమై నేడు 400 ఛానల్స్‌తో ప్రతి దేశంలో ఉంది. రవిశంకర్ మంచి కృషి, పట్టుదలతో పనిచేస్తున్నారు. నేను విజన్ రూపొందిస్తే దానికి సమానంగా ఆయన కూడా ఛానల్ అభివృద్ధిలో విజన్ రూపొందించుకుని ముందుకెళ్తున్నారు. ఒకప్పుడు ఆకాశవాణి తప్ప ఏమీ ఉండేవి కాదు. తర్వాత వార్తా పత్రికలు వచ్చాయి. తర్వాత సమాజంలోకి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. 2003లో అలిపిరిలో నాపై మావోయిస్టులు దాడి చేశారు. అప్పుడు ఒక్క జెమినీ ఛానల్ మాత్రమే ఉంది..కానీ ఇప్పుడు అనేకం ఉన్నాయి. రవిశంకర్ లాంటి వ్యక్తులు అనేక ఛానల్స్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇంట్లోనే కూర్చుని ఛానల్ పెట్టుకుని ఆదాయాన్ని కూడా పొందే అవకాశం వచ్చింది. న్యూస్ పేపర్‌కు సర్య్కులేషన్, శాటిలైట్ ఛానల్‌కు టీఆర్పీ, య్యూటూబ్ ఛానల్‌కు వ్యూస్, సబ్‌స్క్రైబ్స్ ఉంటాయి. తెలుగు వన్ ఛానల్ ఇప్పటి వరకు 55 బిలియన్ వ్యూస్ సాధించింది. 120 మిలియన్ల సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. 16 లక్షల వీడియాలను, 15 వందలకు పైగా సినిమాలు ఉన్నాయి. తిరుగులేని శక్తిగా తెలుగువన్ తయారైంది. కంఠంనేని రవిశంకర్ అమరావతి రాజధానిపైనా సినిమా తీశారు. నాడు భయపెట్టే పరిస్థితులు ఉన్నా వెనక్కి తగ్గకుండా న్యాయం, ధర్మం కోసం అమరావతికి అన్యాయం జరిగిందని చెప్పి సినిమా తీశారు. సెన్సార్ పేరుతో విడుదల కానివ్వకుండా చేస్తే య్యూటూబ్‌లో వదిలారు. 2000 మంది పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేయించారు. ఆయన సేవా కార్యక్రమాల పట్ల అభినందనలు తెలుపుతున్నాను. తెలుగు వన్ స్ఫూర్తి పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలుపుతున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.
ఈనాడు చొరవతో 30 రోజుల్లోనే ఎన్టీఆర్ మళ్లీ సీఎం
కొన్నాళ్ల క్రితం నేను అరెస్టయిన సమయంలో హైదరాబాద్‌లో మీరు పోరాడిన విధానం నా జీవితంలో మర్చిపోలేను. మనం మంచిపని చేస్తే ప్రజలు మర్చిపోతారు అని అంటుంటారు.. కానీ మనం చేసిన మంచి పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేది నా అరెస్టు సమయంలో చూశాను. గతంలో నలభై ఏళ్ల కిందట ఆగస్టు సంక్షోభం వచ్చినప్పుడు ఎన్టీఆర్ పక్షాన మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నా సీఎం పదవి నుంచి దించేశారు. ఆ సమయంలో ఈనాడు దినపత్రిక చూపిన చొరవతో 30 రోజుల్లోనే తిరిగి ఎన్టీఆర్ మళ్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. పేదరికాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పీ4 ద్వారా అత్యున్నత స్థాయిలో ఉన్నవారు కింద స్థాయిలో ఉన్నవారిని దత్తత తీసుకుంటే మనతో సమానంగా పైకి వస్తారు. ఎన్టీఆర్ కూడా సాధారణ కుటుంబంలో పుట్టి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో పైకొచ్చారు. మళ్లీ ఎన్టీఆర్ లాంటి వ్యక్తులు రారు..ఆయనతో పోల్చుకోవాలంటే మళ్లీ ఆయనే జన్మించాలని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
అగ్రభాగాన తెలుగువారే ఉంటారు
1995-96లో తెలుగు ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ మాత్రమే ఉండేవి. మన తెలుగువారి భవిష్యత్ మారే పరిస్థితి రావాలంటే ఐటీ రంగాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఐటీని ప్రమోట్ చేయాలనే హైటెక్ సిటీ నిర్మించా. మన వారికి పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాం. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా ఇండియన్స్ ఉంటారు, అందులో అగ్రభాగాన తెలుగువారు ఉన్నారు. హైటెక్ సిటీ నిర్మిస్తుంటే అందరూ నవ్వారు..కానీ తర్వాత దాని ఫలాలు అందుతున్నాయి. ప్రస్తుత సమయంలో కష్టపడాల్సిన అవసరం లేదు…స్మార్ట్‌గా చేయాలి. నాలెడ్జ్ ఎకానమీలో హిస్టారికల్ సమాచారం ఉంది. ఏ రంగం తీసుకున్నా ఇప్పుడు ఏఐ వచ్చింది. రియల్ టైంలో డేటా సేకరించే అవకాశం వచ్చింది. నాడు హైటెక్ సిటీ, ఐటీ గురించి మాట్లాడాను…ఇప్పుడు ఏఐతో క్వాంటమ్ వ్యాలీ అని చెప్తున్నాను. 2047 నాటికి ప్రపంచలో ఇండియన్స్ ముందుంటే అందులో తెలుగువారు అగ్రభాగాన ఉండాలనేది నా ఆశయం..ఇది సాధ్యమవుతుంది. భారతీయులతో పొటీ పడేవారు ప్రపంచంలో ఎక్కడా లేరని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
అమరావతి నిర్మించే అదృష్టం దక్కింది
క్రియేటివ్ ఎకానమీలో రెండు సిటీలు రూపొందిస్తున్నారు..ఒకటి ముంబై, రెండోది అమరావతి. అమరావతి క్రియేటివ్ ఎకానమీకి చిరునామాగా ఉంటుంది. ప్రస్తుతం అత్యంత నివాసయోగ్యమైన సిటీగా హైదరాబాద్ అవతరించింది. ఉమ్మడి రాష్ట్రంలో నా హయాంలో 1995 నుంచి 2000 వరకు బ్లూ ప్రింట్ రెడీ చేసి ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్ పోర్టు, జీనోమ్ వ్యాలీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌ను అప్పట్లో అభివృద్ధి చేసే అవకాశం కల్పించారు. మీ అందరి ఆశీర్వాదాలతో ఇప్పుడు నాకు మరో అవకాశం దక్కింది. మరోనగరం అమరావతిని తెలుగుజాతికి అందించే అదృష్టం దక్కింది. భవిష్యత్తులో అమరావతి, హైదరాబాద్ మొదటి, రెండవ స్థానాల్లో ఉంటాయని సీఎం చంద్రబాబు అన్నారు.
వ్యక్తిత్వ హననంతో సమాజానికి హాని
ఏది చేయాలన్నా విశ్వసనీయత అవసంరం. ఎన్జీవోలు, మీడియాకు వివ్వసనీయత ఉండాలి. స్వాతంత్య్రోద్యమ సమయంలో పత్రికలు, జర్నలిస్టులు కీలకపాత్ర పోషించారు. కానీ ఇప్పుడు పోటీ ప్రపంచంలో విలువలు పడిపోతున్నాయి. సోషల్ మీడియాతో ఎంత లాభం ఉందో..అంతనష్టం ఉంది. సోషల్ మీడియాను వేదికగా తీసుకని వ్యక్తిత్వ హననం, తప్పుడు సమాచారానికి పాల్పడుతున్నారు. దీనిపై నియంత్రణ అవసరం. ఇళ్లలో ఉండే ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని హననం చేస్తే సమాజానికి హాని కలుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిష్పక్షపాత మీడియాను ప్రోత్సహించే అంశంపై ఆలోచిస్తాయి. దుర్మార్గపు ఆలోచన చేసే వారిని నియంత్రించాల్సి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.