- నాలుగు దశాబ్దాల పార్టీకి మూలస్తంభాలు కార్యకర్తలే
- వారి సేవలను పార్టీ ఎప్పటికీ విస్మరించదు
- రాష్ట్రానికే ఆదర్శంగా టెక్కలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం
- నియోజకవర్గ మినీ మహానాడులో మంత్రి అచ్చెన్నాయుడు
టెక్కలి (చైతన్యరథం): కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, నాలుగు దశాబ్దాలుగా గ్రామ స్థాయిలో పార్టీ ఇంత పటిష్టంగా ఉందంటే అది కేవలం కార్యకర్తల వల్లనే సాధ్యమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం ఎన్టీఆర్ భవన్‌లో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నిరుపేదల జీవితాల్లో సంక్షేమం వెలుగులు నింపాలనే లక్ష్యంతో దివంగత నేత మాజీ ముఖ్య మంత్రి నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారన్నారు. 43 సంసవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరంలోకి టీడీపీ ప్రవేశించిందన్నారు.
ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా వాటన్నింటినీ అధిగమించి రాష్ట్ర ప్రయోజనాల కోసం మన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు నింతరం శ్రమిస్తున్నారన్నారు. ఆయన సమర్థ పానలతో రాష్ట్రాన్ని ప్రగతి పధంలో నడిపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా సభ్యత్వ నమోదు జరగడం ఆనందంగా ఉందన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారని, దానిని వినియోగించుకోవాలని సూచించారు. సమగ్ర సమాచారం అందులో ఉంటుందని తెలిపారు. కార్యకర్తల శ్రమ పార్టీ గుర్తిస్తుందని అన్నారు. గత పాలకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటన్నింటినీ అధిగమించి నేడు పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కార్యకర్తల త్యాగఫలమేనన్నారు.
వైసీపీ హయాంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగింది
వైసీపీ హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో అరాచక పాలన సాగిందని తీవ్రస్థాయిలో మండి పడ్డారు. టీడీపీ కార్యకర్తలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు చూశామని అన్నారు. నెత్తిమీద రూపాయి పెడితే పది పైసలకు పనికిరాని ఛోటా నాయకులు సైతం రెచ్చిపోయారని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని, సుమారు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. మధ్యపాన నిషేదం అని చెప్పి రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇటు ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు స్వేచ్చ లభించిందన్నారు. తాను ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని నమ్మే వ్యక్తినన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని, అందుకే నేడు మద్యం కేసులో ఒక్కోక్కరూ లోనికి వెలుతున్నారని విషయాన్ని గుర్తు చేశారు. తాము కక్ష రాజకీయాలు ప్రారంభిస్తే వైసీపీ నాయకులు ఒక్కరూ కూడా మిగలరన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం 3.5 లక్షల పింఛన్లు తొలగించిందన్నారు. టీడీపీ సానుభూతిపౌరులనే కారణంగానే తొలగించారన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి వాటిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. అదేవిధంగా సుమారు లక్షకు పైగా వితంతు పింఛన్లు ఆపేశారని వాటిని కూడా పునరుద్ధరించామని, జూన్ 12 న వారందరికీ పింఛన్లు అందింస్తామన్నారు.
గ్రామ పంచాయితీలను నిర్వీర్యం చేశారు
ఐదేళ్ల వైకాపా పాలనలో గ్రామపంచాయితీలను నిర్వీర్యం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ రెడ్డి ఒక్కపైసాకూడా గ్రామాల అబివృద్ధికి నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. గ్రామాల్లో కనీస వసతులు కల్పించలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మళ్లించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం గ్రామాల అబివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.
సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు
సుజల స్రవంతి పథకం ద్వారా ఉత్తరాంధ్రాకు గోదావరి జలాలు తీసుకు వచ్చేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. 2026 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయన్నారు. విశాఖపట్నం వరకు సాగునీరు, తాగునీరు వస్తుందని, అక్కడ నుంచి శ్రీకాకుళానికి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
మూలపేట పోర్టు త్వరలో పూర్తి
జిల్లాలో ఉన్న మూలపేట పోర్టును అతి త్వరలో పూర్తి చేస్తామని, ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 6 వేల ఎకరాలు సాల్ట్ భూమి ఉందని, ఆ భూమిలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతమైన నాయకత్వంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. ఇప్పటికే మత్స్యకారులకు వేట నిషేధ భృతి కింది 20 వేల రూపాయలు ఇచ్చామని తెలిపారు.
రాష్ట్రంలోనే మోడల్ నియోజక వర్గంగా టెక్కలి
రాష్ట్రంలోనే మోడల్ నియోజక వర్గంగా టెక్కలిని తీర్చిదిద్దుతామన్నారు. 2029 నాటికి అన్ని గ్రామాల్లో తారురోడ్లు, మౌలికసదుపాయాలు కల్పిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికీ స్వచ్చమైన తాగునీరు అందిస్తామన్నారు. అందులో భాగంగా రూ. 12 వందల కోట్లతో పనులు చేపడుతున్నామని, నిధులు కూడా మంజూరు అయ్యాయన్నారు. తొలుత టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల్లో ఈ పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
మహానాడు విజయవంతం చేయండి
ఈ నెల 27 నుంచి 29 వరకు కడపలో పండగ వాతావరణంలో నిర్వహించే మహానాడును విజయవంతం చేయాలని పార్టీ నాయకులను మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. పార్టీ చరిత్రలో ఎప్పుడూ కడపలో మహానాడు నిర్వహించలేదని అన్నారు. పార్టీ ఆవిర్బావం తరువాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మెజార్టీ సాధించామని, ఈ పండగను విజయవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో నాలుగు మండలాల నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు పి. ఆజయ్‌కుమార్, జీరు భీమారావు, బోయిన గోవిందరాజులు, బోయిన రమేష్, ఎల్.ఎల్. నాయుడు, తదితరతులు పాల్లొన్నారు.