- ఏపీలోనూ చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలి
- అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి
- వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణ
- హైదరాబాద్లో వేడుకగా పురస్కారం ప్రదానం
హైదరాబాద్ (చైతన్యరథం): తెలుగు సినిమా 3 ఆస్కార్ స్థాయికి వెళ్లిందని అగ్రనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. నందమూరి బాలకృష్ణకు శనివారం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (గోల్డ్ ఎడిషన్) పురస్కారం ప్రదానం చేశారు. సినీ కెరీర్ 50 ఏళు పూర్తయినా.. ఇప్పటికీ హీరోగానే కొనసాగుతున్న బాలకృష్ణకు ఈ పురస్కారం లభించిన విషయం తెలిసిందే. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా బాలయ్యబాబు నిలిచారు. శనివారం హైదరాబాద్లో జరిగిన వేడుకలో బాలకృష్ణ ఈ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్, ఏపీ మంత్రి నారా లోకేష్, తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ తనకు ఈ ధన్యమైన జన్మనిచ్చిన తన గురువు, దైవం విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుకి, తల్లి బసవరామ తారకానికి ఘనమైన నివాళులర్పిస్తున్నానన్నారు. నాది చాలా పెద్ద కుటుంబం. నాన్న నుంచి వారసత్వంగా వచ్చింది. తల్లిదండ్రుల తర్వాత నా అభిమానులు, సినీ దర్శక, నిర్మాతలే నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. నా మనవళ్లు కూడా నన్ను ‘బాలా’ అని పిలుస్తారు. అందరికీ నేను రుణపడి ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లోనూ సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఉద్యోగ కల్పన చేయాల్సి ఉంది. కళకు భాష, ప్రాంతీయ భేదం లేదు. ఇప్పుడు తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్లింది. మన సత్తా ఏంటో సినిమా రంగం ద్వారా చూపించుకోగలుగుతున్నాం. మనమంతా గర్వించే సమయమిదని బాలకృష్ణ అన్నారు. సందర్భంగా తనకు అరుదైన గౌరవం అందించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ బాలకృష్ణకు శుభాకాంక్షలు చెప్పారు. ఆయనకు ఈ గౌరవం దక్కడం తెలుగు ప్రజలకు గర్వకారణమన్నారు. బాలకృష్ణ వయసు 65. కానీ, ఆయన్ను చూస్తే 25 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తారు. ఆయనది భోళాతనం, గంభీరత్వం, నచ్చిందే చేసే గుణం. నచ్చకపోతే రుద్రతాండవం. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ముక్కు సూటిగా చెప్పే వ్యక్తి బాలకృష్ణ సినీ చరిత్రలో 50 ఏళ్లు హీరోగా రాణించడం గొప్ప విషయం. బాలకృష్ణ డాక్టర్ కావాల్సిన వ్యక్తి యాక్టర్ అయ్యారు. అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. గతంలో బాలకృష్ణ మంచి హీరో అవుతారని భానుమతి ఏ మూహుర్తాన అన్నారో అది నిజమైంది. ఎన్టీఆర్ జీవిత కథను అద్భుతంగా ఆవిష్కరించిన వ్యక్తి బాలకృష్ణ, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. ఆవేశం, ఆక్రోశం, ఆనందం వచ్చినా జై బాలయ్య అంటే సరిపోతుంది. మరో 35 ఏళ్లు మరింత జోష్తో బాలకృష్ణ రాణించాలని బండి సంజయ్ ఆకాంక్షించారు.