- భారత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు ఇది బలమైన అడుగు
- భారీ పెట్టుబడితో విశాఖకు గూగుల్ రావడం గర్వకారణం
- ‘భారత్ ఏఐ శక్తి’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు హర్షం
- విశాఖకు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో వస్తోన్న గూగుల్
- దేశంలో తొలి ఏఐ డేటా హబ్ ప్రకటించిన టెక్ దిగ్గజం
- అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు
- సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రుల సమక్షంలో ఎంవోయూ
- డేటా సెంటర్ ఏర్పాటును ‘ఎక్స్’లో ప్రకటించిన సీఈఓ సుందర్ పిచాయ్
సాంకేతిక సువర్ణాధ్యాయం! - వికసిత్ భారత్ లక్ష్యంవైపు సాంకేతికంగా ఇది తొలి అడుగు
- సుందర్ పిచాయ్ ట్వీట్కు హర్షాతిరేకంతో ప్రధాని మోదీ రీట్వీట్
ఢిల్లీ (చైతన్య రథం): విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సాధనలో ఆంధ్రప్రదేశ్ సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచాన్ని శాసిస్తున్న డేటా, ఏఐలాంటి రంగాల్లో విశాఖ నగరం కేంద్ర బిందువుకానుంది. ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖ వేదికగా భారీ పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. అమెరికా వెలుపల అతిపెద్ద ఏఐ డేటా హబ్ను విశాలో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. ఈమేరకు ఢిల్లీలో జరిగిన ‘భారత్ ఏఐ శక్తి’ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏఐ డేటా హబ్ ఏర్పాటుకు రానున్న ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ప్రకటించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ “వచ్చే ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని గూగుల్ నిర్ణయించడం సంతోషం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఈ భారీ పెట్టుబడి భారత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఒక కొత్త అధ్యాయం. దేశంలో మొదటి గిగావాట్-స్కేల్ డేటా సెంటర్ విశాఖకు రావటం ఏపీకి గర్వకారణం. రియల్ టైమ్ డేటా, హిస్టారికల్ డేటాల సాయంతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారముంది. ఇతర దేశాలతో పోలిస్తే టెక్నాలజీని భారత్ వేగంగా అందిపుచ్చుకుంటుంది. ఏపీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్ను ప్రతీ కుటుంబానికీ దగ్గర చేసేలా ప్రయత్నిస్తాం. హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ దశ మారింది. ఇప్పుడు విశాఖలో ఏఐ డేటా హబ్ రాకతో ఏపీ దశ మారుతుంది. ప్రధాని మోదీ టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకుంటారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు గురించి చెప్పగానే ఆయన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్లోబల్ ఏఐ కాన్ఫరెన్సు నిర్వహించే విషయమై ఆలోచన చేశారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు సహకరించిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్లకు ధన్యవాదాలు. ఇంతటి భారీ పెట్టుబడిని ఏపీకి తీసుకురావటంలో ప్రధాన పాత్ర పోషించిన ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్కు అభినందనలు” అని ముఖ్యమంత్రి అన్నారు.
డేటా సెంటర్ పాలసీతో ఏపీకి అతిపెద్ద గూగుల్ ఏఐ డేటా హబ్
విశాఖలో ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేయబోతున్నట్టు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గిగావాట్ స్కేల్ కంప్యూటింగ్ కెపాసిటీ, సబ్ సీ గేట్ వే సహా భారీస్థాయి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు. దేశ ప్రగతిలో ఈ పెట్టుబడి, ఏఐ డేటా సెంటర్ కీలకంగా మారబోతున్నట్టు సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీతో మాట్లాడినట్టు సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఈ ట్వీట్పై స్పందించిన ప్రధాని మోదీ విశాఖ నగరంలో గూగుల్ ఏఐ డేటా హబ్ ద్వారా టెక్నాలజీ అందరికీ చేరువవుతుందని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా భారత నిర్మాణంలో ఈ ఐటీ మౌలిక సదుపాయం కీలకంగా మారుతుందని స్పష్టం చేశారు. ఇక భారత్ ఏఐ శక్తి పేరిట నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు ఈ ప్రాజెక్టుతో వివిధ రంగాలకు అవసరమైన సేవలు అందుతాయన్నారు. ఈ ప్రాజెక్టు అత్యంత వేగంగా అమల్లోకి రావటం దేశ ప్రగతిలో అత్యంత కీలకమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. విజనరీ నేతలు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులాంటి వారి ఆలోచనలు తీసుకువచ్చిన విధానాలవల్ల ఈ ప్రాజెక్టు సాకారమైందన్నారు. ప్రోగ్రెసివ్ పాలసీలు, నిర్ణయాల్లో డైనమిజంవల్లే ఇది సాధ్యమంటూ.. కేంద్రంలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ ఈ తరహా సుపరిపాలన ఉందిని వ్యాఖ్యానించారు. టెక్నాలజీకి ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే ఆంధ్రప్రదేశ్లోంటి రాష్ట్రాలు దేశప్రగతిలో కీలక భూమిక పోషిస్తున్నాయని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. దేశంలో డేటా సెంటర్ పాలసీ ద్వారా ఈ తరహా డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయన్నారు. ఏఐ డేటా హబ్ ఏర్పాటుతో గ్లోబల్ కనెక్టివిటీ హబ్ విశాఖ మారుతుందని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ వ్యాఖ్యానించారు. ఈ డేటా సెంటర్ ద్వారా వివిధ సంస్థలకు సరైన అవకాశాలు లభిస్తాయన్నారు. భారత్ తోపాటు వివిధ దేశాలను అనుసంధానించేందుకు విశాఖలోని డేటా హబ్ వేదిక అవుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐటీ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్నాయుడు, గూగుల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
విశాఖనుంచే ప్రపంచ దేశాలకు అనుసంధానం
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా 2030నాటికి గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిని భారత కరెన్సీలో (రూ.1.33 లక్షల కోట్లు) విశాఖలో పెట్టనుంది. అమెరికా వెలుపల ప్రపంచంలోనే భారీ పెట్టుబడిగా గూగుల్ సంస్థ స్పష్టం చేసింది. గిగావాట్ స్కేల్ కంప్యూటింగ్ సామర్థ్యంతో ఏఐ డేటా హబు గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయనుంది. గూగుల్ జెమిని ఏఐ, గూగుల్ సెర్చ్, గూగుల్ వర్క్ స్పేస్, యూట్యూబ్, క్లౌడ్, జీమెయిల్ లాంటి సేవలను ఈ హబ్ ద్వారా అందించనుంది. భారతదేశంతోపాటు దక్షిణాసియా దేశాలైన సింగపూర్, మలేసియా సహా ఆస్ట్రేలియాలాంటి దేశాలకు విశాఖ ఏఐ డేటా హబ్నుంచే గూగుల్ సేవలు అందనున్నాయి. మొత్తంగా విశాఖనుంచి 12 దేశాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేసుకునేలా అవసరమైన మౌలిక సదుపాయాలను గూగుల్ సమకూర్చుకోనుంది. ఇందులో భాగంగా సబ్ సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ నిర్మిస్తోంది. రెండు మిలియన్ మైళ్లకంటే పొడవైన సబ్ సీ కేబుల్ ద్వారా ప్రపంచానికి కనెక్టివిటీ కేంద్రంగా విశాఖ మారనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ యూజర్లకు మరింత వేగంగా సేవలందించేలా ఈ ఏఐ డేటా హబ్ సేవలు అందించనుంది.