- అది సాధ్యమైనపుడే.. సాంకేతికతకు సార్థకత
- ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గించాలి
- సాగు మొదలుకుని… మార్కెటింగ్ వరకు రైతుకు అండ
- నాణ్యమైన విద్యతో పేదల భవిష్యత్‌ను తీర్చిదిద్దాలి
- ‘గేట్స్ ఫౌండేషన్’ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి (చైతన్య రథం): అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడైనా సరే తాను టెక్నాలజీ గురించి పదేపదే మాట్లాడేది ప్రజల కోసం.. ప్రజలకు మెరుగైన సేవలందించడం కోసమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వివిధ శాఖల్లో గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై బుధవారం సచివాలయంలోని మొదటి బ్లాకులో సీఎం చంద్రబాబు సమీక్షించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పర్యావరణం, ఇన్ఫ్రా, ఆర్టీజీఎస్, స్వర్ణాంధ్ర విజన్-2047, ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌వంటి అంశాల్లో గేట్స్ ఫౌండేషనుతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఆయా రంగాల్లో టెక్నాలజీని వినియోగించుకుని ప్రజలకు సేవలను మరింత దగ్గర చేసే అంశంపై గేట్స్ ఫౌండేషన్ సహకారం తీసుకుంటోంది. ఈ సందర్భంగా ఆయా శాఖల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి చేపడుతున్న కార్యక్రమాల ప్రగతి, పురోగతివంటి అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు.
టెక్నాలజీ కావాలి.. ప్రజలకు ఉపయోగపడాలి
‘‘ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ పెద్దఎత్తున అందుబాటులో ఉంది. టెక్నాలజీ ద్వారా చాలావరకు పనులు త్వరితగతిన పూర్తి చేయగలుగుతున్నాం. అయితే ఆ టెక్నాలజీని ప్రజలకు ఎంతవరకు చేరువ చేయగలిగామనేదే ప్రధానం. రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలందిస్తోంది. ఆగస్టు 15నాటికి.. దాదాపు 95నుంచి 97శాతం ప్రభుత్వ సేవలు ప్రజలకు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి వస్తాయి. ఈ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు.. వారికి అర్థమయ్యేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. బిల్ గేట్స్ ఫౌండేషన్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఆయా రంగాల్లో అనుసరించే విధానాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. అలాగే టెక్నాలజీ పరంగా ఆయా అంశాల్లో ఎలా ముందుకెళ్లాలనే విషయంలోనూ వారికి నైపుణ్యముంది. అందుకే వారితో కలిసి పని చేస్తున్నాం. అయితే ఆయా రంగాల్లో మనం అందిపుచ్చుకున్న సాంకేతికతను ప్రజలకు.. మరీ ముఖ్యంగా పేదలకు అందుబాటులోకి తేవాలి. టెక్నాలజీ ద్వారా ప్రజలు లాభం పొందాలి. అప్పుడే సాంకేతికతకు సార్థకత చేకూరుతుంది’’ అని చంద్రబాబు అన్నారు.
విద్య, వైద్యం ప్రజలకు భారం కాకూడదు..
‘‘వైద్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో ప్రభుత్వం టెక్నాలజీని వినియోగించడానికి ప్రత్యేక కారణముంది. ఈ రంగాలు ప్రజలు, పేదలకు అత్యంత అవసరమైనవి. రానురాను వైద్యమనేది సామాన్యునికి భారంగా మారుతోంది. ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గాలి. కొన్ని కొన్ని రోగాలకు కోట్లాది రూపాయల మేర డబ్బులు అవసరమవుతున్నాయి. అందుకే ఆరోగ్యరంగాన్ని టెక్నాలజీతో అనుసంధానించే అంశంపై దృష్టి పెట్టాం. ప్రతి ఆరు నెలలకోసారి ప్రజలకు రక్త పరీక్షలు చేపట్టాలి. రోగాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అనేది ముందుగానే గుర్తించాలి. ఆ డేటా ఆధారంగా ప్రజలకు ముందుగానే ఆరోగ్య సలహాలు.. సూచనలు అందించేలా చూడాలి. ప్రజల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా వారికి కావాల్సిన వైద్య సేవలు, సూచనలు అందించాలి. ప్రతి రోజూ వ్యాయామం, యోగావంటివి చేస్తే.. సగం రోగాలు తగ్గిపోతాయి. అలాగే మన ఆరోగ్య పద్దతులు మార్చుకుంటే రోగాలు దరిచేరవు. ఇక పుట్టిన పిల్లల్లో వైకల్యం మొదలుకుని.. పోషకాహార లోపాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాన్ని గుర్తించగలగాలి. దీని కోసం కేర్ అండ్ గ్రో విధానాన్ని అనుసరిస్తున్నాం. ఎవరెవరికి ఏయే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని.. వారిని నిరంతరం మానిటర్ చేసేలా ఉండాలి. ఆఫ్ లైన్, ఆన్ లైన్ మెడికల్ కన్సల్టేషన్ ఉండాలి. తక్కువ ఖర్చుతో వైద్యం అందాలి. ఇదంతా చేయాలంటే డేటా అవసరం. అది టెక్నాలజీతోనే సాధ్యం. ఆయుష్మాన్ భారత్ డేటా మిషనుతో మన దగ్గరున్న డేటాను అనుసంధానం చేసుకోవాలి. ఇక విద్యా ప్రమాణాలు మెరుగుపడాలన్న నేటితరంలో టెక్నాలజీ వినియోగం చాలా అవసరం. నాణ్యమైన విద్యను.. తక్కువ ఖర్చుతో పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఎలా అందించాలనే అంశాలను పరిశీలించాలి. ఇది టెక్నాలజీతో సులువవుతుంది. విద్యార్థులకు చక్కటి విద్యను అందించగలిగితే.. వారి భవిష్యత్తు అందంగా ఉంటుంది. పంటలు వేయడం మొదలుకుని.. పంట అమ్ముకునేంత వరకు రైతులు ఎలాంటి మెళుకువలు అనుసరించాలనే అంశంపై పక్కా సమాచారం అవసరం. భూసార పరీక్షలకు సంబంధించిన డేటా రైతులకు అందుబాటులో ఉంటే.. దానికి అనుగుణంగా సాగు చేస్తారు. ఏమైనా లోటుపాట్లుంటే సరిదిద్దుకుంటారు. అలాగే డిమాండుకు తగ్గట్టు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. పండిరచిన పంటను మంచి ధరకు వచ్చేలా చూడాలి. ఇలా రైతుకు ప్రతి అడుగులోనూ టెక్నాలజీ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది’’ అని ముఖ్యమంత్రి సూచించారు.
ప్రజలకూ కెపాసిటీ బిల్డింగ్ అవసరమే..
‘‘ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగులో దేశంలోనే రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది. రాబోయే కాలంలో మరింత మెరుగ్గా ఉంటాం. కెపాసిటీ బిల్డింగ్ అనేది ఉద్యోగులకే కాకుండా.. ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తాం. ఇప్పుడు ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే ఉంది. ఫైళ్ల క్లియరెన్సు కూడా ఆన్‌లైన్‌లోనే చేస్తున్నాం. మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీ చేసే మెడ్ టెక్ జోన్ ఏపీలోనే ఉంది. ఇలాంటివి వేరే రాష్ట్రాల్లో లేవు. మెడ్ టెక్ జోన్‌కు మరింత టెక్నాలజీ హంగులద్దడం ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లాలి. అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తాం. ఈ యూనివర్శిటీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు రావాలి. దీనికి బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారం ఆశిస్తున్నాం’’ అని చంద్రబాబు అన్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులతో ఈ తరహా భేటీ ప్రతి రెండు నెలలకోసారి నిర్వహించుకుందామని ముఖ్యమంత్రి చెప్పారు. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.